
బాబు మాటలన్నీ ముడుపులకోసమే
- వైఎస్సార్‌సీపీ నేతలు పార్థసారథి, కొత్తపల్లి ధ్వజం
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ చేతకానితనాన్ని కప్పిపుచ్చడానికీ, తన అవినీతి అంశాలను మరుగుపరచడానికే ముఖ్యమంత్రి చంద్రబాబు వరుసగా ప్రజలను మభ్యపెట్టే ప్రకటనలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దుయ్యబట్టింది. పార్టీ అధికార ప్రతినిధి కె.పార్థసారథి, పశ్చిమగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడులు శుక్రవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ సీఎంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
సీఎం తాజాగా ఐదేళ్లలో రెండు కోట్ల ఎకరాలను సాగులోకి తీసుకొస్తానని ప్రకటనలు చేశారని, అదెలా సాధ్యమని పార్థసారథి ప్రశ్నించారు. ఇప్పటివరకు ప్రాజెక్టుల ద్వారా సాగులోకి తెచ్చిన 69 లక్షల ఎకరాలేనన్నారు. వీటిలో 20-25 లక్షల ఎకరాలు వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సాగులోకి తెచ్చినవేనని తెలిపారు. ఇప్పుడు ఐదేళ్లలో రెండు కోట్ల ఎకరాలను సాగులోకి తెస్తాననడం ప్రజలను మభ్యపెట్టడానికి కాక మరేంటని ఆయన దుయ్యబట్టారు.
చెరువు మట్టిని అమ్ముకుంటున్నారు..
చెరువుల్లో పూడిక తీసిన మట్టిని టీడీపీ నేతలు, కార్యకర్తలు రియల్‌ఎస్టేట్, ఇతర వ్యాపార అవసరాలకు అమ్ముకోవడం కోసమే నీరు-చెట్టు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని పార్థసారథి విమర్శించారు. పోలవరం, పట్టిసీమ, గోదావరి జలాలపై బహిరంగ చర్చకు వైఎస్సార్‌సీపీ సిద్ధంగా ఉందని ఆయన సవాలు విసిరారు.
ఏడాదిలో పోలవరానికి ఎంత ఖర్చు పెట్టారు? ఏ పని చే శారు?
ఉభయ గోదావరి జిల్లాలతోపాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ, కృష్ణా, గుంటూరు జిల్లాలకు సాగునీరు అవకాశాలు పెరగాలంటే ఒక్క పోలవరం ప్రాజెక్టుతోనే సాధ్యమని కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఏడాదికాలంలో చంద్రబాబు ఎంత ఖర్చుపెట్టారు? కొత్తగా ఎంత పని పూర్తిచేశారో శ్వేతపత్రం ద్వారా ప్రకటించగలరా? అని ప్రశ్నించారు.