అనంతపురం: రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అనంత వెంకట్రామిరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారమిక్కడ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ సాక్షి టీవీ ప్రసారాలు నిలిపివేయడం దుర్మార్గమన్నారు. తుని ఘటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ముద్రగడ పద్మనాభంను పరామర్శించేందుకు వెళుతున్న వైఎస్ఆర్ సీపీ నేతలను అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని వైఎస్ఆర్ సీపీ నేతలు మండిపడ్డారు.
అలాగే సాక్షి ఛానల్ ప్రసారాలు నిలిపివేయడం అప్రజాస్వామిక చర్యగా అభివర్ణించారు. ప్రభుత్వ చర్యలను ప్రజలు గమనిస్తున్నారని, తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. చంద్రబాబు తన చెప్పిందే రాసి, తాను మాట్లాడిందే చూపించాలని కొన్ని ఛానల్స్, పేపర్లను నియంత్రిస్తున్నారని మండిపడ్డారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని అడ్డుకోవాలనుకోవడం అవివేకమన్నారు.
కాగా సాక్షి ప్రసారాలు నిలిపివేయటాన్ని నిరసిస్తూ.. అనంతపురంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర జర్నలిస్టులు నిరసన తెలిపారు. ధర్నాలో జర్నలిస్టులతోపాటు సాక్షి అభిమానులు, వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వార్తలను వార్తగా ప్రసారం చేస్తున్న సాక్షి ప్రసారాలను రాష్ట్రవ్యాప్తంగా నిలిపి వేయటం ఎంత వరకు సమంజసమని ఆందోళనకారులు ప్రశ్నించారు. సాక్షి ప్రసారాలను వెంటనే పునరుద్దరించకపోతే... జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేస్తామంటూ జర్నలిస్ట్ సంఘాలు హెచ్చరించాయి.
'తుని ఘటనకు చంద్రబాబే బాధ్యత వహించాలి'
Published Sat, Jun 11 2016 1:13 PM | Last Updated on Fri, Jun 1 2018 9:07 PM
Advertisement
Advertisement