
వైఎస్సార్ సీపీకి మద్దతు తెలుపుతున్న ఆంగ్లో ఇండియన్స్
తూర్పుగోదావరి, దానవాయిపేట: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితోనే రాష్ట్రంలోని భావితరాలకు బంగారు బాట సాధ్యమని పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ మార్గాని భరత్ రామ్ అన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక రివర్ బే హోటల్‌లో ‘వుయ్ సపోర్టు జగన్– వుయ్ సపోర్ట్ భరత్’ అనే నినాదంతో అంగ్లో ఇండియన్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ కోఆర్డినేటర్ మార్గాని భరత్ రామ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాయని తెలిపారు.
రాష్ట్ర విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రజావ్యతిరేక విధానాల కారణంగా సంక్షేమం కుంటుపడిందని విమర్శించారు. ముఖ్యంగా రాజమహేంద్రవరంలో గోదావరి జలాల కాలుష్యం, పర్యాటక రంగ అభివృద్ధి, స్టేడియం నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, మెరుగైన పారిశుద్ధ్యం వంటి సమస్యల పరిష్కారానికి వైఎస్సార్ సీపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితోనే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని భరోసా ఇచ్చారు. ఈ సమావేశానికి హాజరైన పలువురు ఆంగ్లో ఇండియన్స్ వారి సమస్యలను భరత్‌కు వివరించారు. వైఎస్సార్ సీపీకి తమ మద్దతు తెలిపారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే ఆంగ్లో ఇండియన్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.