నందికొట్కూరు: అవకాశ వాద రాజకీయాలతో రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భ్రష్టు పట్టించారని నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య విమర్శించారు. శనివారం పట్టణంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. 2014లో కాంగ్రెస్ పార్టీని తిట్టి బీజేపీతో దోస్తీ చేసి అధికారం చేపట్టిన చంద్రబాబు.. ఇప్పుడు బీజేపీని తిట్టి కాంగ్రెస్‌తో దోస్తీకి సిద్ధం కావడం చూస్తే ప్రపంచంలోనే ఆయనంత అవకాశవాద రాజకీయ నాయకుడు ఇంకొకరు ఉండరన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు నిమిత్తం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో చర్చలు జరిపేందుకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం జనాలకు తెలిసిపోయిందన్నారు. ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటే తప్ప అధికారంలోకి రాలేనని చంద్రబాబుకు తెలిసిపోయిందన్నారు.
అందుకే ప్రతిసారి ఎవరో ఒకరితో అంటకాగుతూనే ఉన్నారన్నారు. దమ్మూ ధైర్యం ఉంటే కేసీఆర్‌లాగా ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. వైఎస్సార్ చేసిన మేలు ముస్లింలు మరవరని, వారు ఎప్పుడూ వైఎస్సార్‌సీపీ వెంటే ఉంటారన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు చంద్రబాబు ఆడుతున్న డ్రామాలు అందరూ గమనిస్తున్నారన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేసేంత వరకు తమ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చేది లేదన్నారు. 22 కేసులున్న కోడెల శివప్రసాద్‌ను అసెంబ్లీ స్పీకర్ ఎలా చేశారని ప్రశ్నించారు. పట్టిసీమ ప్రాజెక్ట్ వల్ల రాయలసీమకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. తంగడంచ ఫారం భూముల్లో పరిశ్రమలే స్థాపించలేదన్నారు. వేల కోట్లు దోచుకునేందుకే ప్రాజెక్ట్‌ల పేరుతో నాటకమాడుతున్నారన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీకి 50 ఎకరాల తంగడంచ ఫారం భూములు కేటాయించాలని ప్రతిపాదనలు జిల్లా కలెక్టర్‌కు పంపినా స్పందన లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment