
‘నారాయణ విద్యాసంస్థలను ఐదేళ్లు బ్యాన్ చేయాలి’
అమరావతి : పరీక్షల్లో విద్యార్థి కాపీ కొడితే ఎలా డిబారు చేస్తారో... టెన్త్ ప్రశ్నాపత్రం లీకేజీ అయినందుకు నారాయణ విద్యాసంస్థలను రాష్ట్రంలో ఐదేళ్లు బ్యాన్ చేయాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ ప్రశ్నాపత్రం లీకేజీపై ఓ మంత్రి లీక్ కాలేదంటే...మరో మంత్రి పేపర్ లీక్ అయిందంటూ పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని మండిపడ్డారు. మంత్రులకే ఓ స్పష్టత లేదని, దీనిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ ముడిపడి ఉన్న ఈ అంశాన్ని... సభలో చర్చించాల్సిన విషయం కాదని చెప్పడం సిగ్గుచేటు అని ఎమ్మెల్యే అనీల్ కుమార్ అన్నారు. తాము సభలో చర్చకు పట్టుబడితే చివరకూ... లీకేజీ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 30న ప్రకటన చేస్తారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సభను రెండుసార్లు వాయిదా వేశారని, అదే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... రెండు నిమిషాలు సమయం ఇవ్వాలని కోరినా... టైమ్ కేటాయించకపోవడం దారుణమన్నారు.
ఈ అంశంపై వైఎస్ జగన్ మాట్లాడితే దొంగలు దొరికిపోతారని ప్రభుత్వం భయపడుతోందన్నారు. వియ్యంకులు నారాయణ, గంటా శ్రీనివాసరావును కాపాడేందుకు కుట్ర జరుగుతోందన్నారు. అటెండర్ ద్వారా లీక్ అయ్యిదంటూ ఓ మంత్రి చెప్పడం, అబ్బే అసలు పేపరే లీక్ కాలేదని మరొక మంత్రి చెప్పడం సిగ్గు చేటు అన్నారు. పరీక్షలు పూర్తయి, ఫలితాలు వచ్చాక ప్రకటన చేస్తే బాగుంటుందని ఎమ్మెల్యే అనీల్ కుమార్ ఎద్దేవా చేశారు. టెన్త్ పేపర్ లీకేజీపై ఇవాళే సభలో ప్రకటన చేయాలని, వైఎస్ జగన్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పేపర్ లీక్ చేసిన నారాయణ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అనీల్ కుమార్ పేర్కొన్నారు.