వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే ధర్నాను అడ్డుకున్న టీడీపీ నేతలు
సంతకవిటి :శ్రీకాకుళం జిల్లా రాజాం వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే కంబాల జోగులు సంతకవిటిలో చేపట్టిన ధర్నాను టీడీపీ నాయకులు అడ్డుకోవడంతో బుధవారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయికొత్త పింఛన్ల వివరాల కోసం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వారు ఎంపీడీవో కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. వీరికి మద్దతుగా సాయంత్రం నాలుగు గంటలకు ఎమ్మెల్యే జోగులు అక్కడికి చేరుకొని ధర్నాలో పాల్గొన్నారు. రాత్రి ఏడు గంటల సమయంలో ఎంపీడీవో శ్రీనాథస్వామి వచ్చి ఎమ్మెల్యేతో మాట్లాడారు. కొత్త పింఛన్‌దారుల వివరాలు అందజేశారు. అరుుతే క్రమబద్ధీకరణ వివరాలు తమ వద్ద లేవని, రెండు రోజుల తరువాత ఇస్తానని చెప్పారు. అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఎంపీడీవోను నిర్బంధించి నేలపైనే కూర్చుని ధర్నా చేపట్టారు.
విషయం తెలుసుకున్న మండల ఉపాధ్యక్షుడు గండ్రేటి కేసరితో పాటు పలువురు టీడీపీ నేతలు అక్కడికి వచ్చి చేరుకుని, ఎమ్మెల్యేకు పోటీగా ఆయన ఉన్న గదిలోనే కూర్చున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ఒక సందర్భంలో టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య వాగ్వావాదం చోటుచేసుకుంది. మరోవైపు ఎంపీడీవో శ్రీనాథస్వామి పది రోజుల్లో వివరాలు అందజేస్తామని ఒప్పంద పత్రంపై సంతకం చేశారు. ఇదే సమయంలో పలు గ్రామాలకు చెందిన టీడీపీ నేతలు, కార్యకర్తలు మండల కేంద్రానికి చేరుకుని పరిషత్ కార్యాలయాన్ని ముట్టడించారు. దీంతో టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎంపీడీవోను ఎస్సై సురేష్‌బాబు బయటకు తీసుకొచ్చి పంపించేశారు. అయినా ఎమ్మెల్యేతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు లోపలే ఉన్నారు. ఎంపీడీవో చేసిన అన్యాయాలపై తమ పోరాటం ఆగదని, అర్హులకు ఫించన్ వచ్చే వరకూ పోరాడతామని ఎమ్మెల్యే కంబాల జోగులు స్పష్టం చేశారు.