కర్నూలు జెడ్పీ చైర్మన్‌ను అరెస్టు చేయాలి: వైసీపీ ఎమ్మెల్యేలు | YSRCP MLAs demands Excise commissioner to arrest Kurnool ZP chairman | Sakshi
Sakshi News home page

కర్నూలు జెడ్పీ చైర్మన్‌ను అరెస్టు చేయాలి: వైసీపీ ఎమ్మెల్యేలు

Published Fri, Nov 21 2014 2:01 AM | Last Updated on Mon, Aug 27 2018 8:31 PM

YSRCP MLAs demands Excise commissioner to arrest Kurnool ZP chairman

ఎక్సైజ్ కమిషనర్‌ను డిమాండ్ చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు
 సాక్షి, హైదరాబాద్: కల్తీ మద్యం కేసులో ముద్దాయిగా ఉన్న కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్ గౌడ్‌ను తక్షణం అరెస్టు చేయాలని ఆ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(వైసీపీ) ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. జిల్లా వైసీపీ అధ్యక్షుడు బుడ్డా రాజశేఖరరెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి, మరో నేత గౌరు వెంకటరెడ్డి గురువారం హైదరాబాద్‌లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ షంషేర్‌సింగ్ రావత్‌ను కలసి ఈ మేరకు వినతిపత్రం ఇచ్చారు. ఎక్సైజ్ అధికారులు దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో రాజశేఖర్‌ను ఐదో ముద్దాయిగా పేర్కొన్నప్పటికీ అరెస్టు చేయలేదని వివరించారు. స్థానిక ఎక్సైజ్ అధికారులపై టీడీపీ నేతల ఒత్తిడి తీవ్రంగా ఉన్న ఫలితంగా దర్యాప్తు ముందుకు సాగడం లేదని చెప్పారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని జెడ్పీ చైర్మన్ అరెస్టుకు ఆదేశాలివ్వాలని, ఇందులో ప్రమేయమున్న డోన్ ఎంపీపీ కుమారుడిని కూడా అరెస్టు చేయాలని కోరారు. నేతల నుంచి వినతిపత్రం తీసుకున్న కమిషనర్ రావత్.. పరిశీలిస్తానని హామీ ఇచ్చారు.
 
 నీతివంతమైన పాలన ఇదేనా?
 ‘సీఎం చంద్రబాబు నిత్యం వల్లించే నీతివంతమైన పాలన అంటే కల్తీ మద్యం కేసులో నిందితుడైన కర్నూలు జెడ్పీ చైర్మన్‌ను అరెస్టు చేయక పోవడమేనా? ఆయనను కేసులో నుంచి తప్పించాలని కుట్ర పన్నడమేనా?’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సూటిగా ప్రశ్నించారు. ఎక్సైజ్ కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. పొద్దున లేచినప్పటి నుంచి నీతివంతమైన పాలన గురించి సూక్తులు వల్లిస్తే చాలదని ప్రజ ల ఆరోగ్యానికి  హాని కలిగించే కల్తీ మద్యం వ్యాపారానికి పాల్పడుతున్న జెడ్పీ చైర్మన్‌ను అరెస్టు చేయాలని సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు.
 
 బుడ్డా రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 2న డోన్‌లో సాక్షాత్తూ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సొంత గ్రామాలుండే ప్రాంతంలో రూ. 12 లక్షల విలువైన కల్తీ మద్యం నిల్వలను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. దీనిలో జెడ్పీ చైర్మన్ , ఆయన పీఏ, ఇతర అనుచరులు, డోన్ ఎంపీపీ కుమారుడి ప్రమేయమున్నట్టు పట్టుబడిన వ్యక్తులు వాంగ్మూలం ఇచ్చారని అయినా చైర్మన్ పీఏను మాత్రమే అరెస్టు చేసి మిగతా వారిపై చర్యలు తీసుకోలేదన్నారు. కర్నూలు జిల్లా కలెక్టర్‌కు కూడా దీనిపై వినతిపత్రం ఇచ్చామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement