'ఓటింగ్ జరిగేవరకూ పోరాడతాం'
హైదరాబాద్ : రాష్ట్ర విభజన బిల్లుపై అసెంబ్లీలో ఓటింగ్ జరిగేవరకూ తాము పోరాడతామని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. సోమవారం ఉదయం సభ ప్రారంభం కాగానే విభజన బిల్లుపై ఎమ్మెల్యేల అభిప్రాయాలు కోరుతూ వెంటనే ఓటింగ్ నిర్వహించాలని వైఎస్ఆర్ సీపీ డిమాండ్ చేసింది. అయితే స్పీకర్ నిరాకరించటంతో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు పోడియం చుట్టుముట్టి నిరసన తెలిపారు. సభా సమావేశాలను సజావుగా నడిచేలా సహకరించాలని స్పీకర్ విజ్ఞప్తి చేసినా సభ్యులు పట్టువీడలేదు. దాంతో స్పీకర్ సభను అరగంటపాటు వాయిదా వేశారు.
సభా వాయిదా అనంతరం వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ స్పీకర్కున్న విశేషాధికారాల గురించి తాము ప్రస్తావించినా ...ఆయననుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. స్పీకర్ సభా సంప్రదాయాలను పాటించటం లేదని అన్నారు. స్పీకర్ సభాముఖంగా తమకు హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఓటింగ్ జరిగితే చంద్రబాబు బండారం బయటపడుతుందని ....టీడీపీ డ్రామాలాడుతోందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్, టీడీపీ నేతలు పోజులే తప్ప పోరాటాలు చేయటం లేదన్నారు. ఇకనైనా కాంగ్రెస్, టీడీపీ నేతలు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.