అడ్డుతగలడం సభా సంప్రదాయమా?
టీడీపీపై ధ్వజమెత్తిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు
జగన్ వాస్తవాలు వివరిస్తుంటే మంత్రులు బెంబేలెత్తుతున్నారు
అందుకే ఆయన మాట్లాడేటప్పుడు ఆటంకం కల్పించారు
స్పీకర్ మైక్ కట్ చేయడం ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమే
స్పీకర్ కేబినెట్ మంత్రి లేదా టీడీపీ కార్యకర్త కాదని గుర్తించాలి
మంత్రి దేవినేని ఉమా మాఫియా డాన్‌లా వ్యవహరిస్తున్నారు
హైదరాబాద్: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో ప్రసంగిస్తుంటే అడుగడుగునా అడ్డుతగిలి, మైక్ కట్ చేయడం సభా సంప్రదాయమా? అని వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్షం నిరసన వ్యక్తం చేసింది. గంటల కొద్దీ సభా సంప్రదాయాల గురించి, సభా మర్యాదల గురించి వల్లె వేసే టీడీపీ నేతలకు తమ వరకు వస్తే మాత్రం ప్రజాస్వామ్య విలువలు గుర్తుకురావడం లేదని ధ్వజమెత్తారు. అసెంబ్లీ మీడి యా పాయింట్ వద్ద సోమవారం విలేకరుల సమావేశంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఐజయ్య, జలీల్‌ఖాన్, అనిల్, సంజీవయ్య, నారాయణస్వామి తదితరులతో కలిసి మాట్లాడారు. 2004-09 వైఎస్ హయాం లో రామరాజ్యంలా పాలన సాగిందని, 2009 -14 మధ్య కాలంలో టీడీపీ కుమ్మక్కుతో సాగిన పాల నలో మాత్రం వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టాయని ధ్వజమెత్తారు. బడ్జెట్ చర్చ సందర్భంగా విపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి వాస్తవాలు వివరిస్తుంటే మంత్రులు, టీడీపీ సభ్యులు బెంబేలెత్తి కలవరపాటుకు గురవుతున్నారని ఎద్దేవా చేశారు.
స్పీకర్ ప్రత్యక్ష సహకారంతో టీడీపీ సభ్యులు రెచ్చిపోతున్నారని, తమ అధినేత జగన్ మాట్లాడేటప్పుడు 20 సార్లు ఆటంకం కలిగించి ప్రజాసమస్యలను అపహాస్యం చేసే విధంగా వ్యవహరించడం సిగ్గు చేటని చెప్పారు. వైఎస్సార్ సీపీ శాసనసభాపక్షం సమన్వయకర్త గడికోట శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ స్పీకర్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటూ రూల్ చదవకుండా జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడేటప్పుడు అడ్డుతగిలి, మైక్ కట్ చేయడం ప్రజాస్వామ్యాన్నే పరిహసించే విధంగా ఉందన్నారు. ఎదురు దాడి చేస్తే చంద్రబాబు మార్కులిస్తానని చెప్పి ఉంటారని, అం దుకే మంత్రులతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు పోటీ పడుతూ వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ఆక్షేపించారు. సొంత వదినను చంపిన దేవి నేని ఉమ వ్యవహారంపై ఎందుకు ఊరుకుం టున్నారని విజయవాడ నుంచి పలువురు తమ కు ఫోన్‌లు చేస్తున్నారని చెప్పారు. మంత్రి దేవినేని విజయవాడకు మాఫియా లీడర్‌లా, డాన్‌లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నీటిపారుదల రంగానికి సంబంధించి విపక్ష నేత సూచనలు చేస్తుంటే ఉమా ప్రవర్తించిన వ్యవహార శైలి చూస్తే అతనికి మతిస్థిమితం తప్పిందేమోనన్న అనుమానం కలుగుతుందన్నారు. స్పీకర్ కేబినెట్ మంత్రి కాదు.. టీడీపీ కార్యకర్త కాదనే విషయం గమనంలో ఉంచుకోవాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సూచించారు.
సీఎం మాట్లాడేటప్పుడు వైఎస్సార్ సీపీ సభ్యులు అడిగితే అవకాశమిస్తారా? లేక ప్రసంగానికి అడ్డు తగిలితే ఊరుకుం టారా? అని ప్రశ్నించారు. అధికార పక్షాన్ని నిల దీస్తున్న జగన్ ధాటికి తట్టుకోలేని మంత్రులు పలుసార్లు బయటకు వెళుతున్నారని, ప్రధాని మంత్రిని కలిసేందుకు ఢిల్లీ వెళ్ళి అక్కడ ఓ హోటల్‌లో కూర్చొని సీఎం చంద్రబాబు రిమోట్ ద్వారా సభను ఆపరేట్ చేస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీలకు మేలు చేసిన నేత చరిత్రలో వైఎస్‌ఆర్ మాత్రమేనని ఎమ్మెల్యే ఐజయ్య కొనియాడారు. వైఎస్‌ను వేలెత్తి చూపే అర్హత మంత్రి రావెల కిషోర్‌బాబుకు ఏ మాత్రం లేదని చెప్పారు.