చీప్ ట్రిక్స్ వద్దు బాబూ!
బాబులా మేం వెన్నుపోటు పొడవం
స్పష్టం చేసిన వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యేలు
‘‘తెలంగాణలో తెలుగుదేశం పార్టీ దాదాపు ఖాళీ అయ్యింది. ఇక్కడ కూడా అదే పరిస్థితి ఎక్కడ ఎదురవుతుందోనని సీఎం చంద్రబాబుకు వెన్నులో వణుకు పుట్టినట్టుంది. అందుకే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పార్టీ వీడుతున్నారంటూ అసత్య ప్రచారాలు చేయించే పనిలో పడ్డారు’’ అంటూ జిల్లాలోని వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. ‘అలాంటి చీప్ ట్రిక్స్ వద్దు బాబూ.. మేం వెన్నుపోటు పొడవం, ప్రజా సమస్యలను వదిలి.. పేదల కడుపు కొట్టేవిధంగా నడుస్తున్న దుర్మార్గపు ప్రభుత్వంపై పోరాడతాం’ అని స్పష్టం చేస్తున్నారు.
తిరుపతి: ‘‘రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న అనిశ్చితి, కాపు, బీసీ ఉద్యమాల నుంచి రాష్ట్ర ప్రజలను పక్కదారి పట్టించేందుకు తెలుగుదేశం పార్టీ మైండ్‌గేమ్ ఆడుతోంది. ఇందులో భాగంగానే ఓ పత్రికలో గురువారం ఏపీలోని నాలుగు జిల్లాల వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ కథనాన్ని ప్రచురించే పనిలో పడింది. ఇది ఆ పార్టీ ఎత్తుగడలో భాగమే’’ అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో చావు దెబ్బతిన్న ఆ పార్టీ ఇప్పట్లో కోలుకోలేని స్థితిలో ఉందని, ఇక్కడ కూడా అదే పరిస్థితి ఎక్కడ ఎదురవుతుందోనని ఆ పార్టీ అధినేతకు వెన్నులో వణుకుపుట్టి ఇలాంటి అసత్యప్రచారాలు చేయిస్తున్నారని మండిపడ్డారు.
బాబును ఎవరూ నమ్మరు
చంద్రబాబును ప్రజలు, నాయకులు ఎవ్వరూ నమ్మే పరిస్థితిలో లేరు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఆంధ్ర ప్రాంత ప్రజలు ఉన్నచోట కూడా తెలుగు దేశం పార్టీ ఓడిపోవడమే ఇందుకు నిదర్శనం. తమ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరని గ్రహించి అక్కడ ఎమ్మెల్యేలు అసహ్యించుకుని పార్టీ వీడిపోతున్నారు. ఆంధ్రలో కూడా పార్టీ టీడీపీ ఎమ్యెల్యేలు చేజారిపోతారనే భయంతో ఆయన దుష్ర్పచారానికి తెరలేపారు. ఎమ్మెల్యేలపై తప్పుడు కేసులు, ప్రలోభపెట్టి పార్టీలోకి లాక్కోవాలని చూస్తున్నారు. అలాంటి వాటిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు లెక్క చేయరు. టీడీపీ మునిగే నావ. ఆ పార్టీలో ఎమ్మెల్యేలు ఎందుకు చేరతారు.
- పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే
టీడీపీ నేతలను కాపాడుకుంటే చాలు
ప్రజా వ్యతిరేక విధానాలతో మునిగిపోతున్న నావలోకి చేరేందుకు ఎవరూ సిద్ధంగా లేరు. వచ్చే ఎన్నికల్లోపు టీడీపీ నేతలు వైఎస్‌ఆర్ సీపీలోకి రాకుండా చంద్రబాబు కాపాడుకుంటే చాలు. టీడీపీ నేతల్లా అమ్ముడుపోయే వాళ్లెవ్వరూ లేరు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ఎమ్మెల్యే టికెట్లు వాళ్లకే ఇస్తామని హామీ ఇస్తే 40 మంది వైఎస్సార్‌సీపీలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు ఎన్‌టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి సీఎం అయ్యారు. ప్రస్తుతం బాబుకు వెన్నుపోటు పొడిచేందుకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు.
-నారాయణస్వామి, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే
ఖాళీ అయిపోతుందేమోనని కవరింగ్
తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఖాళీ అయిపోయింది. ఇక్కడ కూడా ఎమ్మెల్యేలు ఎక్కడ ఆ పార్టీని వీడి వెళ్తారనే భయంతో ఎల్లో మీడియాతో కవరింగ్ చేయిస్తున్నారు. పార్టీ బలోపేతంగా ఉందని, వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అసత్యప్రచారం చేస్తున్నారు. వాళ్ల ఎమ్మెల్యేలు ఏం చేస్తారో అనే భయంతో మంత్రివర్గ విస్తరణ చేయకుండా చంద్రబాబు కాలయాపన చేస్తున్నారు. టీడీపీని అన్ని వర్గాల ప్రజలు ఇప్పటికే అసహ్యించుకుంటున్నారు. ఏం చూసి ఆయన పార్టీలో మేం చేరుతాం.
- ఆర్.కె. రోజా, వైఎస్‌ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే
చంద్రబాబును నమ్మే పరిస్థితి ఉండదు
చంద్రబాబును, ఆ పార్టీని నమ్మే పరిస్థితిలో ఎవరూ లేరు. ప్రజావ్యతిరేక విధానాలతో ఆ పార్టీ దిగజారిపోయింది. ఆ పరిస్థితి నుంచి బయటపడేందుకు ప్రజల్లో ఏదో ఒక అలజడి తీసుకువచ్చేందుకు ఆడుతున్న మైండ్‌గేమ్. ప్రజలే కాదు, ఆ పార్టీ నాయకులే చంద్రబాబును విశ్వసించడం లేదు. ఇలాంటి తరుణంలో మేం ప్రజాదరణ కలిగిన వైఎస్సార్‌సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో ఎలా చేరుతామనుకుంటున్నారు?. -ఎన్. అమరనాథరెడ్డి, పలమనేరు ఎమ్మెల్యే
మేమంతా వైఎస్సార్ వారసులం
వైఎస్సార్ సీపీ నాయకులు, ఎమ్మెల్యేలందరం వైఎస్సార్ వారసులం. జగనన్న సైనికులం, ప్రజా సేవకులం. దుర్మార్గపు ప్రభుత్వంపై పోరాటం చేస్తామే తప్ప అలాంటి పార్టీలో చేరతామనే ఊహే మా దరి చేరదు. చంద్రబాబులా అవకాశవాదులు టీడీపీలో ఉన్నారు కాబట్టే వాళ్లు పార్టీలు మారుతున్నారు. తెలంగాణలో పార్టీ మూతపడడంతో ఇక్కడ కూడా మూతపడకుండా కాపాడుకునేందుకే మైండ్‌గేమ్ ఆడుతున్నారు. -డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎమ్మెల్యే, చంద్రగిరి
ప్రజాపోరులో టీడీపీ కొట్టుకుపోతుంది
ప్రజాపోరులో టీడీపీ కొట్టుకుపోతుంది. ఎన్నికల్లో 600కుపైగా హామీలిచ్చిన చంద్రబాబు, రెండేళ్లు కావస్తున్నా ఇంతవరకు ఒక హామీని కూడా నెరవేర్చలేదు. అధికారం కోసం కులాలకు వేసిన గాలంలోనే బాబు చిక్కుకున్నారు. రాష్ట్రంలో దళిత వ్యతిరేక పాలన సాగుతోంది. ఇప్పటికే దళిత వ్యతిరేకిగా ముద్రపడిన బాబు ఎన్నికల్లో తాను మారానంటూ చెప్పి ఓట్లు వేయించుకున్నారు. అధికారంలోకి వచ్చాక ఆ దళితులకే వెన్నుపోటు పొడిచారు. -డాక్టర్ సునీల్‌కుమార్, పూతలపట్టు ఎమ్మెల్యే
వ్యతిరేక విధానాలపై పోరాటం
ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలతో కలిసి పోరాటం చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. అంతేతప్ప వెన్నుపోటుదారులకు నిలయమైన టీడీపీలో ఏ ముఖం పెట్టుకుని వెళతాం. తెలంగాణలో టీడీపీ దుకాణం బంద్ అయ్యింది. ఏపీలోనూ మూతపడే పరిస్థితి నుంచి కాపాడుకునేందుకు ఇదొక ఎత్తుగడ. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలే బాబు పాలనపై ఛీకొడుతున్నారు.
-చింతల రామచంద్రారెడ్డి, పీలేరు ఎమ్మెల్యే
ఉద్యమాలను పక్కదోవ పట్టించేందుకే
అధికారం కోసం చంద్రబాబు చేసిన అడ్డదిడ్డమైన హామీలు, అసత్యపు వాగ్దానాలతో రాష్ట్రం ఉద్యమాలతో అట్టుడికిపోతోంది. కాపు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు, అంగన్‌వాడీలు, నిరుద్యోగులు, రైతులు ఇలా అన్ని వర్గాల వారు తమ హక్కుల సాధనకోసం ఉద్యమ బాట పట్టారు. దీని నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే టీడీపీ ఆడుతున్న కొత్త నాటకం. జగన్ నాయకత్వంపై ప్రజలతో పాటు మాకూ నమ్మకం ఉంది.
-డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి, మదనపల్లి ఎమ్మెల్యే