బొందిలో ప్రాణం ఉన్నంత వరకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి వెంటే నడుస్తామని, ఈ జన్మ జగన్‌మోహన్‌రెడ్డికే అంకితమని, ఆ పార్టీ జిల్లా ఎమ్మెల్యేలు, నాయకులు స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ మునిగిపోయే నావ అని, ఆ నావను ఎక్కడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరని ఎద్దేవా చేశారు. విజయనగరం జిల్లాకు చెందిన ముగ్గురు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్లిపోతున్నారని పలు టీవీ చానళ్లలో ప్రసారాలు, పత్రికల్లో వార్తలు రావడంతో ఆ పార్టీ నాయకులంతా మంగళవారం బొబ్బిలి కోటలో సమావేశమయ్యారు.బొబ్బిలి: ‘స్వయాన మామ,తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్‌టీఆర్‌కు వెన్నుపోటు పొడిచే సమయంలో ఎమ్మెల్యేలంతా మావైపే ఉన్నారంటూ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు మైండ్‌గేమ్ ఆడారు.
ఇప్పుడు మళ్లీ అదే మైండ్ గేమ్‌కు తెరతీశారు. తెలంగాణలో ఆ పార్టీకి చావుదెబ్బ తగిలింది. ఇప్పుడు ఆంధ్రాలో ఆ పరిస్థితి రాకుండా మైండ్‌గేమ్ ఆడుతున్నార’ంటూ వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు దుయ్యబట్టారు. వైఎస్సార్‌సీపీ జిల్లా ఇన్‌చార్జి కోలగట్ల వీరభద్రస్వామి నేతృత్వంలో జరిగిన సమావేశంలో బొబ్బిలి, సాలూరు, కురుపాం ఎమ్మెల్యేలు రావు వెంకట సుజయ్ కృష్ణ రంగారావు, పీడిక రాజన్నదొర, పాముల పుష్పశ్రీవాణి, పార్టీ జిల్లా ఇన్‌చార్జి ధర్మాన కృష్ణదాసు, పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు, విజయనగరం పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జి బెల్లాన చంద్రశేఖర్, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజక వర్గ ఇన్‌చార్జి ఆర్వీఎస్‌కేకే రంగారావు (బేబీనాయన)లు ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై ధ్వజమెత్తారు.
తెలంగాణలో టీడీపీ నాయకులు టీఆర్‌ఎస్‌లో కలిసినప్పుడు ఎందుకు రాజీనామా చేయకుండా వెళ్లారని గోల పెట్టిన చంద్రబాబుకు ఆ విషయం ఇప్పుడు ఎందుకు జ్ఙాపకం రాలేదని ప్రశ్నించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్‌ఆర్‌సీపీ విజయం సాదించడం తధ్యమని స్పష్టం చేశారు. సమావేశంలో పార్టీ జిల్లా ఇన్‌చార్జి ధర్మాన కృష్ణదాసు మాట్లాడుతూ చంద్రబాబు చెప్పింది ఒకటి చేస్తున్నది మరొకటని అన్నారు. ప్రజల విశ్వాసం కోల్పోయిన చంద్రబాబు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని విమర్శించారు. అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సంపాదనే ధ్యేయంగా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. పరిపాలనపై ముందు దృష్టి పెట్టాలని హితవు పలికారు. సమావేశంలో పార్వతీపురం, ఎస్‌కోట నియోజకవర్గాల పార్టీ ఇన్‌చార్జిలు జమ్మాన ప్రసన్నకుమార్, నెక్కలి నాయుడుబాబు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి చెలికాని మురళీకృష్ణ, బొబ్బిలి మున్సిపల్ ఫ్లోర్ లీడరు రామ్మూర్తినాయుడు, జైహింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పార్టీ బలంగా ఉంది.. ఐక్యంగా ఉన్నాం
రాష్ట్రంలో, జిల్లాలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. నాయకులమంతా ఐక్యంగా ఉన్నాం. పార్టీ మారిన వారి స్థానాల్లో ఇప్పుడు ఎన్నికలు జరిపితే అక్కడ వైఎస్‌ఆర్‌సీపీయే విజయం సాధిస్తుంది. చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ 21 మంది ఎమ్మెల్యేలే కాదు ఇంకా అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీని వీడుతారు. అనేక ప్రలోభాలకు గురి చేసి వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను తీసుకెళ్తున్నారు. వారంతా అధికారం అనుభవించడానికే వెళ్తున్నారు. చంద్రబాబుకు వస్తున్న చెడ్డపేరు నుంచి దృష్టి మరల్చడానికే ఇటువంటివన్నీ చేస్తున్నారు.
-కోలగట్ల వీరభద్రస్వామి,
ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు.
ఈ జన్మ జగన్‌కే అంకితం
Published Tue, Feb 23 2016 11:59 PM | Last Updated on Tue, Oct 30 2018 5:17 PM
Advertisement
Advertisement