
సభలో అధికారపక్షం ఎదురుదాడి
అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మంగళవారం తీవ్ర గందరగోళం ఏర్పడింది. అసెంబ్లీ సాక్షిగా సమస్యను పక్కదారి పట్టించేందుకు అధికార పక్షం ఎదురుదాడికి దిగింది. మహిళలపై వేధింపులకు పాల్పడటం తప్పుకాదు కానీ, వాటిని ప్రశ్నించడమే తప్పు అన్నట్లుగా అధికారపక్ష సభ్యులు మాట్లాడారు.
మంగళవారం ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో మహిళలపై అత్యాచారాల అంశంపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ప్రస్తావించారు. రాష్ట్రంలో మహిళలపై జరిగిన దాడులను ఆమె వివరించారు. ఓ మహిళా ఎమ్మెల్యేపై ఏడాదిపాటు సస్పెండ్ చేయడం దారుణమన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఓ మహిళా శాసనసభ్యురాలిని ఏడాదిపాటు సస్పెండ్ చేసిన ఘనత చంద్రబాబు సర్కార్‌కే దక్కుతుందని మండిపడ్డారు.
విజయవాడలో కాల్‌మనీ సెక్స్‌రాకెట్ దోషులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని శాసనసభలో ప్రశ్నించారు. మంత్రి నారాయణ విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలకు ఎవరు సమాధానం చెబుతారని నిలదీశారు. రిషితేశ్వరి అనుమానాస్పద మృతిపై దోషులను కాపాడారన్నారు. ఓ మహిళపై అనంతపురంలో టీడీపీ సర్పంచ్ దాడి చేస్తే చర్యలు లేవన్నారు. ఎమ్మార్వో వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదని ఈశ్వరి సభలో ప్రశ్నించారు
అయితే ఆమె ప్రసంగానికి అధికార పక్ష సభ్యులు అడ్డుతగిలారు. హోంమంత్రి మాట్లాడకుండానే నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ ఎమ్మెల్యేలు అనిత, చింతమనేని ప్రభాకర్ ఆరోపణలు చేశారు. నా గురించి ఓనమాలు కూడా తెలియవు అంటూ ప్రతిపక్ష సభ్యులను ఉద్దేశించి చింతమనేని అనుచిత వ్యాఖ్యలు చేశారు.
దీంతో అధికార పక్ష సభ్యుల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. స్పీకర్ పోడియం వద్ద ఆందోళనకు దిగారు. టీడీపీ హయాంలో మహిళలపై దాడులు పెరిగాయంటూ నినాదాలు చేశారు. సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సమావేశాలను పది నిమిషాల పాటు వాయిదా వేశారు.