కలెక్టర్ గైర్హాజరు: నిలదీసిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు
కడప: వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ వ్యాఖ్యాలపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంటనే క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ సంఘటన మంగళవారం కడప జడ్పీ సమావేశంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.... వైఎస్ఆర్ జిల్లా కేంద్రమైన కడపలో జడ్పీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ హాజరుకాలేదు. దీంతో జిల్లాకు చెందిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు... కలెక్టర్ కె.వి.రమణ ఎందుకు ఈ సమావేశానికి హజరుకాలేదంటూ జిల్లాకు చెందిన ఉన్నతాధికారులను నిలదీశారు.
ఈ అంశంపై ఉన్నతాధికారులు నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో ఉండి కలెక్టర్ ఈ సమావేశానికి హాజరుకాకపోవడం సరైనది కాదని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అభిప్రాయపడ్డారు. పోలీసులు, అధికారులు జిల్లాకు చెందిన తమ పార్టీ ఎమ్మెల్యేలను అడుగడుగునా అవమానపరుస్తున్నారని ఆయన ఆరోపించారు. సీఆర్ఎఫ్ నిధుల విషయంలో కలెక్టర్ సమాధానం చెప్పాలని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి డిమాండ్ చేశారు.
పారిశ్రామికవేత్తలు కడప రావాలంటే భయపడుతున్నారని జిల్లా కలెక్టర్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ అంశం కడప జిల్లా వాసుల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి అన్నారు.