సాక్షి, అమరావతి: శాసన మండలి రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారిందని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి సభలో నేను సభ్యుడినైనా మండలి రద్దును ఆనందంగా స్వీకరిస్తున్నానని పేర్కొన్నారు. ‘ఎన్టీఆర్ గతంలో మండలిని చాలా స్వల్పకాలిక ప్రయోజనం కోసం రద్దు చేశారు. ఈనాడు రామోజీరావు కోసం అప్పట్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇప్పుడు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసం రద్దు నిర్ణయం తీసుకున్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన చోట రాజధాని పెట్టాలని శివరామకృష్ణ కమిటీ చెబితే.. చంద్రబాబు పట్టించుకోకుండా నారాయణ కమిటీ వేసి అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేశారు. చంద్రబాబు చేసిన దురదృష్టకరమైన నిర్ణయాలను సరిచేసేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారు. మండలిని రాజకీయ కేంద్రంగా టీడీపీ వినియోగించుకోవడం దురదృష్టకరం.
శాసనసభలో చేసిన చట్టాలకు సలహాలు, సూచనలు ఇవ్వకుండా టీడీపీ ఎమ్మెల్సీలు రాజకీయ కుట్రలకు దాన్ని వేదికగా చేసుకున్నారు. అభివృద్ధి కోసం రాజకీయాలు చేయాలే గానీ.. స్వార్థం కోసం కాదు. ఆటలో రిఫరీ నిష్పక్షపాతంగా ఉండాలి. బాల్ కొట్టకుండానే పాయింట్ ఇవ్వడం ఎంతవరకూ సమంజసం. మండలిలో చైర్మన్ చేసిన తప్పు అలాంటిదే. మండలి చైర్మన్ ఒక పార్టీ పట్ల పక్షపాతంగా వ్యవహరించడం క్షమించరాని నేరం. సభాపతులుకున్న నిబంధనలను సమీక్షించాల్సిన అవసరం ఉంది. దీనిపై ఒక కమిటీ వేయాలని కోరుతున్నా. మండలిలో జరిగిన దాని గురించి అసెంబ్లీలో చర్చించకూడదని కొందరు అంటున్నారు. జరిగిన తప్పును చర్చించకపోతేనే తప్పు అవుతుంది. చర్చించకపోతే ఇంకా తప్పులు చేస్తారు. మండలిని శాశ్వతంగా రద్దు చేయాల్సిందే’అని పిల్లి సుభాష్‌చంద్రబోస్
పేర్కొన్నారు.
ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతిస్తా
‘మండలిలో సభ్యులుగా ఉన్న నేను, నా సహచర మంత్రి సుభాష్ చంద్రబోస్ పదవులను తృణప్రాయంగా వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర భవిష్యత్ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం. పెద్దల సభగా పిలిచే శాసన మండలిని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతిస్తున్నాం. పాలకులు ప్రజల కోసం ఈ సభలో చర్చించి తీసుకున్న నిర్ణయాలపై పెద్దల సభలో మంచి సూచనలు, సలహాలు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. గడచిన నాలుగు రోజుల్లో చంద్రబాబు రెండు నాలుకల ధోరణితో ప్రజా సంక్షేమానికి ఉపయోగపడే బిల్లులను అపహాస్యం చేశారు. చంద్రబాబు నిర్వాకం వల్ల ఆ చట్ట సభల్లోని సభ్యులు తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇండియా టుడే సర్వేలో దేశంలోనే అత్యుత్తమ పరిపాలనా దక్షత ఉన్న ముఖ్యమంత్రుల్లో నాలుగో స్థానంలో ఉన్న ఘనత జగన్‌ది. మా పార్టీ నుంచి మండలికి నామినేట్ అయిన సభ్యులు ప్రజా జీవితంలో గుర్తింపు పొందిన వ్యక్తులు. చంద్రబాబు దోపిడీదారులను మండలికి నామినేట్ చేశారు’ అని మార్కెటింగ్, పశు సంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు వ్యాఖ్యానించారు.
చదవండి:
ప్రజా ప్రయోజనాల కోసమే..
Comments
Please login to add a commentAdd a comment