
ఎమ్మెల్సీ ఓటర్ల నమోదును పొడిగించాలి
సీఈవో భన్వర్‌లాల్‌ను కోరిన ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియను మరో పక్షం రోజులపాటు పొడిగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరింది. పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి బుధవారం సచివాలయంలో ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. ఆన్‌లైన్ ద్వారా ఓటరు నమోదు చేయాలనుకుంటున్న వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సర్వర్ చాలా ఆలస్యంగా లభ్యమవుతున్నందున ఒక కంప్యూటర్‌పై గంటకు ముగ్గురు, నలుగురికన్నా ఎక్కువగా నమోదు చేయించుకోలేకపోతున్నారని, రాష్ట్రంలో అనేక చోట్ల నుంచి ఫిర్యాదులు అందాయని వినతిపత్రంలో పేర్కొన్నారు.
ఈ కారణంగా కనీసం 50 శాతం మంది కూడా నమోదు చేసుకోలేరేమోనన్న ఆందోళనను విజయసాయిరెడ్డి వ్యక్తం చేశారు. కనుక నవంబర్ 5వ తేదీ వరకున్న నమోదు గడువును మరో పక్షం రోజులకు పొడిగించాలని కోరారు. మాన్యువల్ దరఖాస్తులను స్వీకరించడానికి నియమితులైన సిబ్బందిని మరిన్ని అదనపు గంటలు పని చేసేలా ఆదేశాలివ్వాలని, ఇలాంటి క్లెయింలను స్వీకరించి తగిన రసీదులు ఇచ్చేలా చూడాలని విజయసాయిరెడ్డి కోరారు.
డిసెంబర్ 23 వరకూ నమోదు చేసుకోవచ్చు : ప్రస్తుత ఓటరు నమోదు ప్రక్రియను ఈనెల 7వరకే పొడిగించే అవకాశం ఉందని, అదీ తాను కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతికి సిఫార్సు చేయగలనని భన్వర్‌లాల్ తమకు చెప్పారని విజయసాయిరెడ్డి తెలిపారు. సీఈవోను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నవంబర్ 22న పట్టభద్రుల ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రకటిస్తారని భన్వర్‌లాల్ తమకు చెప్పారన్నారు. ఆ మరుసటి రోజు నవంబర్ 23 నుంచి డిసెంబర్ 23 వరకు తొలి విడతలో ఓటర్లుగా నమోదు కాలేకపోయిన వారు, పేర్లు గల్లంతైన వారు తాజాగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని వివరించారన్నారు. అన్నీ చేర్చాక తుది జాబితా వెల్లడవుతుందన్నారు.