గ్లోబలైజేషన్ ప్రక్రియతో ప్రపంచం ‘కుగ్రామం’గా మారిపోతున్న తరుణంలో అమెరికా ఆర్థికవ్యవస్థ ఆరోగ్యమే అన్ని దేశాలకూ దిక్సూచి అవుతోంది. అట్లాంటిక్ మహాసముద్రానికి ఆవల ఉన్న ఈ అత్యంత ధనిక దేశం ఆర్థికస్థితి ఇప్పుడు బాగుందనే వార్త ప్రపంచ దేశాలకు ఉత్సాహాన్నిస్తోంది. 2023 రెండో క్వార్టర్‌లో అమెరికా ఆర్థికాభివృద్ధి వేగం పుంజుకుంది. పరిస్థితి అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చన్న ఆర్థికవేత్తలు, విశ్లేషకుల అంచనాలు తప్పని రుజువయ్యాయి. అమెరికా ఆర్థిక ప్రగతి బలపడుతోందన్న అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం చెప్పిన మాటలకు తాజా గణాంకాలు తోడయ్యాయి.
ఈ ఏడాది రెండో క్వార్టర్ కాలంలో (ఏప్రిల్, మే, జూన్) అమెరికా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2.4 శాతం చొప్పున పెరిగిందని గురువారం ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది తమ దేశం ఆర్థిక మాంద్యంలో చిక్కుకునేది లేదని అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ ఆర్థికవేత్తలు, అమెరికా కాంగ్రెస్ బడ్జెట్ ఆఫీస్ ఈ మధ్యనే చేసిన ప్రకటనలు నిజమయ్యాయి. ప్రస్తుతం అమెరికాలో అర్హతలున్నవారికి ఉద్యోగాలు వస్తున్నాయి. వాస్తవానికి కొత్త ఉద్యోగాలు, ఉద్యోగ ఖాళీలన్నీ నింపడానికి తగినంత మంది అమెరికాలో దొరకడం లేదట. ఈ పరిస్థితి నిరుద్యోగ సమస్య బాగా తగ్గిపోయింది.
ఆర్థికపరమైన ఆటుపోట్లు తట్టుకుని ముందుకు సాగే ‘లాఘవం’ నేడు అమెరికా ఆర్థికవ్యవస్థలో కనిపిస్తోందని ప్రసిద్ధ అకౌంటింగ్ సంస్థ ఆర్.ఎస్.ఎం ప్రధాన ఆర్థికవేత్త జో బ్రూస్యులస్ అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా అందరి అంచనాలకు భిన్నంగా అగ్రరాజ్యం ఆర్థిక వ్యవస్థ బలంగా ముందుకు సాగడం ప్రపంచానికి శుభసూచకమే. ఈ ఏడాది రెండో క్వార్టర్‌లో– ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యానికి దర్పణంలా పనిచేసే జీడీపీలో 1.5% వృద్ధిరేటు కనిపిస్తుందని ప్రఖ్యాత ఆర్థిక వ్యవహారాల మీడియా సంస్థలు బ్లూంబర్గ్, వాల్ స్ట్రీట్ జర్నల్ ఇంటర్వ్యూ చేసిన ఆర్థికవేత్తలు అంచనావేశారు. కాని, అంతకు మించి (2.4%) జీడీపీ రేటు ఉండడం అమెరికా పాలకపక్షానికి, ప్రజలకు ఆనందన్ని ఇస్తోంది.
ఆర్థికమాంద్యం ఉందడని ఫెడ్ ప్రకటించాక రెండో క్వార్టర్ జీడీపీపై అంచనా
ఈ ఏడాది అమెరికా ఆర్థికమాంద్యాన్ని ఎదుర్కొనే అవకాశం లేదని ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ప్రకటించిన మరుసటి రోజే అమెరికా వాణిజ్య శాఖ రెండో క్వార్టర్ జీడీపీ అంచనా వివరాలు వెల్లడించింది. మరో ఆసక్తికర విషయం ఏమంటే వడ్డీ రేట్లను (25 బేసిక్ పాయింట్లు) ఫెడ్ బుధవారం పెంచింది. 2022 మార్చి నుంచి వడ్డీ రేట్లను పెంచడం ఇది 11వ సారి. గడచిన 20 ఏళ్లలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి వడ్డీ రేట్లను ఇంత ఎక్కువగా పెంచడం కొందరికి ఆశ్చర్యం కలిగిస్తోంది.
దేశంలో వినియోగదారులు గతంతో పోల్చితే కాస్త ఎక్కువ ఖర్చుచేయడం, మొత్తం ఆర్థికవ్యవస్థలోకి వచ్చిన పెట్టుబడులు, రాష్ట్ర, స్థానిక, ఫెడరల్ స్థాయిల్లో ప్రభుత్వాల వ్యయం అమెరికా జీడీపీ పెరగడానికి దోహదం చేశాయని బ్యూరో ఆఫ్ ఇకనామిక్ ఎనాలిసిస్ అభిప్రాయపడింది. అన్ని ఉద్యోగ ఖాళీల భర్తీకి అవసరమైనంత మంది అందుబాటులో లేకపోవడం దేశంలో వేతనాలు పెరగడానికి దారితీసింది. జూన్ మాసంలో వార్షిక ద్రవ్యోల్బణం రేటు మూడు శాతానికి చేరుకుంది. అయితే, 2021 మార్చి నుంచి చూస్తే ఇదే అత్యల్పమని ఈ నెలలో ప్రభుత్వం ప్రకటించింది. అనేక కారణాల వల్ల 2023 ద్వితీయార్థంలో ద్రవ్యోల్బణం పరిస్థితి మెరుగవుతుందని గోల్డ్ మన్ శాక్స్ రీసెర్చ్ సంస్థలో ప్రధాన అమెరికా ఆర్థికవేత్త డేవిడ్ మెరికిల్ చెప్పారు.
అనుకున్నదానికంటే మెరుగైన రీతిలో అమెరికా ఆర్థికవ్యవస్థ పయనించడంతో దేశంలోని వినియోగదారులు, వ్యాపారులేగాక అక్కడ చదువుకుంటున్న లక్షలాది మంది అంతర్జాతీయ విద్యార్థులు, ఉద్యోగాలు ఆశించే సాంకేతిక నైపుణ్యాలున్న విదేశీ యువకులు సంతోషపడుతున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఒక రైలింజనులా ముందుకు నడిపించే స్థితిలో అమెరికా ఆర్థిక ప్రగతి ప్రస్తుతం ఉంది. ప్రపంచీకరణ పూర్తవుతున్న దశలో అమెరికా ఆరోగ్యమే ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలకూ మహద్భాగ్యంగా ఇప్పటికీ ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
- విజయసాయిరెడ్డి, వైఎస్సార్ సీపీ, రాజ్యసభ సభ్యులు
Comments
Please login to add a commentAdd a comment