వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి(పాత చిత్రం)
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం 13 జిల్లాలు ఉన్నాయి.. త్వరలో 25 జిల్లాలు కాబోతున్నాయని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ వి.విజయసాయి రెడ్డి తెలిపారు. గురువారం వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమీక్షా సమావేశంలో విజయసాయి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..‘పాదయాత్ర సమయంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా హామీలు ఇచ్చారు..వాటిని నేరవేర్చేందుకు చాలా కృషి చేస్తున్నారని చెప్పారు. పార్టీ కోసం పనిచేసే వారికి సముచిత స్థానం కల్పిస్తామని మాటిచ్చారు..ఆ దిశగా ఆలోచనలు జరుగుతున్నాయని వివరించారు.
వాలంటీర్ల నియామకం గురించి ఆలోచన చేశాం.. ప్రజలకు సేవ చేస్తున్నామన్న భావనతో ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. ప్రజలకు అవినీతి రహిత పాలన అందించి తిరిగి 2024లో అధికారంలోకి రావాలని కార్యకర్తలకు హితబోధ చేశారు. గ్రామ వాలంటీర్లుగా చేయాలకునేవారు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గ్రామ సెక్రటేరియట్ నిర్మాణం జరుగుతోందని, ఇందులో కూడా ఉద్యోగాలు ఉంటాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించాలని ఉపదేశించారు. ఇందుకోసం ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చే ఆలోచన చేస్తున్నామని చెప్పారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు ఇటీవల కాలంలో తగ్గిపోయాయని అందరూ అభిప్రాయపడుతున్నారు..అయితే , కేంద్ర కార్యాలయం హైదరాబాద్ నుంచి అమరావతికి తరలిస్తున్నాం.. కొత్త కార్యాలయం ఏర్పాటు జరుగుతోంది.. త్వరలోనే పార్టీ కార్యక్రమాలను ముమ్మరం చేస్తామని వ్యాఖ్యానించారు. పార్టీ కోసం సేవ చేసే వారందరికీ సముచిత స్థానం దక్కుతుందని మీకు మాటిస్తున్నానని తెలిపారు. పార్టీ కార్యాలయంలో శని, ఆది వారాలలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.
చదవండి: కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు
Comments
Please login to add a commentAdd a comment