
దేశానికి దిశానిర్దేశం చేసిన అంబేడ్కర్
► అంబేడ్కర్ బాటలో పయనించి పేదల అభ్యున్నతికి పాటుపడిన దివంగత వైఎస్సార్
► రాజ్యాంగానికి విరుద్ధంగా కొనసాగుతున్న నేటి చంద్రబాబు ప్రభుత్వం
► అంబేడ్కర్ జయంతిలో ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
ఒంగోలు అర్బన్ : దేశానికి దిశా నిర్దేశం చేసిన మహానీయుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్..అని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. స్థానిక వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో అంబేడ్కర్ 126వ జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ మాట్లాడుతూ ఆర్థిక, సామాజిక, రాజకీయ అంశాల్లో అంబేడ్కర్ చేసిన సేవలు మరువలేమ్మన్నారు. అంబేడ్కర్ 1891 ఏప్రిల్ 14న ఓ దళిత కుటుంబంలో 14వ సంతానంగా జన్మించారని ఎంపీ చెప్పారు. పేద కుటుంబంలో జన్మించినా ప్రపంచం మొత్తం గర్వించేలా ఆయన సేవలు, ఆలోచనలు ఉన్నాయని, వాటిని ఇప్పటి ప్రభుత్వాలు ముందుకు తీసుకెళ్లాలని కోరారు.
హిందువుగా జన్మించి బౌద్ధునిగా మరణించారని చెప్పారు. అంబేడ్కర్ ఆశయాలను దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చిత్తశుద్ధితో అమలు చేశారని గుర్తు చేశారు. దళిత రైతులకు 36 లక్షల హెక్టార్లు భూమిని పంపిణి చేసిన ఘనత దివంగత నేతదేనన్నారు. దళిత, బలహీన బడుగు వర్గాలు డబ్బులు లేవని విద్య, వైద్యానికి దూరం కాకూడదని ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ వంటి మహోన్నత పథకాలు అందించారని ఎంపీ వైవీ వివరించారు.
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన సీఎం
ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఎంపీ వైవీ మండిపడ్డారు. ఇతర పార్టీ గుర్తుతో గెలచిన ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకోవడమే కాకుండా అంబేడ్కర్ నిర్మించిన రాజ్యాంగాన్ని అవమానుపరుస్తూ మంత్రి పదవులు కట్టబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేడ్కర్ సేవలకు తగ్గట్టుగా ఆయనకు భారతరత్న ఇవ్వడం సంతోషకరమని ఎంపీ వైవీ పేర్కొన్నారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే డాక్టర్ ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ దళితుల అభ్యున్నతికి అంబేడ్కర్ చేసిన సేవలు మరువలేనివన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అంబేడ్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని కోరారు. అంబేడ్కర్ ఏ ఒక్కరి సొంతం కాదని, ఆయన జాతి సంపదని కొనియాడారు.
కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి, రాష్ట్ర అదనపు కార్యదర్శి చుండూరి రవి, లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బడుగు కోటేశ్వరరావు, మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుభానీ, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి రమణమ్మ, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డేవిడ్, వైఎస్సార్ టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కేశవరపు జాలిరెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు జజ్జర ఆనందరావు, సేవదళ్ జిల్లా అధ్యక్షుడు ఓబుల్‌రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గంటా రామానాయుడు, మహిళా విభాగం జిల్లా అధికార ప్రతినిధి బడుగు ఇందిర, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి, డీఆర్‌యూసీసీ సభ్యుడు వేమూరి సూర్యనారాయణ, యువజన విభాగం జిల్లా అధికార ప్రతినిధి చిన్నపురెడ్డి అశోక్‌రెడ్డి నాయకులు వై.వెంకటేశ్వరరావు, కాకుమాను రాజశేఖర్, అక్కిరెడ్డి, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు అనూరాధ, ట్రేడ్ యూనియన్ నగర అధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి, మైనార్టీ సెల్ నగర అధ్యక్షుడు మీరావళి, రూరల్ మండల అధ్యక్షుడు రాయపాటి అంకయ్య పాల్గొన్నారు.
పార్టీ ఎస్సీ సెల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని నీలాయపాలెం, హెచ్‌సీఎం కాలేజీ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహాలకు ఎంపీ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ నిర్వహించిన అంబేడ్కర్ జయంతి కార్యక్రమంలో ఎంపీ వైవీ పాల్గొన్నారు.