
రాజీనామా చేశారని లీకులెందుకు?: వైవీ సుబ్బారెడ్డి
హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జీవితమంతా ఎమ్మెల్యేలను కొనడమేనని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించటం ఏపీ సీఎంకు కొత్తకాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. చంద్రబాబు దిగజారుడుతనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని అన్నారు. హైదరాబాద్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరి కొత్తగా మంత్రి పదవులు చేపట్టిన నలుగురు ఎమ్మెల్యేలు భూమా అఖిలప్రియ, అమర్‌నాథ రెడ్డి, ఆదినారాయణరెడ్డి, సుజయ్ కృష్ణ రంగారావు ఒకవేళ నిజంగానే రాజీనామా చేస్తే ఆమోదించాలన్నారు. అయితే ఆ నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని లీకులివ్వడమేంటని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. పార్టీ ఫిరాయించిన నేతలకు ఏపీ కేబినెట్ లో చోటు కల్పించడం దారుణమని పేర్కొన్నారు.
ఫిరాయింపుల అంశంపై రెండు, మూడు రోజుల్లో రాష్ట్రపతి, ప్రధానిని కలుస్తామని చెప్పారు. ఈ నెల 7న అన్ని నియోజకవర్గాల్లో ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. అన్ని పార్టీల నేతలను కలిసి ఏపీలోని పరిస్థితులను వివరించనున్నట్లు తెలిపారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు అనైతికమని, ఫిరాయింపుల వ్యవహారం ఒక్క పార్టీకి సంబంధించినది కాదని చెప్పారు. పార్టీ మారిన వారిపై నిర్ణీత సమయంలో చర్యలు తీసుకోవాలని, ఆ మేరకు రాజ్యాంగ సవరణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల 7న అన్ని నియోజక వర్గాలలో వైఎస్సార్ సీపీ చేపట్టనున్న ధర్నాలకు అందరు మద్దతివ్వాలని.. ప్రజాస్వామ్యవాదులంతా కలిసి రావాలని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు.