శ్రీకృష్ణదేవరాయలు, మార్గాని భరత్
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనా వ్యయాన్ని ఆమోదించాలని పార్లమెంటు వేదికగా మరోసారి వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేసింది. సోమవారం ఆ పార్టీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, మార్గాని భరత్ లోక్‌సభలో బడ్జెట్‌పై జరిగిన చర్చలో మాట్లాడారు. గణనీయమైన రెవెన్యూ వాటా హైదరాబాద్‌కు వెళ్లిపోవడమే కాకుండా ఆదాయాన్ని తెచ్చే వనరులు లేకపోవడం వల్ల ఏపీకి ప్రత్యేక హోదా అవసరమన్నారు. శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. ‘పన్నుల వాటా తగ్గడంతో ఏపీ ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉంది. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు, ఇతర రాష్ట్రాలతో సమానంగా పోటీ పడగలిగే పరిస్థితి వచ్చేందుకు హోదా ఇవ్వాలని ప్రధానిని కోరుతున్నాం.
రాష్ట్రానికి తగిన నిధులు కేటాయించాలని ఆర్థిక మంత్రికి విజ్ఞప్తిచేస్తున్నా. ఏపీకి పోలవరం ఒక జీవ రేఖ. ఇది జాతీయ ప్రాజెక్టు కూడా. రాష్ట్ర ప్రభుత్వం రూ.11,860.50 కోట్ల మేర దీనిపై వెచ్చించింది. రూ. 3,283 కోట్ల మేర రాష్ట్రానికి కేంద్రం రీయింబర్స్ చేయాల్సి ఉంది. అలాగే ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ. 55,548.87 కోట్లుగా సాంకేతిక సలహా కమిటీ ఆమోదించినప్పటికీ సవరించిన వ్యయం కమిటీ వద్ద పెండింగ్‌లో ఉంది. దీనిని తక్షణం ఆమోదించాల్సిన అవసరం ఉంది. విభజన చట్టంలో పొందుపరిచిన మేరకు వైఎస్సార్ జిల్లాలో స్టీలు ప్లాంటు ఏర్పాటు చేయాలి. కాకినాడ, విశాఖపట్నం, తిరుపతి, అమరావతి నగరాలకు స్మార్ సిటీ పథకంలో భాగంగా కేటాయించిన రూ. 9,081 కోట్లను తక్షణం విడుదల చేయాలి. విశాఖ– చెన్నై పారిశ్రామిక కారిడార్‌కు, అమరావతి– అనంతపురం ఎక్స్‌ప్రెస్ మార్గానికి తగిన రీతిలో కేంద్రం సహకారం అందించాలి’ అని విజ్ఞప్తి చేశారు.
అమ్మ ఒడి, నాడు– నేడుకు నిధులివ్వండి
దారిద్య్ర రేఖకు దిగువన ఉండి బడికి వెళ్లే పిల్లలు ఉన్న తల్లులకు ఏపీ ప్రభుత్వం అమ్మ ఒడి పథకం ద్వారా ఏటా రూ. 15 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోందని వివరించారు. నాడు–నేడు పథకం ద్వారా తొలి విడతలో 15,715 పాఠశాలలను ఆధునికీకరిస్తోందని వివరించారు. ఈ రెండు పథకాలకు కేంద్రం ఆర్థిక సహకారం అందించాలని అభ్యర్థించారు. ఏపీలో 12 జాతీయ స్థాయి విద్యాసంస్థలు నెలకొల్పాల్సి ఉందని గుర్తు చేశారు. ఇందులో 7 సంస్థలకు రూ. 2,209 కోట్లు కేటాయించగా.. కేవలం రూ. 1,020 కోట్లు విడుదలయ్యాయని, మిగిలిన మొత్తం కూడా త్వరితగతిన విడుదల చేయాలని నివేదించారు. రాష్ట్రాలకు జీఎస్టీ బకాయిలు చెల్లించడంలో కేంద్రం జాప్యం చేస్తోందని, రెవెన్యూ లోటు ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు ఇది ఇబ్బందికరమన్నారు.
కేంద్ర బడ్జెట్ ఏపీకి అసంతృప్తిని మిగిల్చింది..
కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్‌కు అసంతృప్తి మిగిల్చిందని ఎంపీ మార్గాని భరత్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రత్యేక హోదా అంశం అటు రాష్ట్రపతి ప్రసంగంలోనూ, ఇటు బడ్జెట్‌లోనూ లేదు. ఇది 5 కోట్ల ప్రజలకు తీవ్ర నిరాశను మిగిల్చింది. సీఎం వైఎస్ జగన్ ప్రధాన మంత్రిని, హోం మంత్రిని పలుమార్లు కలసి ప్రత్యేక హోదా ఇవ్వాలని అడిగారు. కానీ కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా ఇవ్వొద్దని చెప్పిందని సాకులు చెబుతూ వచ్చింది. దీంతో హోదాకు సిఫారసు చేయాలని 15వ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం విన్నవించింది. అయితే హోదా కేటాయింపు అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉందని 15వ ఆర్థిక సంఘం చెప్పింది. రాష్ట్ర విభజన సమయంలో తల్లిని చంపి శిశువును కాపాడిందని ప్రధాన మంత్రి స్వయంగా కాంగ్రెస్‌ను ఉద్దేశించి చెప్పారు. అందువల్ల ప్రధాన మంత్రి కేంద్ర ప్రభుత్వ హామీలను నెరవేర్చాలి’ అని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment