ఎంపీ విజయసాయిరెడ్డి ఛాంబర్‌ను ప్రారంభిస్తున్న శాసనసభాపక్ష ఉపనేత బూడి ముత్యాలనాయుడు, ఆఫీస్ ఛాంబర్ ప్రారంభిస్తున్న గుడివాడ అమర్‌నాథ్
మద్దిలపాలెం(విశాఖ తూర్పు): ఇంతవరకూ సొంతంగా పార్టీ కార్యాలయం లేకపోవడం.. ఇప్పుడు పూర్తి హంగులతో, అత్యాధునిక సౌకర్యాలతో మద్దిలపాలెం డాక్టర్.వి.ఎస్.కృష్ణా ప్రభుత్వ కాలేజీ దగ్గర సొంత పార్టీ కార్యాలయం నిర్మితమవడం వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నేతల్లో కొత్త ఉత్సాహం మొదలైంది. తమ గొంతు వినిపించేందుకు, తమ భావాలు పంచుకునేందుకు, ప్రజలకు చేరువయ్యేందుకు ఓ వేదిక దొరికినందుకు పార్టీ అంతర్గతంగానూ సమరోత్సాహం మొదలైంది. ఇందుకు పూర్తి సహాయం అందించిన పార్టీ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్‌ను ప్రశంసలతో ముంచెతుతున్నారు. కార్పొరేట్ లుక్‌తో కనిపిస్తున్న పార్టీ కార్యాలయాన్ని తిలకించేందుకు కార్యకర్తలు తరలివస్తున్నారు. వెయ్యిమందితో సమావేశానికి వీలుగా విశాలమైన సభాప్రాంగణం, ముఖ్యనేతల సమావేశానికి వీలుగా ఏసీ కాన్ఫరెన్స్ హాల్‌తోపాటు, ఎంపీ విజయసాయిరెడ్డి సహా, ఇతర నాయకులకు ప్రత్యేకంగా చాంబర్లు నిర్మించారు. పార్టీ కార్యాలయం విశాఖ ‘విజయ’ మణిహారంగా నిలుస్తుందని వక్తలు కొనియాడారు.
మళ్ల విజయప్రసాద్ తన సొంత నిధులతో అద్భుతంగా నిర్మించిన ఈ కొత్త కార్యాలయాన్ని పార్టీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి, మాడుగుల ఎమ్మెల్యే, శాసన సభాపక్ష ఉపనేత బూడి ముత్యాలనాయుడు, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, విశాఖ, అనకాపల్లి పార్లమెంట్ జిల్లాల అధ్యక్షులు తైనాల విజయకుమార్, గుడివాడ అమర్‌నాథ్, మాజీ మంత్రి తమ్మినేని సీతారాం తదితరులు హాజరయ్యారు.
నా చిరకాల కోరిక :మళ్ల విజయప్రసాద్
‘సొంత నిధులతో సర్వాంగ సుందరంగా పార్టీ కార్యాలయం నిర్మించాలనే నా చిరకాల కోరిక నెరవేరింది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశీస్సులు, పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దీవెనలతో కార్యాలయం నిర్మించాం. సొంతింట్లో కలిసి మెలసి ఉండేలా కార్యకర్తలకు సదుపాయాలు కల్పించాం’. నవరత్నాల పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతోపాటు టీడీపీ నేతల అరాచకాలను ఎండగట్టాలని ఈ సందర్భంగా కార్యకర్తలను కోరారు.
దుష్టపాలనకు అంతిమ ఘడియలు: బూడి ముత్యాలనాయుడు
‘పార్టీ అధినేత జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రతో రాష్ట్రంలో దుష్ట పరిపాలనకు అంతిమ ఘడియలు ప్రారంభమయ్యాయి. సంక్షేమాన్ని గాలికొదిలి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన టీడీపీని సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నవరత్నాల పథకాలు నవ్యాంధ్రకు స్వర్ణమయం చేస్తాయి. పేదల సమస్యలు నేరుగా తెలుసుకునేందుకే జగన్ యాత్ర చేపట్టారు. జనం బ్రహ్మరథం పడుతున్నారు.
మోసగాడు గంటా:గుడివాడ అమర్‌నాథ్
‘ఒంగోలు నుంచి వలస వచ్చిన గంటా శ్రీనివాసరావు రెండు దఫాలు మంత్రిగా చేసి, 20 ఏళ్లగా రాజకీయాల్లో ఉంటున్నా విశాఖ జిల్లాకు ఆయన చేసిందేమీ లేదు. మంత్రి ముగుసులో భూ కబ్జాలు, దందాలు చేస్తున్నారు. బ్యాంకులో ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టి బురిడీ కొట్టించిన 420 మంత్రి ఆయన. జననేత వైఎస్ జగన్‌మోహనరెడ్డి గురించి మాట్లాడే అర్హత ఇలాంటి మోసగాడికి లేదు. మంత్రి గంటా 420 అయితే సీఎం చంద్రబాబు 840. ప్రజాధనంతో చంద్రబాబు దుబాయ్‌కి, తనయుడు అమెరికాకు తిరుగుతున్నారు’.
నిజాయితీకి మారుపేరు వైఎస్సార్ సీపీ: తైనాల
‘నిజాయితీ, నిబద్ధత, సొంత నిధులతో పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకున్నాం. టీడీపీలాగా దండుకొని, దందా చేసి, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించలేదు. నిజాయితీగా సేవ చేయడానికి ప్రజాసంకల్పయాత్రతో మా పార్టీ అధినేత జగన్‌మోహనరెడ్డి 3వేల కి.మీ పాదయాత్రకు పూనుకున్నారు. ఆ యాత్రకు వస్తున్న స్పందనతో టీడీపీ నేతల గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా, ఇంత వరకు గవర్నర్‌ను మార్చమని అడగలేని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పడు కొత్త గవర్నర్ కావాలని అడగడం విడ్డూరంగా ఉంది’.
Comments
Please login to add a commentAdd a comment