వైఎస్సార్‌సీపీ అభ్యర్థులుగా నాని, గంగుల
మండలికి ఖరారు చేసిన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: శాసన సభ నుంచి శాసన మండలికి త్వరలో జరగనున్న ద్వైవార్షిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని), గంగుల ప్రభాకర్‌రెడ్డి పేర్లను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఖరారు చేశారు. అభ్యర్థుల విషయమై జగన్ నాలుగు రోజులుగా పార్టీ సీనియర్ నేతలతో విస్తృతంగా చర్చించారు. వారి అభిప్రాయాలు, సలహాలు తీసుకున్న అనంతరం గురువారం వీరిద్దరి పేర్లను జగన్‌మోహన్‌రెడ్డి ఖరారు చేశారని పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఆళ్ల నాని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వారు. కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన గంగుల ప్రభాకర్‌రెడ్డి ఇటీవలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
సేవ చేస్తారని గెలిపిస్తే ప్రజల్ని దోచుకుంటున్నారు : నాని, గంగుల
సేవ చేస్తారని ప్రజలు ఓట్లేసి టీడీపీ నేతలను గెలిపిస్తే చివరికి వారినే దోచుకుతింటున్నారని ఎమ్మెల్యే కోటాలో శాసనమండలి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఆళ్ల నాని, గంగుల ప్రభాకర్‌రెడ్డిలు మండిపడ్డారు. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపిక చేసినందుకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
మూడు చోట్ల పీడీఎఫ్ అభ్యర్థులకు వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతు
రాష్ట్రంలో పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న పీడీఎఫ్ అభ్యర్థులకు మూడు చోట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు గురువారం పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది. పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఎంవీఎస్ శర్మ, బొడ్డు నాగేశ్వరరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తమ అభ్యర్థులకు మద్దతునివ్వాలని విజ్ఞప్తి చేశారు.
అందుకు ఆయన స్పందిస్తూ రాయలసీమ (ఈస్ట్) పట్టభద్రుల నియోజకవర్గంలో శ్రీనివాసరెడ్డికి, ఉపాధ్యాయుల నియోజకవర్గంలో బాలసుబ్రహ్మణ్యంకు, ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం నుంచి అజయ్‌శర్మకు పార్టీ మద్దతు తెలిపారు. ఈ నియోజకవర్గాల్లో పీడీఎఫ్ అభ్యర్థుల విజయానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని జగన్ పిలుపునిచ్చారు. రాయలసీమ (పశ్చిమ) పట్టభద్రుల నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెన్నపూస గోపాల్‌రెడ్డిని గెలిపించాలని కూడా ఈ ప్రకటనలో వైఎస్ జగన్ కోరారు.