భవితకు భరోసా | ysrcp president ys jagan arrival today | Sakshi
Sakshi News home page

భవితకు భరోసా

Published Wed, Jun 11 2014 3:09 AM | Last Updated on Mon, Sep 17 2018 4:56 PM

భవితకు భరోసా - Sakshi

భవితకు భరోసా

- వైఎస్సార్ సీపీ అధినేత జగన్ రాక నేడు
- క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతమే లక్ష్యం
- నేడు, రేపు నియోజకవర్గాల వారీ సమీక్ష

సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు పార్టీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. తాజా సార్వత్రిక ఎన్నికల ఫలితాల్ని విశ్లేషించి, ప్రజాక్షేత్రంలో పార్టీని బాధ్యతాయుతమైన రాజకీయపక్షంగా తీర్చిదిద్దేందుకు సంసిద్ధులయ్యారు. జిల్లాలో పార్టీ పురోభివృద్ధి కోసం జరిగే సమీక్షకు నగరంలోని విశ్వప్రియ ఫంక్షన్ హాల్ వేదిక కానుంది. బుధ, గురువారాల్లో నియోజకవర్గాలవారీ ఇక్కడ సమీక్ష నిర్వహించనున్నారు. అనకాపల్లి, విశాఖ లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలవారీ సమీక్ష జరగనుంది.

 

ఇప్పటికే రాజమండ్రిలో తొలి విడత సమీక్ష సమావేశాలు ముగియడం తెలిసిందే. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతోపాటు, భవిష్యత్ కార్యాచరణే ప్రధాన లక్ష్యంగా అధినేత ఈ సమీక్ష సమావేశాలను నిర్వహిస్తున్నారు. పార్టీ పటిష్టానికి అనుసరించాల్సిన విధానాలపై చర్చించనున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, శ్రేణుల్లో ఆత్మస్థయిర్యం నింపేందుకు నేనున్నానంటూ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇవ్వనున్నారు.  కేవలం 2 శాతం కంటే తక్కువ ఓట్ల తేడాతో అధికారం దూరమైనా తొలిసారి సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచి గణనీయమైన ఓట్లు రావడంతో కార్యకర్తలు డీలా పడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పనున్నారు.

గత నాలుగున్నరేళ్ల మాదిరిగానే ఇకముందూ ప్రజాసమస్యలపై తక్షణమే స్పందించి, నిత్యం వారి వెంట నిలిచి, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు సమీక్ష సమావేశాల్ని వేదికగా చేసుకోనున్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ప్రజాక్షేత్రంలో అనుసరించాల్సిన వ్యూహంపై జిల్లా నేతల, పార్టీ శ్రేణుల్లో కీలక వ్యక్తుల అభిప్రాయాలు తెలుసుకుంటారు. ఇలా అన్ని నియోజకవర్గాల్లోని నేతల నుంచి క్షేత్రస్థాయి అభిప్రాయాలను క్రోడీకరించి హైదరాబాద్‌లో పూర్తిస్థాయిలో చర్చించి పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాలన్నది వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ప్రధానోద్ధేశం.
 
సమీక్ష తీరు : పార్టీ కేంద్ర కార్యాలయం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం అనకాపల్లి లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష బుధవారం జరగనుంది. మధ్యాహ్న భోజన విరామానంతరం తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జగ్గంపేట, కాకినాడ అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష కూడా ఇక్కడే నిర్వహించనున్నారు. విశాఖ లోక్‌సభ పరిధిలోని నియోజకవర్గాల సమీక్ష 12న నిర్వహించనున్నారు. సమావేశాల్లో పార్టీ తరఫున తాజా ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థులు, జెడ్పీటీసీ సభ్యులతోపాటు ప్రతి నియోజకవర్గం నుంచి 10 నుంచి 15 మంది వరకు ముఖ్య నేతలు పాల్గొననున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement