సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఎయిర్‌పోర్టులో చంద్రబాబుకు నిరసన సెగ తగిలింది. చంద్రబాబు పర్యటనను ప్రజా సంఘాలు, ఉత్తరాంధ్ర మేధావులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కాన్వాయ్‌ను మహిళలు అడ్డుకున్నారు. ఉత్తరాంధ్ర ద్రోహి చంద్రబాబు అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌కు మద్దతు తెలపాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకున్నారు.
ఉత్తరాంధ్ర ద్రోహి చంద్రబాబు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అచ్చెన్నాయుడు సహా టీడీపీ నేతలను మహిళలు నిలదీశారు. చంద్రబాబు కాన్వాయ్ ఎదుట అడ్డం పడుకున్న నిరసనకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ కాన్వాయ్‌ను కదలనివ్వమంటూ ఆందోళన చేశారు. ఎంతసేపటికీ కాన్వాయ్‌ను కదలనివ్వకపోవడంతో కారు దిగేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. నిరసనకారులు అడ్డుకోవడంతో తిరిగి కారులోనే ఆయన కూర్చోన్నారు.
ఉత్తరాంధ్ర వ్యతిరేకత వీడనాడాలంటూ నినాదాలు చేస్తున్న ఆందోళన కారులపై టీడీపీ నేత చినరాజప్ప చేయిచేసుకున్నారు. గత ఐదేళ్లలో ఉత్తరాంధ్రకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణకు చంద్రబాబు మద్దతు తెలిపాలని.. లేదంటే ఉత్తరాంధ్రలో అడ్డుపెట్టనివ్వమని హెచ్చరించారు.
ఉత్తరాంధ్రకు ఏం చేశారని.. పర్యటన
ఉత్తరాంధ్రకు ఏం చేశారని చంద్రబాబు పర్యటిస్తున్నారని వైఎస్సార్‌సీపీ మహిళానేత కిల్లి కృపారాణి మండిపడ్డారు. చంద్రబాబు చేయాల్సింది ప్రజాచైతన్య యాత్ర కాదని పశ్చాత్తాప యాత్ర అని ఆమె దుయ్యబట్టారు. విభజన తర్వాత చంద్రబాబు తీరుతో ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగిందని విమర్శించారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే చంద్రబాబుకు ఎందుకు ఉలికిపాటు అని ప్రశ్నించారు. సీఎం జగన్ సుపరిపాలన చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని ఆమె ధ్వజమెత్తారు.
క్షమాపణ చెప్పిన తర్వాతే..
ఉత్తరాంధ్ర ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పిన తర్వాతే విశాఖలో అడుగుపెట్టాలని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు చంద్రబాబు సంఘీభావం తెలపాలని డిమాండ్ చేశారు. పేదలకు ఇళ్లు ఇస్తామంటే చంద్రబాబుకు అక్కసు ఎందుకని ఆయన ప్రశ్నించారు.
గ్రామస్తులు నిరసన..
విశాఖ జిల్లా పెందుర్తి మండలం పినగాడిలో చంద్రబాబుకు వ్యతిరేకంగా గ్రామస్తులు నిరసన తెలిపారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు భారీసంఖ్యలో గ్రామస్తులు సిద్ధమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment