ఫలితాలపై 4 నుంచి జగన్ సమీక్షలు
హైదరాబాద్: సాధారణ ఎన్నికల ఫలితాలను సమీక్షించడంతో పాటు పార్టీ నేతలు, శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 4 వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ఆయా ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల వారిగా సమావేశాలు నిర్వహిస్తూ ఫలితాలను సమీక్షించడంతో పాటు పార్టీని బలోపేతం చేయడానికి మార్గనిర్ధేశం చేయనున్నారు. నియోజవర్గాలవారీగా ఏర్పాటు చేసే ఈ సమీక్షా సమావేశాల్లో పోటీ చేసిన అభ్యర్థులు, అక్కడి జెడ్పీటీసీ అభ్యర్థులు, మండల పార్టీ కన్వీనర్లతో పాటు నియోజకవర్గంలో 10 నుంచి 15 మంది ముఖ్య నేతలు పాల్గొంటారని పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యులు ఎంవీ మైసూరారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ సమీక్షా సమావేశాల వివరాలను వెల్లడించారు. ఈ సమావేశాల అనంతరం భవిష్యత్తు కార్యాచరణతో, నేతల్లో ఆత్మస్థయిర్యం నింపి మరింత ఉత్సాహంగా పనిచేయించడమే లక్ష్యంగా జగన్ జిల్లాల్లో పర్యటిస్తారు.
మొదటగా జూన్ 4, 5, 6 తేదీల్లో రాజమండ్రిలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు ఉభయ గోదావరి జిల్లాల నియోజకవర్గాలపై జగన్ సమీక్షిస్తారని మైసూరారెడ్డి, ఉమ్మారెడ్డి చెప్పారు. ‘9, 10 తేదీల్లో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల సమీక్షా ఒంగోలులో ఉంటుంది. 11, 12ల్లో అనంతపురంలో రాయలసీమ జిల్లాల సమీక్షలు ఉంటాయన్నారు. శనివారం తెలంగాణ ప్రాంత పార్టీ ఎమ్మెల్యేల సమావేశంతో పాటు పార్టీ లోక్‌సభ సభ్యుల సమావేశం హైదరాబాద్‌లో వేరువేరుగా జరుగుతాయని అన్నారు. ఎంపీల సమావేశంలో పార్టీ పార్లమెంటరీ నాయకుడి ఎంపిక జరుగుతుందని తెలిపారు. లోక్‌సభ మొదటి విడత సమావేశాల్లో పార్టీ ఎలాంటి అంశాలను ప్రస్తావించాలన్న దానిపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు.
ఎస్పీవై రెడ్డికి నోటీసులు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నంద్యాల నుంచి లోక్‌సభ సభ్యుడిగా గెలిచి తరువాత పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎస్పీవై రెడ్డికి నోటీసు ఇవ్వనున్నట్టు మైసూరారెడ్డి చెప్పారు. నిర్ణీత సమయంలోనే ఆయనకు నోటీసు ఇస్తామన్నారు. కొన్ని పత్రికలు, మీడియా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పలువురు పార్టీని వీడతారని చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని, అది తప్పుడు ప్రచారమని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.