మరింత పటిష్టతకు..పోరాట పటిమకు..
సాక్షి ప్రతినిధి, కాకినాడ :జనం తరఫున నిర్విరామంగా పోరాడుతున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో ఎదుర్కొన్న తొలి సార్వత్రిక ఎన్నికలోన్లే వైఎస్సార్ కాంగ్రెస్.. మూడు దశాబ్దాల చరిత్ర కలిగిన టీడీపీ గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. బీజేపీతో జతకట్టిన టీడీపీ జిల్లాలో 46.66 శాతం ఓట్లు సాధిస్తే.. ఒంటరిపోరుతోనే వైఎస్సార్ సీపీ 42.24 శాతం ఓట్లు పొందింది. టీడీపీ-బీజేపీ కూటమికి, వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఓట్ల వ్యత్యాసం 4.42 శాతం మాత్రమే. బీజేపీ, టీడీపీ కూటమికి 13,74,844 ఓట్లు పోలవగా, వైఎస్సార్ సీపీకి 12,63,828 ఓట్లు వచ్చాయి.
టీడీపీ కూటమి, వైఎస్సార్ సీపీకి మధ్య వ్యత్యాసం కేవలం 1,26,316 ఓట్లు మాత్రమే. ఈ క్రమంలో జిల్లాలో పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేసేందుకు, ప్రజా సమస్యలపై ఇతోధికమైన పోరు సలిపేలా కార్యకర్తలను సన్నద్ధం చేసేందుకు జగన్ సంకల్పించారు. ఈ క్రమంలోనే జిల్లాలో ఎన్నికల ఫలితాలను, పార్టీ స్థితిగతులను త్రిసభ్య కమిటీ ప్రతినిధులు ఆదివారం నుంచి మూడు రోజులు సమీక్షించనున్నారు. వీరిలో భూమా నాగిరెడ్డి శనివారం హైదరాబాద్ నుంచి విమానంలో మధురపూడి ఎయిర్‌పోర్టుకు రాగా ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, రాజమండ్రి సిటీ కన్వీనర్ బొమ్మన రాజ్‌కుమార్, పార్టీ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి సుంకర చిన్ని, వాణిజ్య విభాగం జిల్లా కన్వీనర్ కర్రి పాపారాయుడు, సాంస్కృతిక విభాగం కన్వీనర్ ఆనంద్ మర్యాద పూర్వకంగా కలిశారు.
అనంతరం నాగిరెడ్డి రాజమండ్రిలో బస చేశారు. కమిటీలో మిగిలిన సభ్యులైన కేశిరెడ్డి వెంకటరామిరెడ్డి, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఆదివారం రాజమండ్రి రానున్నారు.పార్లమెంటు నియోజకవర్గాల వారీగా వాటి పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్‌లలో ఎదురైన పరిస్థితులు, గెలుపు, ఓటములకు కారణాలను ఈ కమిటీ క్షేత్రస్థాయి నుంచి విడివిడిగా సమీక్షించనుంది. జిల్లాలో ఒక్కో రోజు ఒక్కో పార్లమెంటు నియోజకవ్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల నేతలతో సమీక్షించనున్నారు. ఆదివారం రాజమండ్రిలోని ఉమారామలింగేశ్వరస్వామి కల్యాణమండపంలో రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, రాజానగరం, అనపర్తి నియోజకవర్గాలతో పాటు రంపచోడవరం, మండపేట, రామచంద్రపురం నియోజకవర్గాలపై సమీక్షించనున్నారు.
సోమవారం కాకినాడలోని పార్టీ జిల్లా కార్యాలయంలో కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోకి వచ్చే అసెంబ్లీ స్థానాలు, మూడో రోజు మంగళవారం రావులపాలెంలోని సీఆర్‌సీలో అమలాపురం, పి.గన్నవరం, ముమ్మిడివరం, కొత్తపేట, రాజోలు నియోజకవర్గాలపై సమీక్షించనున్నారు. మూడు రోజుల అనంతరం ఈ కమిటీ జిల్లాలో పార్టీ పరిస్థితిపై ఒక నివేదికను సిద్ధం చేయనుంది.సమీక్ష అనంతరం ఈనెల నాలుగు నుంచి మూడు రోజులపాటు ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల సమీక్షకు రాజమండ్రి వస్తున్న జగన్‌మోహన్‌రెడ్డికి ఆ నివేదికను కమిటీ అందచేయనుంది. జగన్ దానిపై సమీక్షించి జిల్లాలో పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయనున్నారు. స్వల్ప ఓట్ల తేడాతో నష్టపోవడానికి దారితీసిన పరిస్థితులను ఆయన నిశితంగా సమీక్షించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే విభజన అనంతరం ఏర్పడే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూ ప్రజల పక్షాన నిలిచేందుకు కార్యకర్తలు, నాయకులను సన్నద్ధం చేయనున్నట్టు చెప్పాయి
ఇదీ జగన్ సమీక్ష షెడ్యూల్
వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి జిల్లాలో ఈనెల 4,5,6 తేదీల్లో వివిధ నియోజకవర్గాల్లో గెలుపు, ఓటములపై సమీక్షించనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను శనివారం రాత్రి పార్టీ అధిష్టానం విడుదల చేసింది. దాని ప్రకారం జిల్లాలో జగన్‌మోహన్‌రెడ్డి నియోజకవర్గాల వారీ జరిపే సమీక్ష వివరాలు ఇలా ఉన్నాయి.