‘యనమల ఇంతలా దిగజారి మాట్లాడతారా..’
ఈమెయిల్స్ వ్యవహారంతో తమ పార్టీకి సంబంధం లేదని, చంద్రబాబువల్ల, ఆయన ప్రభుత్వం వల్ల నష్టపోయిన వాళ్లే ఈమెయిల్స్ ద్వారా ఫిర్యాదు చేసుకుంటారేమో తప్ప తమ పార్టీకి అందులో ఏ మాత్రం జోక్యం లేదని కుండబద్దలు కొట్టారు. చంద్రబాబు సీఎం అయినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి కనిపించడం లేదన్న అంబటి దానికి కూడా వైఎస్‌ఆర్‌సీపీదే బాధ్యత అంటూ ఆరోపిస్తున్నారని, అభివృద్ధిని వైఎస్ఆర్‌సీపీనే అడ్డుకుంటుందని పిచ్చిప్రేలాపనలు చేస్తుందని ధ్వజమెత్తారు. అభివృద్ధి లేమికి బాధ్యత వహించాల్సింది చంద్రబాబు ఆయన ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు చంద్రబాబు ఏదో మాయాజాలం చేసి చూపించారని, దూరంగా ఉన్నవాళ్లకు గొప్పగా ఉంటుందేమోగానీ ఓసారి అమరావతి వచ్చి చూస్తే అసలు రంగు బయటపడుతుందన్నారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినా ఎక్కడి గొంగళి అక్కడే ఉందని, మరో మరో రెండేళ్లలో కూడా చంద్రబాబు ఎలాంటి అభివృద్ధి చేయలేరని అన్నారు.
దీంతో తన చేతగానితనం నుంచి తప్పించుకునేందుకు ఇప్పుడు కొత్తగా వైఎస్‌ఆర్‌సీపీపై నిందలు వేయడం మొదలుపెట్టిందని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేసి తప్పించుకోవాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తశుద్ధితో పనిచేస్తే ఎవరూ అభివృద్ధిని అడ్డుకోరని హితవు పలికిన అంబటి అభివృద్ధి పేరుతో కోట్లు మింగేస్తే మాత్రం వైఎస్‌ఆర్‌సీపీ కచ్చితంగా ప్రశ్నిస్తుందని స్పష్టం చేశారు. చంద్రబాబు కంటే ముందే టీడీపీలోకి వచ్చిన యనమల అత్యంత దారుణంగా దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 2018లో రాజ్యసభ సభ్యత్వం కోసమే యనమల ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, ఎంత నీతిమాలిన పని అయినా చేయగలిగిన వ్యక్తి యనమల అన్నారు.