అమలాపురం : ‘రసాయనిక వ్యవసాయంతో పాటు సేంద్రియ, గోఆధారిత వ్యవసాయ పద్ధతుల వల్ల కూడా అధికోత్పత్తి సాధించడం, రెతుల ఆత్మహత్యలు ఆపడం సాధ్యం కాదు. కేవలం ఒక్క ఆవుతో 30 ఎకరాల్లో చేయగలిగే జీరో బడ్జెట్ (పెట్టుబడి లేని) ప్రకృతి వ్యవసాయం మాత్రమే వ్యవసాయ సంక్షోభానికి శాశ్వత పరిష్కారం. సేంద్రియ సాగు అణుబాంబుకంటే ప్రమాదం. రసాయనక ఎరువులతో ఉత్పత్తి చేస్తున్న పంటలపై వస్తున్న వ్యతిరేకత నేపథ్యంలో విదేశీయులు తీసుకువచ్చి మన మీద రుద్దిన మరో ప్రమాదకర వ్యవసాయ విధానం సేంద్రియ సాగు.
ఇది పైకి చెబుతున్నట్టుగా రసాయన విధానం కన్నా తక్కువ పెట్టుబడి అనేది నిజం కాదు.. దీర్ఘకాలికంగా ప్రకృతిని, భూసారాన్ని కూడా దెబ్బతీస్తోంది’ అని ప్రకృతి వ్యవసాయ ఉద్యమకారుడు సుభాష్ పాలేకర్ అన్నారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరంలో ఎనిమిది రోజుల పాటు జరిగే పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ తరగతులకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఎనిమిది రోజుల పాటు ప్రకృతి వ్యవసాయం విధానంపై శిక్షణ ఇచ్చేందుకు వచ్చిన ఆయన తొలి రోజు ఆదివారం రసాయనిక, సేంద్రియ సాగు వల్ల జరుగుతున్న అనర్థాల గురించి రైతులకు వివరించారు. ఆయన ఏమన్నారంటే..
రసాయనిక వ్యవసాయం హరిత విప్లవం పేరిట తొలుత ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచినప్పటికీ.. రైతుల ఆత్మహత్యలకు, కేన్సర్, ప్రకృతి వనరుల విధ్వంసానికి మూలకారణంగా మారింది. ఇప్పుడది ప్రమాదకరం. రసాయన ఎరువుల వల్ల భూమి నిస్సారమైంది. దిగుబడి క్రమేపీ తగ్గిపోయింది. 2050 నాటికి ఆహారోత్పత్తిని రెట్టింపు చేయడం దీనివల్ల కాదు. పెట్టుబడి పెరిగి, గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతున్నారు. రసాయనిక వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ప్రభుత్వం వెంటనే మానాలి. లేకపోతే అన్నదాతల ఆత్మహత్యలు ఆగవు.
రసాయనిక సేద్యం కన్నా ప్రమాదరకరమైనది, అతి ఖరీదైనది సేంద్రియ సేద్యం. ఈ రెండూ విదేశీ దోపిడీ శక్తుల కుట్రలో భాగమే. విదేశీ సాంకేతికతో కూడిన సేంద్రియ సాగు మన దేశంలో మూడు పద్ధతుల్లో సాగుతోంది. 1. కంపోస్టు, 2. వర్మీకంపోస్టు, 3.బయోడైనమిక్ పద్ధతి. కంపోస్టు సాగును మన దేశంలోకి బ్రిటన్ దేశం ప్రవేశపెట్టగా, వర్మీ కంపోస్టును ఐరోపా దేశాల నుంచి అరువు తెచ్చుకుంది. బయోడైనమిక్ సాగు న్యూజిలాండ్ దేశంలో పుట్టింది. ఇవన్నీ విదేశాల నుంచి తెచ్చుకున్న సాగు పద్ధతులు కాగా, జీరో బడ్జెట్ వ్యవసాయం పూర్తిగా స్వదేశీ విధానం.
కంపోస్టు సాగు బ్రిటీష్ పరిపాలనలో మన దేశంలోకి వచ్చింది. అప్పటి వరకు మనది కేవలం ఆవుపేడతోనే వ్యవసాయం జరిగేది. దీనివల్ల పెద్దగా దిగుబడులు లేక దేశంలో ఆహార ఉత్పత్తి లేక కరవు కాటకాల సమయంలో బ్రిటీష్ శాస్త్రవేత్త డాక్టర్ ఆల్‌బర్ట్ హోవర్ట్ కంపోస్టు సాగును దేశంలో ప్రవేశపెట్టారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే.. ఇదే హోవర్ట్ కంపోస్టు సాగుకన్నా మన దేశీయ విధానంలో సాగు పద్ధతే మేలని తేల్చిచెప్పడం. ఒక విదేశీ శాస్త్రవేత్తే మన దేశీయ సాగు విధానం గురించి గొప్పగా చెబితే, మన విదేశీ సాగు విధానం చేపట్టం విడ్డూరంగా అనిపిస్తోంది. కంపోస్టు సాగులో చాలా ఇబ్బందులున్నాయి. ఒక ఎకరా సాగుకు 18 బండ్ల పెంట అవసరం. ఇంత సేంద్రియ ఎరువును సేకరించి దేశవ్యాప్తంగా సాగు చేయాలంటే 350 కోట్లకు పైగా పశువులు కావాలి. ఇది అసాధ్యం.
వర్మీ కంపోస్టు ద్వారా పండించిన వ్యవసాయ ఉత్పత్తుల్లో భార ఖనిజాలున్నట్టు ఐరోపా దేశాలు గుర్తించాయి. భూసారాన్ని పెంచేందుకు అవసరమైన జీవన ద్ర వ్యం (హ్యూమస్) తయారీని ఐసీనియా ఫోటీడా వానపాములతో తయారయ్యే వర్మీ కంపోస్టు అడ్డుపడుతూ తీరని నష్టం కలిగిస్తోంది. ఇది విదేశీ శక్తుల కుట్ర. ఉష్ణోగ్రత 28 డిగ్రీలు దాటిన తర్వాత వర్మీ కంపోస్టు వల్ల కార్బన్ డయాక్సయిడ్ విడుదలవుతుంది. భూతాపం పెరిగిపోతోంది.
బయోడైనమిక్ పద్ధతి కూడా విదేశానిదే. ఒక ఆవు కొమ్ము ద్వారా తయారయ్యే 35 గ్రాముల ‘కల్చర్’ను 20 బళ్ల పశువుల ఎరువులో కలపటం ద్వారా ఎకరం సాగు చేస్తున్నారు. కోట్లాది ఆవు కొమ్ములతో సేద్యం చేయడం అసాధ్యం.
పశువుల ఎరువు టన్నుల కొద్దీ వేసి చేసే సంప్రదాయ వ్యవసాయ విధానం దేశీయమైనదే అయినప్పటికీ పూర్వం మాదిరిగా ప్రతి రైతూ వందలాది పశువులను పెంచడం అసాధ్యం. పూర్తిగా శాస్త్రీయమైన, అత్యాధునికమైన జీరో బెడ్జెట్ విధానంలో మాత్రమే ఒక్క ఆవుతో 30 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం సాధ్యమవుతుంది. ఇప్పటి వ్యవసాయ సంక్షోభాన్ని శాశ్వతంగా పరిష్కరించడానికి ఇదొక్కటే దిక్కు. స్వల్ప ఖర్చుతో దీన్ని చేయొచ్చు. ఈ ఖర్చు అంతర పంటల ద్వారా రైతుకు వస్తుంది. ప్రధాన పంటపై ఆదాయం అంతా రైతుకు లాభమే. 10 శాతం నీరు, 10 శాతం విద్యుత్‌తో తుపాన్లను, కరువును తట్టుకుంటూ.. అధిక దిగుబడులు సాధించడానికి జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయం మినహా మరొక పద్ధతి లేదు. ప్రభుత్వాలు ఈ వాస్తవాలు గుర్తించి రసాయనిక వ్యవసాయాన్ని ప్రోత్సహించడం వెంటనే మానేయాలి.
జీరో బడ్జెట్ సేద్యంతోనే అధికోత్పత్తి సాధ్యం
Published Mon, Jan 25 2016 12:30 AM | Last Updated on Sun, Sep 3 2017 4:15 PM
Advertisement
Advertisement