కర్నూలు(హాస్పిటల్): దాదాపు 50 రోజులుగా ఏ రోజు.. ఎన్ని కరోనా కేసులు నమోదవుతాయోనన్న ఆందోళనతో ఉన్న జిల్లా ప్రజలు.. గురువారం శుభవార్త విని హమ్మయ్యాఅనుకున్నారు. కొన్నిరోజులుగా ఏక సంఖ్యకే పరిమితమైన కరోనా కేసులు తాజాగా గురువారం..జీరో కావడం పెద్ద ఉపశమనంగా అనిపించింది. దీంతో జిల్లాయంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో మంత్రులు, జిల్లా యంత్రాంగం యావత్తూ ఎప్పటికప్పుడు తగిన వ్యూహాలను సిద్ధం చేసుకుంటూ కరోనా కట్టడికి చర్యలు తీసుకుంది. ఏ రోజుకారోజు కొత్త అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ వైరస్ నియంత్రణకు ప్రణాళికాబద్ధంగా టెస్టింగ్, ట్రేసింగ్, ఐసోలేషన్‌లో వేగం పెంచుకుంటూ వెళ్లింది. యాక్టివ్ కేసుల కంటే కరోనా మహమ్మారిని జయించి ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్యపెరగడం, ప్రత్యేకంగా వృద్ధులు, చిన్నారులు విజేతలుగా నిలవడంతో ప్రజల్లో మనోధైర్యాన్ని కలిగించింది. సమష్టి పోరాటంతో కరోనాను జిల్లాలో కట్టడి చేయవచ్చనే నమ్మకం పెరిగిందని జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ అభిప్రాయపడ్డారు.
కరోనాను జయించిన మరో 27 మంది
కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో కరోనాను జయించిన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా గురువారం మరో 27 మంది డిశ్చార్జ్ అయ్యారు. నగర శివారులోని కోవిడ్ కేర్ సెంటర్ నుంచి 8 మంది, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల నుంచి నలుగురు, విశ్వభారతి జిల్లా కోవిడ్ ఆసుపత్రి నుంచి 12 మంది, శాంతి రామ్ కోవిడ్ ఆసుపత్రి నుంచి ముగ్గురిని వైద్యులు డిశ్చార్జ్ చేశారు. విజేతల్లో కర్నూలు నగర వాసులు 23 మంది, నంద్యాల అర్బన్‌కు చెందిన ముగ్గురు, ఆదోనికి చెందిన ఒకరు ఉన్నారు. వీరిలో 15 మంది పురుషులు, 12 మంది స్త్రీలు ఉన్నారు. వీరందరూ 22 నుంచి 60 ఏళ్లలోపు వారు. జిల్లాలో ఇప్పటి వరకు కరోనా విజేతల సంఖ్య 343కు చేరుకుంది. యాక్టివ్ రోగులు(ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారు) 230 మంది ఉన్నారు. డిశ్చార్జ్ అయిన వారికి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఒక్కొక్కరికి రూ.2వేల నగదు పంపిణీ చేసి, ప్రత్యేక అంబులెన్స్‌లలో ఇంటికి పంపించారు.
కరోనానుజయించిన బాలింత తల్లీ బిడ్డ క్షేమం
ప్రసవ సమయంలో కరోనా వైరస్ బారిన పడిన ఓ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొంది గురువారం డిశ్చార్జ్ అయ్యారు. కర్నూలుకు చెందిన 22 ఏళ్ల మహిళ.. ప్రసవం కోసం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు రెండు వారాల క్రితం వచ్చారు. ఆమెకు ఉన్న వ్యాధి లక్షణాలను బట్టి వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ప్రసూతి విభాగం వైద్యులు ఆమెకు తగిన జాగ్రత్తలు తీసుకుని సిజేరియన్ ఆపరేషన్ ద్వారా విజయవంతంగా ప్రసవం చేసి తల్లీబిడ్డలకు ప్రాణం పోశారు. 14 రోజుల అనంతరం తల్లీబిడ్డకు ఇద్దరికీ కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో ఆమెను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి.నరేంద్రనాథ్‌రెడ్డి, ప్రసూతి విభాగం వైద్యులు డాక్టర్ శ్రీలత బృందం డిశ్చార్జ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment