శ్రీకాకుళం పాతబస్టాండ్ :మహిళా సంఘాలను ఈ ప్రభుత్వం నట్టేట ముంచేసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలు పూర్తిగా మర్చిపోయింది. ఇక గత ప్రభుత్వం ప్రకటించిన సున్నా వడ్డీ రాయితీ కూడా విడుదల చేయడంలేదు, ఫలితంగా మహిళా సంఘాలు క్రమంగా నీరసిస్తున్నాయి. 2012 జూలైలో అప్పటి ప్రభుత్వం మహిళా స్వయంశక్తి సంఘాలకు సున్నా వడ్డీ రాయితీ పథకాన్ని ప్రవేశపెట్టింది. రెండు మూడు విడతల్లో వడ్డీ రాయితీ కూడా విడుదల చేసింది. అయితే గత 15 నెలలుగా దీన్ని విడుదల చేయకపోవడంతో బ్యాంకుల్లో సంఘాల పేరిట బకాయిలో భారీగా పేరుకుపోతున్నాయి. జిల్లాలో 33,900 సంఘాలకు సంబంధించి గత డిసెంబర్ నాటికే రూ.629 కోట్ల రుణాలు ఉన్నాయి.
వీటికి వడ్డీ రూపంలో మరో రూ.69 కోట్ల బకాయిలు ఉన్నాయి. ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఈ భారం సంఘాలపైన పడుతోంది, వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004లో స్వయంశక్తి సంఘాలకు పావలా వడ్డీ రుణ పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఆయన ఉన్నన్నాళ్లు ప్రతి మూడు నెలలకు వడ్డీని లెక్క గట్టి, అందులో 75 శాతాన్ని నేరుగా మహిళా సంఘాల ఖాతాలకు జమ చేసేవారు, ఆ తరువాత వచ్చిన ప్రభుత్వం మహిళలకు మరింత చేరువకావాలన్న ఉద్దేశంతో సున్నా వడ్డీ రాయితీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ ప్రభుత్వంతోపాటు ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం రాయితీ మొత్తాలను విడుదల చేయడంలో విఫలమయ్యాయి.
రుణమాఫీ ఊసే లేదు
వడ్డీ రాయితీ పరిస్థితి అలా ఉంటే.. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం కొత్తలో ఏవో ప్రకటనలు చేసినా.. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. హామీలను నమ్మి నెల వాయిదాలు కట్టడం మానేసిన మహిళా సంఘలు ప్రభుత్వం తీరుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా యి. కొన్ని బ్యాంకులు వడ్డీ కింద సంఘాల పొదుపు ఖాతాల్లోని నగదును వారికి చెప్పకుండానే జమచేసుకుంటున్నాయి. ఈ ఏడాది జూన్ నాటికి జిల్లాలో మాఫీకి అర్హమైన 37,488 సంఘాల పేరిట రూ.447 కోట్ల రుణ బకాయిలు ఉన్నాయి. సంఘానికి లక్ష రూపాయలు చొప్పున విడుదల చేస్తామని రెండు నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా.. అది ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. పొంతన లేని హామీలతో ప్రభుత్వం తమను మోసం చేస్తోందని మహిళా సంఘాల సభ్యులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
కట్టకపోతే గ్రూపు రద్దు చేస్తామంటున్నారు
రుణం మాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు ఉన్న రుణాలకు వడ్డీలు గుంజుతున్నారు. ఇందిరాగాంధీ గ్రూపు ద్వారా రూ.1.60 లక్షల రుణం కట్టాల్సి ఉంది. ఈ మొత్తాన్ని మాఫీ చేస్తామని చెప్పారు. ఇప్పుడు సభ్యురాలికి పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి, రుణంతో పాటు సుమారు రూ. 25 వేల వడ్డీ చెల్లించమంటున్నారు. ఈ మొత్తం చెల్లించకపోతే గ్రూపును రద్దు చేస్తామని ఐకేపీ అధికారులు హెచ్చరిస్తున్నారు. -వై.లక్ష్మి, ఇందిరాగాంధీ గ్రూపు అధ్యక్షురాలు, ధర్మవరం
ఇప్పటికే రూ.20 వేల వడ్డీ చెల్లించాం
రుద్రమదేవీ గ్రూపు సభ్యులు రూ. 2 లక్షల రూణం కట్టాల్సి ఉంది. రుణమాఫీ వస్తుంది.. కట్టనక్కర్లేదని చెప్పారు. తీరా ఇప్పుడు రుణమాఫీ లేదని, ఎప్పుడో సభ్యురాలికి పదివేలు చొప్పున ఇస్తాం.. ఇప్పడు మాత్రం అప్పుతో పాటు వడ్డీలు చెల్లించాలని అంటున్నారు. ఇప్పటికే మా పొదుపు సొమ్ము నుంచి రూ. 20 వేల వడ్డీ కట్టించుకున్నారు. ఇంకా రూ.రెండు లక్షల రుణంతో పాటు రూ.9 వేల వడ్డీ కట్టమంటున్నారు. - యండ సత్తెమ్మ, రుద్రమదేవి గ్రూపు అధ్యక్షురాలు, ధర్మవరం
వడ్డీ రాయితీ సున్నా
Published Wed, Feb 25 2015 12:47 AM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM
Advertisement
Advertisement