సాక్షి ప్రతినిధి, ఒంగోలు : జిల్లా జెడ్పీ ఛైర్మన్ వివాదంలో అధికారులు అధికార పక్షంతో కలిసి కొనసాగిస్తున్న డ్రామాకు తెరపడటం లేదు. దీంతో జెడ్పీ ఉద్యోగుల బదిలీలు నిలిచిపోయాయి. జెడ్పీ ఛైర్మన్‌గా నూకసాని బాలాజీనే ఉన్నారని చెబుతున్న అధికారులు, జెడ్పీ సీటులో కూర్చుంటున్న ఈదర హరిబాబు విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం వివాదాస్పదంగా మారింది. ఈ విషయంలో అధికారులు అవలంబిస్తున్న విధానం పూర్తి వివాదాస్పదంగా మారింది. జెడ్పీ ఎన్నికల సందర్భంగా విప్ ధిక్కరించారంటూ ఈదర హరిబాబుపై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే.
ఆయన విప్ చెల్లదంటూ హైకోర్టును ఆశ్రయించడంతో అతనికి అనుకూలంగా ఈ నెల ఏడున హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే అధికారులకు ఆ ఆదేశాలు అందకుండానే ఎనిమిదో తేదీన ఆయన వచ్చి తన కుర్చీలో కూర్చున్నారు. అనర్హత వేటు పడటంతో వైస్‌ఛైర్మన్ బాలాజీ పూర్తిస్థాయి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయనకు విషయం చెప్పకుండా, ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాకుండానే ఈదర హరిబాబు తన సీటు ‘దక్కించు’కోవడంతో కలకలం రేగింది. అయితే అధికారులకు అధికార పార్టీ నుంచి వస్తున్న ఒత్తిళ్ల నేపథ్యంలో 12వ తేదీన తెలుగుదేశం పార్టీ నేతలు డివిజన్ బెంచిలో రిట్ పిటీషన్ వేసే వరకూ ఆగి ఆ రిట్ పిటీషన్ నెంబర్లను ఉదహరిస్తూ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్‌కు తదుపరి ఆదేశాల కోసం పంపించారు.
తమకు కోర్టు ఉత్తర్వులు అధికారికంగా ఈనెల 12వ తేదీ వచ్చాయని, తమపై ఎవరి ఒత్తిడి లేదని, కేవలం అధికారిక ఉత్తర్వులు అందకే ఉన్నతాధికారులను సంప్రదించలేకపోయామని చెబుతున్నారు. ఇంకా జిల్లా పరిషత్ అధ్యక్షుడు నూకసాని బాలాజీయే అని అధికారులు ప్రకటించారు. అటువంటప్పుడు అనధికారికంగా జెడ్పీ ఛాంబర్‌లో కూర్చుంటున్న ఈదర హరిబాబుపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. నిజంగా అధికారులు తలుచుకుంటే ఆ చాంబర్‌కు తాళాలు వేయించవచ్చు. అయితే ఆ దిశగా అడుగులు వేయడం లేదు. ఇది కోర్టు ధిక్కరణ అవుతుందనే భయం వారిలో ఉండటమే కారణమని తెలుస్తోంది. ఒకవైపు జెడ్పీ ఛైర్మన్ నూకసాని బాలాజీ అని చెబుతూ జెడ్పీ ఛాంబర్‌లోకి ఈదర హరిబాబును అనుమతించడం వల్ల వివాదం ముదిరిందని, ఇది తమ బదిలీలపై పడిందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తమ బదిలీలను ఎవరు చేస్తారనే దానిపై స్పష్టత లేకపోవడంతో ఉద్యోగులు శనివారం ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. బదిలీలకు గడువు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈలోగా జెడ్పీ ఛైర్మన్ వివాదాన్ని పరిష్కరించాలని వారు కోరుతున్నారు. మరోవైపు ఇద్దరు జెడ్పీ ఛైర్మన్లను రంగంలో ఉంచి అధికారులు మాత్రం అదనపు జేసీతో బదిలీల ప్రక్రియ ముగించేందుకు ప్రయత్నం చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఖచ్చితంగా జెడ్పీ ఛైర్మన్ సమక్షంలోనే ఈ బదిలీ ప్రక్రియ జరపాలని ప్రభుత్వం తాజాగా ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ ఆదేశాలను తుంగలో తొక్కి అధికారులు బదిలీ చేయాలని ప్రయత్నం చేయడంతో ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. ఈ నెల 19న ఈదర హరిబాబుపై తెలుగుదేశం వేసిన పిటీషన్ విచారణ జరగనుంది. ఆ రోజు కోర్టు ఇచ్చే ఉత్తర్వుల ఆధారంగానే భవిష్యత్ కార్యాచరణ చేపట్టాలని అధికారులు, అధికార పార్టీ భావిస్తున్నట్లు సమాచారం.
జెడ్పీట ముడి
Published Mon, Nov 17 2014 1:11 AM | Last Updated on Sat, Sep 2 2017 4:35 PM
Advertisement
Advertisement