edara hari babu
-
టార్గెట్ ఈదర!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబుపై అవిశ్వాసం పెట్టి ఆయన్ను పదవీచ్యుతుడ్ని చేసేందుకు అధికార పార్టీ సిద్ధమవుతోందా..? యర్రగొండపాలేనికి చెందిన టీడీపీ నేత మన్నే రవీంద్ర అధికార పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారా..? ఈదరను పదవి నుంచి దింపి చైర్మన్‌ను చేస్తామని రవీంద్రకుటీడీపీ హామీ ఇచ్చిందా..? ఈ మేరకు సీఎం సైతం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారా..? ఈ నేపథ్యంలోనే జడ్పీ చైర్మన్‌పై అవిశ్వాసానికి టీడీపీ సిద్ధమైందా..? ఇందుకు అధికార పార్టీ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది.. అసంతృప్తిలో మన్నే రవీంద్ర.. యర్రగొండపాలేనికి చెందిన టీడీపీ నేత, దొనకొండ జడ్పీటీసీ మన్నే రవీంద్ర అధికార పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా అధికార పార్టీ నుంచి నాడు మన్నే రవీంద్ర బరిలో దిగారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఊహించని రీతిలో అధికార పార్టీ జడ్పీటీసీ ఈదర హరిబాబుకు మద్ధతు పలకడంతో రవీంద్ర చివరి నిమిషంలో జిల్లా పరిషత్ చైర్మన్ కాలేకపోయారు. చైర్మన్‌గిరి కోసం ఆర్థికంగా నష్టపోయిన రవీంద్రకు పార్టీ అధికారంలోకి వచ్చినా ఒరిగిందేమి లేదు. మరోవైపు యర్రగొండపాలెం నియోజకవర్గంలో కీలకనేతగా ఉన్నా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచిన డేవిడ్‌రాజు అధికార పార్టీలో చేరడంతో రవీంద్ర అధిపత్యానికి గండిపడింది. అప్పటికే అక్కడ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న అజితరావు, కేడర్‌లో పట్టున్న జడ్పీటీసీ మన్నె రవీంద్రల మధ్య వర్గ విభేదాలున్నాయి. డేవిడ్‌రాజు రాకతో పార్టీ మూడు వర్గాలుగా చీలిపోయింది. ప్రసుత్తం అజితరావు నియోజకవర్గానికి కొంత దూరంగా ఉన్నా, మన్నె రవీంద్ర, ఎమ్మెల్యే డేవిడ్‌రాజులకు పొసగడం లేదు. ఈ పరిస్థితుల్లో డేవిడ్‌రాజుకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చినా.. అటు మన్నె రవీంద్ర, ఇటు అజితరావు వర్గాలు పని చేసే పరిస్థితి లేదు.ఒక వేళ అజితరావుకు టికెట్ ఇచ్చినా మన్నె రవీంద్ర, డేవిడ్‌రాజులు ఆమెకు మద్ధతు ఇచ్చే ప్రసక్తే లేదు. సుదీర్ఘంగా సేవలందించినా.. పదవితో పాటు ప్రాధాన్యత లేకపోవడంతో మన్నే రవీంద్ర అలకబూనినట్లు తెలుస్తోంది. ఆయన త్వరలోనే టీడీపీని వీడతారన్న ప్రచారమూ సాగుతోంది. యర్రగొండపాలెం, దర్శి, పర్చూరు ప్రాంతాల్లో సామాజికవర్గ బలంతో పాటు కొంత మేర ప్రజాబలమున్న మన్నే రవీంద్ర టీడీపీ వీడటం వల్ల ఆ పార్టీకి మరింత నష్టం కలగనుంది. జడ్పీ చైర్మన్‌గిరి ఎర.. అధికార పార్టీ మన్నే రవీంద్రను బుజ్జగించే ప్రయత్నానికి దిగింది. జడ్పీ చైర్మన్ ఈదర హరిబాబును పదవి నుంచి దించి మన్నే రవీంద్రకు చైర్మన్ పదవి అప్పగించాలని ముఖ్యమంత్రి జిల్లా టీడీపీ అధ్యక్షుడు దామచర్ల జనార్ధన్‌తో పాటు మిగిలిన నేతలను ఆదేశించినట్లు సమాచారం. దీంతో జడ్పీపై అవిశ్వాసం పెట్టేందుకు అధికార పార్టీ నేతలు మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కొందరు టీడీపీ నేతలు దీన్ని లోలోన వ్యతిరేకిస్తున్నా పైకి అంటిముట్టినట్లు వ్యవహరిస్తున్నట్లు అవిశ్వాసాన్ని దామచర్ల జనార్ధన్ నెత్తికెత్తుకొనే పక్షంలో కరణం బలరాం వర్గం ఇందుకు పూర్తి స్థాయిలో మద్ధతు పలికే అవకాశాలు కానరావడం లేదు. అయినా జడ్పీ చైర్మన్‌పై అవిశ్వాసానికి అధికార పార్టీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జిల్లా పరిషత్ తాజా పరిస్థితిని పరిశీలిస్తే... 56 మంది సభ్యులున్న జిల్లా పరిషత్‌లో 31 మంది వైఎస్సార్సీపీ తరపున, 25 మంది టీడీపీ తరపున ఎన్నికయ్యారు. వైఎస్సార్సీపీ తరపున నూకసాని బాలాజీ, టీడీపీ తరపున దొనకొండ జడ్పీటీసీ మన్నే రవీంద్రలు చైర్మన్ అభ్యర్థులుగా బరిలోకి దిగారు. తొలి సమావేశం నాటికే అధికార పార్టీ ముగ్గురు వైఎస్సార్సీపీ జడ్పీటీసీలను కొనుగోలు చేసింది. దీంతో ఇరుపార్టీలకు 28 చొప్పున సమానంగా జడ్పీటీసీలున్నారు. రెండవ సమావేశం నాటికి అధికార పార్టీ వైఎస్సార్సీపీకి చెందిన మార్కాపురం జడ్పీటీసీ రంగారెడ్డిపై ఎస్సీ యాక్టు కేసు పెట్టించారు. సమావేశానికి వస్తున్న సమయంలో రంగారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. దీంతో టీడీపీకి 28 మంది, వైఎస్సార్సీపీకి 27 మంది సభ్యులున్నారు. దీంతో అప్పట్లో వైఎస్సార్సీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి రాత్రికి రాత్రే చక్రం తిప్పారు. టీడీపీ తరపున పొన్నలూరు జడ్పీటీసీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే హరిబాబును జడ్పీ చైర్మన్ చేసేందుకు వైఎస్సార్సీపీ సిద్ధమైంది. ఇందుకు నూకసాని బాలాజీని ఒప్పించారు. వ్యూహం మేరకు సమావేశంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేయించి ఈదరను చైర్మన్‌గా ఎన్నుకున్నారు. 27 సభ్యులే కావడంతో టీడీపీ ఓటమిపాలైంది. మన్నే రవీంద్రకు చైర్మన్‌గిరి దక్కలేదు. ఆ తర్వాత టీడీపీ ఈదర హరిబాబును పార్టీ నుండి సస్పెండ్ చేయటం, జడ్పీటీసీ పదవి రద్దు కావడంతో ఈదర తాత్కాలికంగా చైర్మన్ కుర్చీ దిగిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కోర్టుకెళ్ళి ఆయన తిరిగి చైర్మన్‌గా కొనసాగారు. ఈ మధ్య కాలంలో 13 నెలల పాటు జడ్పీ వైస్ చైర్మన్‌గా ఉన్న నూకసాని బాలాజీ చైర్మన్‌గా కొనసాగారు. అవిశ్వాసం ఫలించేనా..? జిల్లా పరిషత్‌కు 56 మంది సభ్యులుండగా ప్రస్తుతం 55 మంది సభ్యులే సభలో ఉన్నారు. వీరిలో వైఎస్సార్సీపీకి 17 మంది సభ్యులున్నారు. ఈదర హరిబాబుతో కలిపితే 18 మంది అవుతారు. అధికార టీడీపీకి 37 మంది సభ్యులున్నారు. అవిశ్వాసం ప్రవేశపెట్టేందుకు ఈ సంఖ్య సరిపోతుంది. నాలుగేళ్ళ పదవి కాలం అనంతరం అవిశ్వాసం పెట్టవచ్చు. ఈ లెక్కన జులై 13 నాటికి అవిశ్వాసం పెట్టే అవకాశం కలుగుతుంది. ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలం అధికార పార్టీకి అనుకూలంగానే ఉంది. ఈదరపై అవిశ్వాసం పెట్టే పక్షంలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు అధికార పార్టీలోని దాదాపు 10 మంది సభ్యులు ఈదర హరిబాబుకు మద్ధతు పలికే అవకాశం ఉంది. కొండపి, చీరాల, గిద్దలూరు, మార్కాపురం, అద్దంకి నియోజకవర్గాల పరిధిలోని పలువురు సభ్యులు వ్యక్తిగతంగా, సామాజికవర్గ పరంగా ఈదరకు మద్ధతునిస్తున్నారు. ఇదే జరిగితే ఈదర హరిబాబును చైర్మన్ పదవి నుంచి దించడం సాధ్యం కాదు. మరోవైపు టెక్నికల్‌గా ఈదరపై ఇప్పట్లో అవిశ్వాసం పెట్టే అవకాశం లేదన్న ప్రచారం సాగుతోంది. నాలుగేళ్ళ పదవి కాలం ముగిసిన తర్వాత అవిశ్వాసం పెట్టవచ్చు. ఈదర 13 నెలల పాటు పదవిలో లేరు. ఈ సమయాన్ని నాలుగు సంవత్సరాల సమయంతో లెక్కిస్తారా.. లేదా.. అన్న దానిపై అవిశ్వాస తీర్మానం ఆధారపడి ఉంది. చైర్మన్ పదవిలో ఉన్న కాలాన్ని మాత్రమే లెక్కించే పక్షంలో నాలుగేళ్ళ కాలం పూర్తి కాద. ఈ లెక్కన చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టే అవకాశం ఉండదు. అలా కాకుండా పాలకవర్గం ఏర్పడిన నాటి నుండి మొత్తం కాలాన్ని గణించే పక్షంలోనే అవిశ్వాసం వీలవుతుంది. చైర్మన్ పదవి కాలాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకొనే అవకాశం ఉందని ఇప్పటికే న్యాయ నిపుణులు పేర్కొంటున్నట్లు సమాచారం. ఇదే జరిగితే జడ్పీ చైర్మన్‌పై అవిశ్వాసం జరిగే అవకాశం ఉండదు. ఈ పరిస్థితుల్లో ఈదరకు పదవి గండం అవకాశాలు తక్కువే. ఒక వేళ అవిశ్వాసం నేపథ్యంలో మరోమారు ఈదర కోర్టు మెట్లెక్కాల్సి వస్తే అదృష్టం కలిసి వచ్చి వైస్ చైర్మన్‌గా ఉన్న తనకు పదవి దక్కకపోతుందా.. అని నూకసాని బాలాజీ ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా జిల్లా పరిషత్‌పై అవిశ్వాసం వ్యవహారం ప్రస్తుతం అధికార టీడీపీతో పాటు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. -
జెడ్పీట ముడి
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : జిల్లా జెడ్పీ ఛైర్మన్ వివాదంలో అధికారులు అధికార పక్షంతో కలిసి కొనసాగిస్తున్న డ్రామాకు తెరపడటం లేదు. దీంతో జెడ్పీ ఉద్యోగుల బదిలీలు నిలిచిపోయాయి. జెడ్పీ ఛైర్మన్‌గా నూకసాని బాలాజీనే ఉన్నారని చెబుతున్న అధికారులు, జెడ్పీ సీటులో కూర్చుంటున్న ఈదర హరిబాబు విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం వివాదాస్పదంగా మారింది. ఈ విషయంలో అధికారులు అవలంబిస్తున్న విధానం పూర్తి వివాదాస్పదంగా మారింది. జెడ్పీ ఎన్నికల సందర్భంగా విప్ ధిక్కరించారంటూ ఈదర హరిబాబుపై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. ఆయన విప్ చెల్లదంటూ హైకోర్టును ఆశ్రయించడంతో అతనికి అనుకూలంగా ఈ నెల ఏడున హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే అధికారులకు ఆ ఆదేశాలు అందకుండానే ఎనిమిదో తేదీన ఆయన వచ్చి తన కుర్చీలో కూర్చున్నారు. అనర్హత వేటు పడటంతో వైస్‌ఛైర్మన్ బాలాజీ పూర్తిస్థాయి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయనకు విషయం చెప్పకుండా, ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాకుండానే ఈదర హరిబాబు తన సీటు ‘దక్కించు’కోవడంతో కలకలం రేగింది. అయితే అధికారులకు అధికార పార్టీ నుంచి వస్తున్న ఒత్తిళ్ల నేపథ్యంలో 12వ తేదీన తెలుగుదేశం పార్టీ నేతలు డివిజన్ బెంచిలో రిట్ పిటీషన్ వేసే వరకూ ఆగి ఆ రిట్ పిటీషన్ నెంబర్లను ఉదహరిస్తూ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్‌కు తదుపరి ఆదేశాల కోసం పంపించారు. తమకు కోర్టు ఉత్తర్వులు అధికారికంగా ఈనెల 12వ తేదీ వచ్చాయని, తమపై ఎవరి ఒత్తిడి లేదని, కేవలం అధికారిక ఉత్తర్వులు అందకే ఉన్నతాధికారులను సంప్రదించలేకపోయామని చెబుతున్నారు. ఇంకా జిల్లా పరిషత్ అధ్యక్షుడు నూకసాని బాలాజీయే అని అధికారులు ప్రకటించారు. అటువంటప్పుడు అనధికారికంగా జెడ్పీ ఛాంబర్లో కూర్చుంటున్న ఈదర హరిబాబుపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. నిజంగా అధికారులు తలుచుకుంటే ఆ చాంబర్‌కు తాళాలు వేయించవచ్చు. అయితే ఆ దిశగా అడుగులు వేయడం లేదు. ఇది కోర్టు ధిక్కరణ అవుతుందనే భయం వారిలో ఉండటమే కారణమని తెలుస్తోంది. ఒకవైపు జెడ్పీ ఛైర్మన్ నూకసాని బాలాజీ అని చెబుతూ జెడ్పీ ఛాంబర్లోకి ఈదర హరిబాబును అనుమతించడం వల్ల వివాదం ముదిరిందని, ఇది తమ బదిలీలపై పడిందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ బదిలీలను ఎవరు చేస్తారనే దానిపై స్పష్టత లేకపోవడంతో ఉద్యోగులు శనివారం ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. బదిలీలకు గడువు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈలోగా జెడ్పీ ఛైర్మన్ వివాదాన్ని పరిష్కరించాలని వారు కోరుతున్నారు. మరోవైపు ఇద్దరు జెడ్పీ ఛైర్మన్లను రంగంలో ఉంచి అధికారులు మాత్రం అదనపు జేసీతో బదిలీల ప్రక్రియ ముగించేందుకు ప్రయత్నం చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఖచ్చితంగా జెడ్పీ ఛైర్మన్ సమక్షంలోనే ఈ బదిలీ ప్రక్రియ జరపాలని ప్రభుత్వం తాజాగా ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ ఆదేశాలను తుంగలో తొక్కి అధికారులు బదిలీ చేయాలని ప్రయత్నం చేయడంతో ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. ఈ నెల 19న ఈదర హరిబాబుపై తెలుగుదేశం వేసిన పిటీషన్ విచారణ జరగనుంది. ఆ రోజు కోర్టు ఇచ్చే ఉత్తర్వుల ఆధారంగానే భవిష్యత్ కార్యాచరణ చేపట్టాలని అధికారులు, అధికార పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. -
ప్రకాశం జిల్లా పరిషత్ ‘కుర్చీ’ వివాదం
హైదరాబాద్: ప్రకాశం జిల్లా పరిషత్ ఛైర్మన్ కుర్చీ తనదంటే తనదంటూ ఇద్దరు నాయకులు గొడవపడ్డారు. హైకోర్డు ఉత్తర్వుల మేరకు జెడ్పీ చైర్మన్ గా ఈదర హరిబాబు బాధ్యతలు చేపట్టారు. అయితే అధికారులు లేకుండానే ఆయన బాధ్యతలు చేపట్టారు. జెడ్పీ ఛైర్మన్ ఈదర కాదని, తానేనంటూ నూకసాని బాలాజీ వివాదానికి దిగారు. ఈదరకు అనుకూలంగా వచ్చిన హైకోర్డు ఉత్తర్వులు తమకు ఇంకా అందలేదని కలెక్టర్ విజయ్‌కుమార్ చెబుతున్నారు. -
సీఎం కోర్టులో జెడ్పీ బంతి
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు వ్యవహారంపై చంద్రబాబు తీసుకునే నిర్ణయాన్ని అమలు చేయాలని జిల్లా నాయకత్వం భావిస్తోంది. శుక్రవారం రాత్రి మంత్రి శిద్దా రాఘవరావు ఇంట్లో జిల్లా నేతలు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఈదర హరిబాబు వ్యవహారమే ప్రధాన ఎజెండాగా ఉన్నట్లు సమాచారం. ఈదర హరిబాబుపై వేటు వేయాల్సిందేనని జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌తో పాటు కొండపి ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి పట్టుబట్టినట్లు సమాచారం. విప్ ధిక్కరించి పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈదర హరిబాబు జెడ్పీ పీఠాన్ని దక్కించుకోవడాన్ని జిల్లా నేతలు జీర్ణించుకోవడం లేదు. ఈదర హరిబాబు పూర్తిగా అవకాశవాదిగా వ్యవహరించారని, ఇప్పుడు పదవి కోసం మళ్లీ తెలుగుదేశం నాయకులను మంచి చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని స్థానిక నేతలు ఆగ్రహంగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈదర హరిబాబుపై వేటు వేయాల్సిందేనని పట్టు పడుతున్నారు. అయితే ఇప్పటికే అనర్హత వేటు తప్పించుకునేందుకు జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు ప్రయత్నాలు ప్రారంభించారు. జిల్లా మంత్రి శిద్దా రాఘవరావుతో పాటు మాజీ ఎమ్మెల్యే కరణం బలరామ్‌ను కలిసి మద్దతు కోరారు. వారు కూడా సానుకూలంగానే స్పందించినట్లు సమాచారం. ఈదర హరిబాబు గుంటూరు జిల్లా మంత్రి పత్తిపాటి పుల్లారావుతో పాటు స్పీకర్ కోడెల శివప్రసాద్‌ను కూడా కలిసి వారి మద్దతు కూడగట్టారు. వారి అందరి మద్దతు తనకు ఉందని హరిబాబు ధీమా వ్యక్తం చేస్తున్నారు. జరిగిన విషయాన్ని పక్కన పెట్టి జిల్లా పరిషత్ పీఠాన్ని దక్కించుకోవాలంటే ఈదర హరిబాబును పార్టీలో కొనసాగించడమే ఉత్తమమనే అభిప్రాయం పార్టీ పెద్దలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. వేటు పడితే మళ్లీ పీఠం దక్కే అవకాశం లేకపోవడంతో హరిబాబును తమతో కలుపుకుంటే మేలని దేశం నేతలు భావిస్తున్నారు. దీనిపై చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారనే దాన్ని బట్టి హరిబాబుపై వేటు పడుతుందా లేదా అన్న నిర్ణయం ఉంటుంది. -
చంద్రబాబు నిర్ణయం మేరకే నడుచుకుంటా:ఈదర హరిబాబు
ఒంగోలు:టీడీపీ అధ్యక్షడు చంద్రబాబు నాయుడు నిర్ణయం మేరకే నడుచుకుంటానని ప్రకాశం జడ్పీ ఛైర్మన్ గా ఎన్నికైన ఈదర హరిబాబు స్పష్టం చేశారు. పార్టీలో కొంతమంది తనను చంద్రబాబు నుంచి దూరం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. జడ్పీ ఛైర్మన్ గా ఎన్నికైన హరిబాబు సోమవారం మీడియాతో మాట్లాడారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసే దమ్మూ ధైర్యం జిల్లాలో ఎవ్వరికీ లేదన్నారు. ప్రకాశం జిల్లాలో టీడీపీకి నిజమైన వారసుడిని తానేనని తెలిపారు. తన చర్యల వల్ల టీడీపీ ఏనాడు నష్టపోలేదని హరిబాబు అభిప్రాయపడ్డారు. పార్టీలో కొంతమంది పనిగట్టుకుని అణగదొక్కాలని చూశారన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు ఆదేశాల మేరకే నడుచుకుంటానని, ఒక వేళ రాజీనామా చేయమని బాబు ఆదేశిస్తే తప్పకుండా చేస్తానన్నారు. ఆదివారం స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ఈదర హరిబాబు ప్రకాశం జడ్పీ ఛైర్మన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. టీడీపీ జడ్పీటీసీగా గెలుపొందిన హరిబాబు.. స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి ఒక ఓటు తేడాతో టీడీపీ అభ్యర్థి మన్నె రవీంద్రపై గెలుపొందారు. -
టీడీపీకి షాక్
ఎత్తుకు పై ఎత్తులు, నిముషాల వ్యవధిలో జరిగి పోయిన అనూహ్య పరిణామాలు అధికార తెలుగుదేశం పార్టీకి షాక్ ఇచ్చాయి. జెడ్పీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసైనా గెలవాలనుకున్న తెలుగుదేశం ఆశలు నెరవేరలేదు. పార్టీకి ఝలక్ ఇచ్చిన పొన్నలూరు జెడ్పీటీసీ సభ్యుడు ఈదర హరిబాబు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి పార్టీ అభ్యర్థిని ఒక్క ఓటు తేడాతో ఓడించడంతో పార్టీ నేతలు ఖంగు తినాల్సి వచ్చింది. ఊహించని పరిణామంతో అప్పటి దాకా గెలుపు ఉత్సాహంలో ఉన్న తెలుగుదేశం జెడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీ, మంత్రి అందరూ నిరుత్సాహంలో మునిగిపోయారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాపరిషత్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ అనూహ్య మలుపులతో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. అడ్డదారిలో గెలవాలనుకున్న తెలుగుదేశం పార్టీ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కూడా వినియోగించకునే అవకాశం లేకుండా ఒక తప్పుడు కేసులో మార్కాపురం జెడ్పీటీసీని అరెస్టు చేయించి తన కుట్రకు తెరలేపింది. గెలుపు కోసం తప్పుడు కేసు పెట్టించి పోలీసులను తెలుగు తమ్ముళ్లలాగా మార్చినా ఫలితం దక్కలేదు. గత నెల 20న ఘటన జరిగిందంటూ ఈ నెల 10వ తేదీ రాత్రి ఫిర్యాదు చేస్తే కనీసం విచారణ కూడా చేయకుండా 80 మంది పోలీసులతో ఒక ఉగ్రవాదిని అరెస్టు చేసిన తరహాలో మార్కాపురం జెడ్పీటీసీని అరెస్టు చేయించినా ఉపయోగం లేకుండా పోయింది. ఒంగోలులోని పాత జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆదివారం జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక నిర్వహించారు. కో-ఆప్షన్ సభ్యులు కూడా తమ వారే గెలవడంతో జెడ్పీ చైర్మన్ తమదే అన్న ధీమాతో ఉన్న తెలుగుదేశం పార్టీకి సొంత సభ్యుడు ఈదర హరిబాబు ఇచ్చిన ఝలక్‌తో సీన్ రివర్స్ అయ్యింది. జెడ్పీ చైర్మన్‌తో పాటు వైస్ చైర్మన్ పదవిని కూడా పోగొట్టుకున్న దేశం నేతలు నిరాశతో వెనుతిరగాల్సి వచ్చింది. ఈదర హరిబాబు అసంతృప్తితో ఉన్నాడని గుర్తించినా కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక సమయంలో తెలుగుదేశం పార్టీకే ఓటు వేయడంతో వారు దృష్టి పెట్టలేదు. జెడ్పీ చైర్మన్ అభ్యర్థి కోసం కందుకూరు జెడ్పీటీసీ సభ్యుడు కంచర్ల శ్రీకాంత్‌చౌదరి టీడీపీ తరఫున డాక్టర్ మన్నె రవీంద్ర పేరును ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను మర్రిపూడి జెడ్పీటీసీ తుళ్ళూరి వెంకట నరసింహం బలపరిచారు. ఈలోగా ఈదర హరిబాబు లేచి తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నానని చెప్పడంతో ఏవరైనా ప్రతిపాదించి, బలపరచాలని కలెక్టర్ సూచించారు. దీంతో వైఎస్సార్ సీపీ తన వ్యూహం మార్చుకుని తమ అభ్యర్థిని బరిలో దింపకుండా ఈదర హరిబాబుకు మద్దతు ప్రకటించింది. ఆయన అభ్యర్థిత్వాన్ని కనిగిరి జెడ్పీటీసీ దంతులూరి ప్రకాశం ప్రతిపాదించగా, పెద్దారవీడు జెడ్పీటీసీ దుగ్గెంపూడి వెంకటరెడ్డి బలపరిచారు. వైఎస్సార్ సీపీ తరఫున చైర్మన్ అభ్యర్ధిగా పోటీ చేయాల్సిన డాక్టర్ నూకసాని బాలాజీని వైస్ చైర్మన్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా నిలబెట్టింది. సమావేశంలోనే ఉన్న మంత్రి శిద్దా రాఘవరావు, బాపట్ల ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రి, ఎమ్మెల్యేల సమక్షంలోనే జరిగిన ఈ పరిణామాలతో వారు కొద్దిసేపు నిశ్చేష్టులయ్యారు. తర్వాత బుజ్జగించేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. దీంతో అతని నామినేషన్ చెల్లదంటూ అడ్డగోలు వాదనకు దిగారు. కలెక్టర్‌పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నించారు. ఈ విషయంపై జాప్యం జరుగుతుండంతో సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపుసురేష్ ఎన్నికల నిబంధనను ప్రత్యేకంగా చదివి వినిపిస్తూ తొందరగా ఎన్నిక నిర్వహించాలంటూ అభ్యర్థించారు. ఎన్నికల కమిషన్ సలహా తీసుకునేందుకు యత్నిస్తున్నానని, వచ్చింది రెండు నామినేషన్లే కనుక ఈదర హరిబాబు దాఖలు చేసిన నామినేషన్ విషయమై స్పష్టత కోసం వేచి ఉన్నామని చెప్పడంతో అయోమయం నెలకొంది. అయితే ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తెలుగుదేశం జెడ్పీ ఆశలు ఆవిరయ్యాయి. దీంతో ఈదర హరిబాబుకు అతని ఓటుతోపాటు వైఎస్సార్సీపీ అభ్యర్థులు 27 మంది మద్దతు కలిసి 28 ఓట్లు వచ్చాయి. ప్రత్యర్థి అయిన మన్నె రవీంద్రకు టీడీపీ సభ్యుల 24 ఓట్లు, వైఎస్సార్సీపీ నుంచి గెలిచి టీడీపీకి మద్దతు ప్రకటించిన ముగ్గురు సభ్యులతో కలిసి 27 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఈదర జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఎన్నికైనట్లు కలెక్టర్ ప్రకటించారు. అనంతరం వైస్ చైర్మన్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా డాక్టర్ నూకసాని బాలాజీ పేరును వెలిగండ్ల జెడ్పీటీసీ రామన తిరుపతిరెడ్డి ప్రతిపాదించగా, ఇంకొల్లు జెడ్పీటీసీ పీ.వెంకట రమణ బలపరిచారు. దీంతో ఆయన కూడా వైఎస్సార్సీపీ అభ్యర్థులు 26 మంది, అతని ఓటు, టీడీపీ నుంచి ఈదర హరిబాబు ఓటు కలిపి 28 ఓట్లు సాధించారు. ప్రత్యర్థి పటాపంజుల కోటేశ్వరమ్మను సంతనూతలపాడు జెడ్పీటీసీ అభ్యర్థి తన్నీరు శ్రీనివాసరావు ప్రతిపాదించగా, కందుకూరు జెడ్పీటీసీ కంచర్ల శ్రీకాంత్‌చౌదరి బలపరిచారు. అయితే ఈమెకు కేవలం 27 ఓట్లు మాత్రమే రావడంతో డాక్టర్ నూకసాని బాలాజీ ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా విజయం దక్కడంతో ఒక్కసారిగా ఈదర హరిబాబు తీవ్ర భావోద్వేగానికి లోనై కంటతడిపెట్టారు. ఎన్నిక కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నడిరోడ్డుపై ఇనుప ముళ్లకంచెలు వేసి పాస్ లేకుండా ఎవ్వరూ లోపలికి రాకుండా చర్యలు తీసుకున్నారు. మీడియాను కూడా సెల్ఫోన్లతో లోపలికి అనుమతించలేదు. చైర్మన్ ఈదర హరిబాబు ప్రొఫైల్ పేరు: ఈదర హరిబాబు తండ్రి: చెంచయ్య స్వస్థలం : నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు వయస్సు: 59 సంవత్సరాలు విద్యార్హతలు: పదో తరగతి వరకు అమ్మనబ్రోలులో చదివారు. ఇంటర్మీడియెట్ చీరాల వీఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కాలేజీలో పూర్తిచేశారు. అనంతరం బీఎస్సీ గ్రాడ్యుయేషన్‌ను ఒంగోలు సీఎస్ఆర్ శర్మా కాలేజీలో చదివారు. ఈ సందర్భంగా ఆయన పీఎస్ఎఫ్ స్టూడెంట్ యూనియన్ లీడర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. రాజకీయ జీవితం: తొలుత స్వగ్రామమైన అమ్మనబ్రోలు గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. అనంతరం మండల ఉపాధ్యక్షునిగాను, 1994లో ఒంగోలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం జిల్లా పరిషత్ చైర్మన్‌గా గెలుపొందారు. ఇవి కాకుండా ఏటా క్రమం తప్పకుండా ఎన్టీఆర్ కళాపరిషత్, విద్యార్థి పరిషత్, కర్షక పరిషత్, భారతీయం తదితర కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు. వైస్ చైర్మన్ నూకసాని బాలాజీ ప్రొఫైల్ పేరు: డాక్టర్ నూకసాని బాలాజీ తండ్రి: కోటయ్య, తల్లి : కామేశ్వరమ్మ స్వస్థలం : బింగినపల్లి, సింగరాయకొండ మండలం, ప్రకాశం జిల్లా వయస్సు: 53 విద్యార్హతలు: ఎంఏ ఎకనామిక్స్, ఎంఫిల్, పీహెచ్డీ రాజకీయ జీవితం: కాంగ్రెస్ పార్టీలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా, జిల్లా బీసీ సెల్ చైర్మన్‌గా రెండు పర్యాయాలు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా 2007 నుంచి 2010 వరకు పనిచేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓదార్పు కమిటీ సభ్యుడిగా వ్యవహరించారు. 2011 మే 27న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నారు. ఇటీవలే పుల్లలచెరువు జెడ్పీటీసీగా గెలుపొందారు.