ఈదర హరిబాబు ,మన్నే రవీంద్ర (ఫైల్)
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబుపై అవిశ్వాసం పెట్టి ఆయన్ను పదవీచ్యుతుడ్ని చేసేందుకు అధికార పార్టీ సిద్ధమవుతోందా..? యర్రగొండపాలేనికి చెందిన టీడీపీ నేత మన్నే రవీంద్ర అధికార పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారా..? ఈదరను పదవి నుంచి దింపి చైర్మన్‌ను చేస్తామని రవీంద్రకుటీడీపీ హామీ ఇచ్చిందా..? ఈ మేరకు సీఎం సైతం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారా..? ఈ నేపథ్యంలోనే జడ్పీ చైర్మన్‌పై అవిశ్వాసానికి టీడీపీ సిద్ధమైందా..? ఇందుకు అధికార పార్టీ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది..
అసంతృప్తిలో మన్నే రవీంద్ర..
యర్రగొండపాలేనికి చెందిన టీడీపీ నేత, దొనకొండ జడ్పీటీసీ మన్నే రవీంద్ర అధికార పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా అధికార పార్టీ నుంచి నాడు మన్నే రవీంద్ర బరిలో దిగారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఊహించని రీతిలో అధికార పార్టీ జడ్పీటీసీ ఈదర హరిబాబుకు మద్ధతు పలకడంతో రవీంద్ర చివరి నిమిషంలో జిల్లా పరిషత్ చైర్మన్ కాలేకపోయారు. చైర్మన్‌గిరి కోసం ఆర్థికంగా నష్టపోయిన రవీంద్రకు పార్టీ అధికారంలోకి వచ్చినా ఒరిగిందేమి లేదు. మరోవైపు యర్రగొండపాలెం నియోజకవర్గంలో కీలకనేతగా ఉన్నా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచిన డేవిడ్‌రాజు అధికార పార్టీలో చేరడంతో రవీంద్ర అధిపత్యానికి గండిపడింది. అప్పటికే అక్కడ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న అజితరావు, కేడర్‌లో పట్టున్న జడ్పీటీసీ మన్నె రవీంద్రల మధ్య వర్గ విభేదాలున్నాయి. డేవిడ్‌రాజు రాకతో పార్టీ మూడు వర్గాలుగా చీలిపోయింది.
ప్రసుత్తం అజితరావు నియోజకవర్గానికి కొంత దూరంగా ఉన్నా, మన్నె రవీంద్ర, ఎమ్మెల్యే డేవిడ్‌రాజులకు పొసగడం లేదు. ఈ పరిస్థితుల్లో డేవిడ్‌రాజుకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చినా.. అటు మన్నె రవీంద్ర, ఇటు అజితరావు వర్గాలు పని చేసే పరిస్థితి లేదు.ఒక వేళ అజితరావుకు టికెట్ ఇచ్చినా మన్నె రవీంద్ర, డేవిడ్‌రాజులు ఆమెకు మద్ధతు ఇచ్చే ప్రసక్తే లేదు. సుదీర్ఘంగా సేవలందించినా.. పదవితో పాటు ప్రాధాన్యత లేకపోవడంతో మన్నే రవీంద్ర అలకబూనినట్లు తెలుస్తోంది. ఆయన త్వరలోనే టీడీపీని వీడతారన్న ప్రచారమూ సాగుతోంది. యర్రగొండపాలెం, దర్శి, పర్చూరు ప్రాంతాల్లో సామాజికవర్గ బలంతో పాటు కొంత మేర ప్రజాబలమున్న మన్నే రవీంద్ర టీడీపీ వీడటం వల్ల ఆ పార్టీకి మరింత నష్టం కలగనుంది.
జడ్పీ చైర్మన్‌గిరి ఎర..
అధికార పార్టీ మన్నే రవీంద్రను బుజ్జగించే ప్రయత్నానికి దిగింది. జడ్పీ చైర్మన్ ఈదర హరిబాబును పదవి నుంచి దించి మన్నే రవీంద్రకు చైర్మన్ పదవి అప్పగించాలని ముఖ్యమంత్రి జిల్లా టీడీపీ అధ్యక్షుడు దామచర్ల జనార్ధన్‌తో పాటు మిగిలిన నేతలను ఆదేశించినట్లు సమాచారం. దీంతో జడ్పీపై అవిశ్వాసం పెట్టేందుకు అధికార పార్టీ నేతలు మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కొందరు టీడీపీ నేతలు దీన్ని లోలోన వ్యతిరేకిస్తున్నా పైకి అంటిముట్టినట్లు వ్యవహరిస్తున్నట్లు అవిశ్వాసాన్ని దామచర్ల జనార్ధన్ నెత్తికెత్తుకొనే పక్షంలో కరణం బలరాం వర్గం ఇందుకు పూర్తి స్థాయిలో మద్ధతు పలికే అవకాశాలు కానరావడం లేదు. అయినా జడ్పీ చైర్మన్‌పై అవిశ్వాసానికి అధికార పార్టీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
జిల్లా పరిషత్ తాజా పరిస్థితిని పరిశీలిస్తే...
56 మంది సభ్యులున్న జిల్లా పరిషత్‌లో 31 మంది వైఎస్సార్‌సీపీ తరపున, 25 మంది టీడీపీ తరపున ఎన్నికయ్యారు. వైఎస్సార్‌సీపీ తరపున నూకసాని బాలాజీ, టీడీపీ తరపున దొనకొండ జడ్పీటీసీ మన్నే రవీంద్రలు చైర్మన్ అభ్యర్థులుగా బరిలోకి దిగారు. తొలి సమావేశం నాటికే అధికార పార్టీ ముగ్గురు వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీలను కొనుగోలు చేసింది. దీంతో ఇరుపార్టీలకు 28 చొప్పున సమానంగా జడ్పీటీసీలున్నారు. రెండవ సమావేశం నాటికి అధికార పార్టీ వైఎస్సార్‌సీపీకి చెందిన మార్కాపురం జడ్పీటీసీ రంగారెడ్డిపై ఎస్సీ యాక్టు కేసు పెట్టించారు. సమావేశానికి వస్తున్న సమయంలో రంగారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. దీంతో టీడీపీకి 28 మంది, వైఎస్సార్‌సీపీకి 27 మంది సభ్యులున్నారు.
దీంతో అప్పట్లో వైఎస్సార్‌సీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి రాత్రికి రాత్రే చక్రం తిప్పారు. టీడీపీ తరపున పొన్నలూరు జడ్పీటీసీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే హరిబాబును జడ్పీ చైర్మన్ చేసేందుకు వైఎస్సార్‌సీపీ సిద్ధమైంది. ఇందుకు నూకసాని బాలాజీని ఒప్పించారు. వ్యూహం మేరకు సమావేశంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేయించి ఈదరను చైర్మన్‌గా ఎన్నుకున్నారు. 27 సభ్యులే కావడంతో టీడీపీ ఓటమిపాలైంది. మన్నే రవీంద్రకు చైర్మన్‌గిరి దక్కలేదు. ఆ తర్వాత టీడీపీ ఈదర హరిబాబును పార్టీ నుండి సస్పెండ్ చేయటం, జడ్పీటీసీ పదవి రద్దు కావడంతో ఈదర తాత్కాలికంగా చైర్మన్ కుర్చీ దిగిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కోర్టుకెళ్ళి ఆయన తిరిగి చైర్మన్‌గా కొనసాగారు. ఈ మధ్య కాలంలో 13 నెలల పాటు జడ్పీ వైస్ చైర్మన్‌గా ఉన్న నూకసాని బాలాజీ చైర్మన్‌గా కొనసాగారు.
అవిశ్వాసం ఫలించేనా..?
జిల్లా పరిషత్‌కు 56 మంది సభ్యులుండగా ప్రస్తుతం 55 మంది సభ్యులే సభలో ఉన్నారు. వీరిలో వైఎస్సార్‌సీపీకి 17 మంది సభ్యులున్నారు. ఈదర హరిబాబుతో కలిపితే 18 మంది అవుతారు. అధికార టీడీపీకి 37 మంది సభ్యులున్నారు. అవిశ్వాసం ప్రవేశపెట్టేందుకు ఈ సంఖ్య సరిపోతుంది. నాలుగేళ్ళ పదవి కాలం అనంతరం అవిశ్వాసం పెట్టవచ్చు. ఈ లెక్కన జులై 13 నాటికి అవిశ్వాసం పెట్టే అవకాశం కలుగుతుంది. ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలం అధికార పార్టీకి అనుకూలంగానే ఉంది. ఈదరపై అవిశ్వాసం పెట్టే పక్షంలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు అధికార పార్టీలోని దాదాపు 10 మంది సభ్యులు ఈదర హరిబాబుకు మద్ధతు పలికే అవకాశం ఉంది. కొండపి, చీరాల, గిద్దలూరు, మార్కాపురం, అద్దంకి నియోజకవర్గాల పరిధిలోని పలువురు సభ్యులు వ్యక్తిగతంగా, సామాజికవర్గ పరంగా ఈదరకు మద్ధతునిస్తున్నారు. ఇదే జరిగితే ఈదర హరిబాబును చైర్మన్ పదవి నుంచి దించడం సాధ్యం కాదు.
మరోవైపు టెక్నికల్‌గా ఈదరపై ఇప్పట్లో అవిశ్వాసం పెట్టే అవకాశం లేదన్న ప్రచారం సాగుతోంది. నాలుగేళ్ళ పదవి కాలం ముగిసిన తర్వాత అవిశ్వాసం పెట్టవచ్చు. ఈదర 13 నెలల పాటు పదవిలో లేరు. ఈ సమయాన్ని నాలుగు సంవత్సరాల సమయంతో లెక్కిస్తారా.. లేదా.. అన్న దానిపై అవిశ్వాస తీర్మానం ఆధారపడి ఉంది. చైర్మన్ పదవిలో ఉన్న కాలాన్ని మాత్రమే లెక్కించే పక్షంలో నాలుగేళ్ళ కాలం పూర్తి కాద. ఈ లెక్కన చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టే అవకాశం ఉండదు. అలా కాకుండా పాలకవర్గం ఏర్పడిన నాటి నుండి మొత్తం కాలాన్ని గణించే పక్షంలోనే అవిశ్వాసం వీలవుతుంది. చైర్మన్ పదవి కాలాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకొనే అవకాశం ఉందని ఇప్పటికే న్యాయ నిపుణులు పేర్కొంటున్నట్లు సమాచారం. ఇదే జరిగితే జడ్పీ చైర్మన్‌పై అవిశ్వాసం జరిగే అవకాశం ఉండదు. ఈ పరిస్థితుల్లో ఈదరకు పదవి గండం అవకాశాలు తక్కువే. ఒక వేళ అవిశ్వాసం నేపథ్యంలో మరోమారు ఈదర కోర్టు మెట్లెక్కాల్సి వస్తే అదృష్టం కలిసి వచ్చి వైస్ చైర్మన్‌గా ఉన్న తనకు పదవి దక్కకపోతుందా.. అని నూకసాని బాలాజీ ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా జిల్లా పరిషత్‌పై అవిశ్వాసం వ్యవహారం ప్రస్తుతం అధికార టీడీపీతో పాటు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment