భద్రాచలం: అంతర్రాష్ట్ర సరిహద్దు సమస్యలతో భద్రాచలం ప్రాంతం తరచూ వార్తల్లోకి ఎక్కుతోంది. తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న భద్రగిరి మీదుగా గంజాయి పెద్ద ఎత్తున తరలిపోతోంది. ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల బోర్డర్‌లు కూడా ఇక్కడికి వంద కిలోమీటర్‌ల దూరంలో ఉండటంతో స్మగ్లింగ్‌కూ అడ్డాగా మారుతోంది. కొందరు మాఫియాగా ఏర్పడి, గంజాయి, టేకు కలపను అక్రమంగా తరలిస్తున్నారు. మావోయిస్టుల కదలికలు ఉండే నాలుగు రాష్ట్రాల అటవీ ప్రాంతాన్ని స్మగ్లింగ్‌కు సేఫ్‌జోన్‌గా చేసుకుంటున్నారు.
భూపాలపల్లి జిల్లా ములుగుకు చెందిన సురేష్ అనే వ్యక్తి జాతీయ నిఘా విభాగం ఎస్‌ఐగా నకిలీ అవతరమెత్తి ఎటపాక(ఆంధ్రా) పోలీస్ స్టేషన్‌ను కేంద్రంగా అనేక దందాలకు పాల్పడ్డాడు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి కావటంతో అతను నిఘా విభాగానికి చెందినవాడే అయిఉండవచ్చని అటు ఏపీ పోలీసులు నకిలీ ఎస్సై బాగోతాలపై ఏమాత్రం దృష్టి సారించలేకపోయారు. గంజాయి రవాణాకు పోలీసులు, ఎక్సైజ్ అధికారులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. హైదరాబాద్, విజయవాడ, వరంగల్ వంటి ప్రాంతాలకు పెద్ద ఎత్తున గంజాయి భద్రాచలం మీదుగానే తీసుకెళ్తున్నారు. భద్రాచలం బ్రిడ్జి సెంటర్‌లో ఎక్సైజ్ శాఖ అంతర్‌రాష్ట్ర చెక్‌పోస్టు ఉన్నా ఫలితంలేకుండా పోయింది. రంగారెడ్డి పరిసర ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో పాడి గేదెలను దొంగతనంగా తీసుకొచ్చిన ఓ వ్యక్తి వాటిని భద్రాచలానికి సమీపంలోని ఎటపాకలో ఉంచి విక్రయాలు చేస్తూ, దర్జాగా వ్యాపారం సాగించాడు. ఓ బాధితుడు పోలీసులను ఆశ్రయించే వరకు ఈ మోసగాడి బాగోతం బయటకు రాలేదు.
భద్రాచలంలో పట్టుబడిన కలప(ఫైల్)
భద్రాచలం ఇందిరాక్రాంతి పథం కార్యాలయంలో క్లస్టర్ కో ఆర్డినేటర్‌గా పనిచేసే సాంబశివరావు కొంతకాలం క్రితం ఇక్కడికి సమీపంలోని ఏపీలో గల గుండాల జామాయిల్ తోటలో హత్యకు గురయ్యాడు. హత్య జరిగిన ప్రాంతం ఏపీలో ఉండటంతో అక్కడి పోలీస్టేషన్‌లో దీనిపై కేసు నమోదైంది. ఈ కేసు పూర్వాపరాలు మొత్తం తెలంగాణలోని భద్రాచలంతో ముడిపడి ఉండటంతో ఇప్పటి వరకూ ఈ కేసు మిస్టరీని వెల్లడించలేదు. గిరిజన ప్రాంతం కావటంతో సారాయి తయారీ జోరుగానే సాగుతోంది. నల్లబెల్లం భద్రాచలానికి కూతవేటు దూరంలో ఉన్న గుండాల, పురుషోత్తపట్నం, తుమ్మల గ్రామాల్లో నిల్వ చేస్తున్నారు. కానీ వ్యాపారులంతా భద్రాచలానికి చెందిన వారే. ఇక్కడి ఎక్సైజ్ అధికారులు ఒక్కో సారి హద్దులను దాటి ఏపీలోకి వెళ్లి కూడా బెల్లం నిల్వలను స్వాధీనం చేసుకుని, ఇక్కడి వ్యాపారస్తులపై కేసులు పెట్టిన దాఖలాలు ఉన్నాయి. కానీ వేరే రాష్ట్రంలో ఎలా దాడులు చేస్తారని వ్యాపారస్తులు వారిపైనే ఎదురుదాడి చేస్తున్నారు.
నిఘా పెంచాల్సిందే..
సరిహద్దుల సమస్య ఇక్కడి అధికారులకు కూడా తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే మెరుగైన ఫలితాలు వస్తాయి. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ప్రత్యేక నిఘా పెంచాల్సి ఉంది. కొన్నివర్గాల పేరుతో ఈ ప్రాంతంలో సంచరిస్తున్న వ్యక్తులు, సంస్థలపై కూడా నిశిత పరిశీలన అవసరం ఉంది. ఆ దిశగా రెండు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించి, తగిన చర్యలు తీసుకోవాలని భద్రాచలం వాసులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment