
మోరంపల్లిబంజరలో ప్రమాదాలకు నెలవైన ప్రాంతం
బూర్గంపాడు : మణుగూరు–కొత్తగూడెం ప్రధాన రహదారిపై మండల పరిధిలోని మోరంపల్లిబంజర గ్రామం మృత్యుమార్గాన్ని తలపిస్తోంది. ఈ గ్రామం వద్ద ఇటీవల తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రయాణికులు తమ నిండు ప్రాణాలు కోల్పోతున్నారు. అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా మణుగూరు–కొత్తగూడెం జాతీయ రహదారి పనులు మోరంపల్లిబంజర గ్రామం కూడలిలో అస్తవ్యస్తంగా చేపట్టడంతో నిర్మాణం అసంపూర్తిగా వదిలేశారు. మణుగూరు వెళ్లే రహదారి మార్గంలో రహదారి ఒక పక్క ఎత్తు, మరోపక్క పల్లంగా నిర్మించడంతో ద్విచక్రవాహనాలపై ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఆ ప్రాంతానికి చేరుకోగానే అదుపు తప్పి కిందపడి తీవ్రంగా గాయపడి పలువురు ప్రాణాలు కోల్పోవడమే కాకుండా ఎంతో మంది గాయాలపాలవుతున్నారు. రాత్రి వేళ తరచూ ప్రమాదాలు జరుగుతూ ఆ ప్రాంతం ప్రమాదాలకు నెలవుగా మారింది.
ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్ మాత్రం ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టడం లేదు. తరచూ ప్రమాదాలు జరగడంపై స్థానికులు, ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇటీవల రెండు రోజుల వ్యవధిలో రెండు రోడ్డు ప్రమాదాలలో ఒక మహిళ, ఒక యువకుడు ప్రాణాలు కోల్పోవడంఢఢతో పాటు పలువురు గాయపడ్డారు. జనవరి 30వ తేదీ రాత్రి అశ్వాపురంకు చెందిన బైరిబొయిన లింగమ్మ, మరో ఇద్దరు యువకులు బైక్‌పై అశ్వాపురం నుండి పాల్వంచ వెళ్తుండగా మోరంపల్లిబంజర వద్ద బైక్ అదుపు తప్పి కిందపడ్డారు. లింగమ్మ తలకు బలమైన గాయంకాగా ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. ముగ్గురిని మోరంపల్లిబంజర పీహెచ్‌సీకి తరలించగా చికిత్స పొందుతూ లింగమ్మ మృతి చెందింది.
జనవరి 31 రాత్రి మణుగూరుకు చెందిన ధరావత్ రవీందర్, మోహన్‌రావు, రూపలు ముగ్గురు బైక్‌పై మోరంపల్లిబంజర నుండి మణుగూరు వస్తుండగా కొత్తగూడెం–మణుగూరు జాతీయ రహదారిపై అదే ప్రాంతంలో బైక్ అదుపు తప్పి కిందపడ్డారు. రహదారిపై అటుగా వస్తున్న లారీ వీరిని ఢీకొట్టడంతో రవీందర్ అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతుండటంతో కలత చెందిన స్థానికులు బుధవారం రాత్రి రహదారిపై పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. స్థానికుల ఆందోళనతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామవడంతో బూర్గంపాడు ఎస్‌ఐ సంతోష్ సంఘటనా స్థలానికి చేరుకొని స్థానికులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. ఇప్పటికైనా అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్ స్పందించి రహదారి నిర్మాణ పనులు పూర్తి చేసి మోరంపల్లిబంజరలో ప్రధాన రహదారిపై ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని స్థానికులు, ప్రయాణికులు కోరుతున్నారు.

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మణుగూరుకు చెందిన యువకుడు రవీందర్ (ఫైల్)
Comments
Please login to add a commentAdd a comment