తేజావత్ రామచంద్రునాయక్, కవిత, సీతారాంనాయక్
సాక్షి, కొత్తగూడెం: మహబూబాబాద్ లోక్‌సభ స్థానం టీఆర్‌ఎస్ టికెట్ కోసం త్రిముఖ పోటీ నెలకొంది. మరో రెండు రోజుల్లో ఎన్నికల కోడ్ రానుండడంతో పాటు, ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరుసగా సమావేశాలు నిర్వహించుకుంటూ వస్తున్నారు. ఈనెల 16న మహబూబాబాద్ పార్లమెంటు స్థానానికి సంబంధించిన ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ టికెట్‌పై పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. సన్నాహక సమావేశం అనంతరం అభ్యర్థి విషయమై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎన్నికల సమాయత్తంలో కాంగ్రెస్ కంటే అనేక అడుగులు ముందంజలో ఉన్న టీఆర్‌ఎస్.. అభ్యర్థులనూ ముందే ప్రకటించేందుకు సిద్ధమవుతోంది.
ఈ నేపథ్యంలో టికెట్ల కోసం ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ మదిలో ఏముందో అని టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తల్లో టెన్షన్ నెలకొంది. కాగా, మానుకోట టికెట్ ఈసారి కూడా తనకే వస్తుందని సిట్టింగ్ ఎంపీ సీతారాంనాయక్ ధీమాగా ఉన్నారు. మరోవైపు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి తేజావత్ రామచంద్రునాయక్ సైతం టికెట్ రేసులో ముందున్నారు. రామచంద్రు గత రెండేళ్లుగా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక తాజాగా డోర్నకల్ ఎమ్మెల్యే డి.ఎస్.రెడ్యానాయక్ కుమార్తె కవిత కూడా ఎంపీ టికెట్ రేసులో ఉన్నారు.
ఎవరి అంచనాలు వారివే...
సీతారాంనాయక్ సిట్టింగ్ ఎంపీ కావడంతో ఆయనకే టికెట్ వస్తుందని కొందరు కార్యకర్తలు అంచనాలు వేసుకుంటున్నారు. మరోవైపు ఢిల్లీలో పలుకుబడి ఎక్కువగా ఉన్న రామచంద్రు అయితే కేంద్రం నుంచి పెద్ద పెద్ద ప్రాజెక్టులు సాధించే అవకాశం ఉంటుందని, దీంతో ఆయనకే అవకాశం లభించవచ్చని పలువురు భావిస్తున్నారు. ఇక కవిత పేరు సైతం బాగానే వినిపిస్తోంది. ముఖ్యంగా డోర్నకల్, మహబూబాబాద్ సెగ్మెంట్ల పరిధిలో కవితకు టికెట్ ఖాయమనే చర్చలు నడుస్తున్నాయి. కవిత గతంలో మహబూబాబాద్ ఎమ్మెల్యేగానూ ప్రాతినిధ్యం వహించారు. డోర్నకల్ నుంచి గెలిచిన రెడ్యానాయక్ ప్రస్తుతం మంత్రి పదవి రేసులో ఉన్నారు. ఆయన వైఎస్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఇప్పటికే ఎర్రబెల్లి దయాకర్‌రావుకు అవకాశం లభించింది.
అలాగే మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్‌కు ఎమ్మెల్సీ అవకాశం కల్పించారు. టీఆర్‌ఎస్ జనరల్ సెక్రటరీగా ఉన్న సత్యవతిని మహబూబాబాద్ పార్లమెంట్ కన్వీనర్‌గా నియమించారు. ఆమె ఇప్పటికే భద్రాచలం, ఇల్లెందు, మహబూబాబాద్, డోర్నకల్ సెగ్మెంట్ల పరిధిలో సమావేశాలు నిర్వహించారు. ఇక తాజాగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును వరంగల్, మహబూబాబాద్ లోక్‌సభ స్థానాలకు ఎన్నికల ఇన్‌చార్జ్‌గా కేసీఆర్ నియమించారు.
అభ్యర్థి ఎంపికకు టీఆర్‌ఎస్ సర్వే...
మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి ఎంపిక కోసం టీఆర్‌ఎస్ పలుమార్లు సర్వేలు సైతం చేయించింది. భద్రాద్రి జిల్లాతో పాటు ములుగు సెగ్మెంట్లలో సిట్టింగ్ ఎంపీపై కొంతమేర వ్యతిరేకత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అభ్యర్థిని మార్చాలని మెజారిటీ సెగ్మెంట్లలో పార్టీ శ్రేణులు అభిప్రాయపడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తేజావత్ రామచంద్రు పేరు ఎక్కువగా వినపడుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఎవరిని బరిలో దింపుతుందనే విషయాన్ని కూడా కేసీఆర్ పరిగణలోకి తీసుకుంటారనే వాదన కూడా వినిపిస్తోంది.
ఇక రెడ్యానాయక్‌కు వివిధ సమీకరణల్లో భాగంగా మంత్రి పదవిని కేటాయించలేని పక్షంలో సంతృప్తి పరిచేందుకు ఆయన కుమార్తె కవితకు మహబూబాబాద్ లోక్‌సభ టికెట్ కేటాయిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గత డిసెంబర్‌లో మహబూబాబాద్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల ప్రచారం సందర్భంగా.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో సీతారాంనాయక్‌ను గెలిపించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.
దీంతో టికెట్ తనకేనని సీతారాం ధీమాగా ఉన్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ మిశ్రమ ఫలితాలు వచ్చాయి. మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలోని ఏడు శాసనసభ సెగ్మెంట్లలో నాలుగు చోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది. కీలకమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక, భద్రాచలం, ఇల్లెందు, ములుగు స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందింది. వరంగల్ రూరల్ జిల్లాలోని నర్సంపేట, మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్, మహబూబాబాద్ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ గెలుపొందింది. ఈ నేపథ్యంలో ఎంపీ అభ్యర్థిని మారుస్తారా అనే వా దనలు సైతం వస్తున్నాయి.
ఇదే జరిగితే కేసీఆర్ వద్ద మంచి పేరు, పలుకుబడి ఉన్న రామచం ద్రుకు అవకాశం లభిస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో మహబూబాబాద్ లోక్‌సభ టికెట్ వచ్చినట్లే వచ్చి చేజారిన రామచంద్రు.. ఈసారి అవకాశం కోసం ఎదురు చూస్తున్నా రు. టికెట్ ప్రయత్నాల్లో భాగంగా మానుకోట లోక్‌సభ పరిధిలో ఇప్పటికే పలుమార్లు పర్యటించారు. మళ్లీ రేపటి నుంచి అన్ని సెగ్మెంట్లలో పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.
భద్రాద్రి జిల్లానే కీలకం..
మానుకోట లోక్‌సభ పరిధిలో భద్రాద్రి జిల్లాలో ఉన్న సెగ్మెంట్లు అత్యంత కీలకం. ఇక్కడ అత్యధికంగా మూడు సెగ్మెంట్లు ఉన్నాయి. అయితే అన్నిచోట్లా విపక్ష కాంగ్రెస్ గెలుపొందింది. తాజాగా పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు గులాబీ తీర్థం పుచ్చుకోనుండడంతో టీఆర్‌ఎస్‌లో జిల్లా వ్యాప్తంగా మరింత జోష్ వచ్చింది. ఈ నేపథ్యంలో టికెట్ విషయమై పార్టీ శ్రేణులు ఎదురుచూస్తున్నాయి. మరి ఈ ముగ్గురిలో అదృష్టం ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment