Ramachandru tejavath
-
రేసులో ముగ్గురు!
సాక్షి, కొత్తగూడెం: మహబూబాబాద్ లోక్‌సభ స్థానం టీఆర్ఎస్ టికెట్ కోసం త్రిముఖ పోటీ నెలకొంది. మరో రెండు రోజుల్లో ఎన్నికల కోడ్ రానుండడంతో పాటు, ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరుసగా సమావేశాలు నిర్వహించుకుంటూ వస్తున్నారు. ఈనెల 16న మహబూబాబాద్ పార్లమెంటు స్థానానికి సంబంధించిన ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ టికెట్‌పై పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. సన్నాహక సమావేశం అనంతరం అభ్యర్థి విషయమై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎన్నికల సమాయత్తంలో కాంగ్రెస్ కంటే అనేక అడుగులు ముందంజలో ఉన్న టీఆర్ఎస్.. అభ్యర్థులనూ ముందే ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో టికెట్ల కోసం ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ మదిలో ఏముందో అని టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల్లో టెన్షన్ నెలకొంది. కాగా, మానుకోట టికెట్ ఈసారి కూడా తనకే వస్తుందని సిట్టింగ్ ఎంపీ సీతారాంనాయక్ ధీమాగా ఉన్నారు. మరోవైపు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి తేజావత్ రామచంద్రునాయక్ సైతం టికెట్ రేసులో ముందున్నారు. రామచంద్రు గత రెండేళ్లుగా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక తాజాగా డోర్నకల్ ఎమ్మెల్యే డి.ఎస్.రెడ్యానాయక్ కుమార్తె కవిత కూడా ఎంపీ టికెట్ రేసులో ఉన్నారు. ఎవరి అంచనాలు వారివే... సీతారాంనాయక్ సిట్టింగ్ ఎంపీ కావడంతో ఆయనకే టికెట్ వస్తుందని కొందరు కార్యకర్తలు అంచనాలు వేసుకుంటున్నారు. మరోవైపు ఢిల్లీలో పలుకుబడి ఎక్కువగా ఉన్న రామచంద్రు అయితే కేంద్రం నుంచి పెద్ద పెద్ద ప్రాజెక్టులు సాధించే అవకాశం ఉంటుందని, దీంతో ఆయనకే అవకాశం లభించవచ్చని పలువురు భావిస్తున్నారు. ఇక కవిత పేరు సైతం బాగానే వినిపిస్తోంది. ముఖ్యంగా డోర్నకల్, మహబూబాబాద్ సెగ్మెంట్ల పరిధిలో కవితకు టికెట్ ఖాయమనే చర్చలు నడుస్తున్నాయి. కవిత గతంలో మహబూబాబాద్ ఎమ్మెల్యేగానూ ప్రాతినిధ్యం వహించారు. డోర్నకల్ నుంచి గెలిచిన రెడ్యానాయక్ ప్రస్తుతం మంత్రి పదవి రేసులో ఉన్నారు. ఆయన వైఎస్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఇప్పటికే ఎర్రబెల్లి దయాకర్‌రావుకు అవకాశం లభించింది. అలాగే మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్‌కు ఎమ్మెల్సీ అవకాశం కల్పించారు. టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీగా ఉన్న సత్యవతిని మహబూబాబాద్ పార్లమెంట్ కన్వీనర్‌గా నియమించారు. ఆమె ఇప్పటికే భద్రాచలం, ఇల్లెందు, మహబూబాబాద్, డోర్నకల్ సెగ్మెంట్ల పరిధిలో సమావేశాలు నిర్వహించారు. ఇక తాజాగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును వరంగల్, మహబూబాబాద్ లోక్‌సభ స్థానాలకు ఎన్నికల ఇన్చార్జ్గా కేసీఆర్ నియమించారు. అభ్యర్థి ఎంపికకు టీఆర్ఎస్ సర్వే... మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి ఎంపిక కోసం టీఆర్ఎస్ పలుమార్లు సర్వేలు సైతం చేయించింది. భద్రాద్రి జిల్లాతో పాటు ములుగు సెగ్మెంట్లలో సిట్టింగ్ ఎంపీపై కొంతమేర వ్యతిరేకత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అభ్యర్థిని మార్చాలని మెజారిటీ సెగ్మెంట్లలో పార్టీ శ్రేణులు అభిప్రాయపడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తేజావత్ రామచంద్రు పేరు ఎక్కువగా వినపడుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఎవరిని బరిలో దింపుతుందనే విషయాన్ని కూడా కేసీఆర్ పరిగణలోకి తీసుకుంటారనే వాదన కూడా వినిపిస్తోంది. ఇక రెడ్యానాయక్‌కు వివిధ సమీకరణల్లో భాగంగా మంత్రి పదవిని కేటాయించలేని పక్షంలో సంతృప్తి పరిచేందుకు ఆయన కుమార్తె కవితకు మహబూబాబాద్ లోక్‌సభ టికెట్ కేటాయిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గత డిసెంబర్లో మహబూబాబాద్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల ప్రచారం సందర్భంగా.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో సీతారాంనాయక్‌ను గెలిపించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. దీంతో టికెట్ తనకేనని సీతారాం ధీమాగా ఉన్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ మిశ్రమ ఫలితాలు వచ్చాయి. మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలోని ఏడు శాసనసభ సెగ్మెంట్లలో నాలుగు చోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది. కీలకమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక, భద్రాచలం, ఇల్లెందు, ములుగు స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందింది. వరంగల్ రూరల్ జిల్లాలోని నర్సంపేట, మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్, మహబూబాబాద్ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ గెలుపొందింది. ఈ నేపథ్యంలో ఎంపీ అభ్యర్థిని మారుస్తారా అనే వా దనలు సైతం వస్తున్నాయి. ఇదే జరిగితే కేసీఆర్ వద్ద మంచి పేరు, పలుకుబడి ఉన్న రామచం ద్రుకు అవకాశం లభిస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో మహబూబాబాద్ లోక్‌సభ టికెట్ వచ్చినట్లే వచ్చి చేజారిన రామచంద్రు.. ఈసారి అవకాశం కోసం ఎదురు చూస్తున్నా రు. టికెట్ ప్రయత్నాల్లో భాగంగా మానుకోట లోక్‌సభ పరిధిలో ఇప్పటికే పలుమార్లు పర్యటించారు. మళ్లీ రేపటి నుంచి అన్ని సెగ్మెంట్లలో పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. భద్రాద్రి జిల్లానే కీలకం.. మానుకోట లోక్‌సభ పరిధిలో భద్రాద్రి జిల్లాలో ఉన్న సెగ్మెంట్లు అత్యంత కీలకం. ఇక్కడ అత్యధికంగా మూడు సెగ్మెంట్లు ఉన్నాయి. అయితే అన్నిచోట్లా విపక్ష కాంగ్రెస్ గెలుపొందింది. తాజాగా పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు గులాబీ తీర్థం పుచ్చుకోనుండడంతో టీఆర్ఎస్లో జిల్లా వ్యాప్తంగా మరింత జోష్ వచ్చింది. ఈ నేపథ్యంలో టికెట్ విషయమై పార్టీ శ్రేణులు ఎదురుచూస్తున్నాయి. మరి ఈ ముగ్గురిలో అదృష్టం ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే. -
ఆస్ట్రేలియా తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్
సిడ్నీ: ఆస్ట్రేలియా తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణా ఢిల్లీ అధికార ప్రతినిధి రామచంద్రు తేజావత్‌తో ముఖాముఖి ఏర్పాటు చేశారు. స్థానిక ఎంపీ మెక్ డెర్మొట్, ఫెడరేషన్ అఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ఆఫ్ ఆస్ట్రేలియా ప్రెసిడెంట్ డాక్టర్ యాదు సింగ్, అచ్తింగ్ మేయర్ గురు ప్రీత్ సింగ్ పాల్గొన్నారు. ఆస్ట్రేలియా ఫోరం అధ్యక్షుడు అశోక్ మాలిష్, కార్యదర్శి డేవిడ్ రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం జై తెలంగాణ నినాదంతో ప్రారంభమైంది. రామచంద్రు తేజావత్ మాట్లాడుతూ, ఉద్యమంలో ఎన్నారైల పాత్ర గొప్పదన్నారు. తెలంగాణ ప్రభుత్వం అవినీతికి తావులేకుండా పనిచేస్తోందని ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన ప్రశంసించిన విషయాన్ని ఆయన గుర్తుకు చేశారు. తెలంగాణ పుననిర్మాణంలో ఎన్నారైలు భాగస్వామ్యం కావాలని పిలుపినిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వాదులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆస్ట్రేలియా టీడీఫ్ ఇంద్రసేనా రెడ్డి, ఎన్నారై టీఆర్ఎస్ సెల్ వైస్ ప్రెసిడెంట్ సుమేషు రెడ్డి సూర్య, తెలంగాణ జాగృతి సెక్రటరీ అనిల్ మునగాల, సిడ్నీ తెలుగు అసోసియేషన్ ట్రెజరర్ శ్రీనివాస్ పిల్లమారి, ఫోరం సభ్యులు శ్రీనివాస్ టూట్కుర్, నర్సింగ్ రావు, పాపిరెడ్డి, మధు మోహన్ రావు, ప్రశాంత్ కడపర్తి, హరిణి సూర్య, రామ్ రెడ్డి, లావణ్య, గోవింద్, ప్రదీప్ సేరి, ప్రదీప్ తెడ్ల తదితరులు పాల్గొన్నారు. -
సంక్షేమానికి పెద్ద పీట
రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తేజోవత్ నాంపల్లి : ఎన్నికల మ్యానిఫెస్టోలో టీఆర్ఎస్ పేదల సంక్షేమానికి పెద్ద పీట వేసిందని, ఈ పథకాల అమలుకు రూ.12 లక్షల కోట్లు ఖర్చవుతుందని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తేజోవత్ అన్నారు. శనివారం పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో తెలంగాణ దళిత హక్కుల చైతన్య యాత్ర ముగింపు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మ్యానిఫెస్టోలోని పొందుపరిచిన పథకాలను అమలు చేస్తున్నా, వాటిని క్షేత్ర స్థాయికి తీసుకెళ్లడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. వీటిని సక్రమంగా అమలు చేసే బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందని, అందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. దళితుల అవసరాలపై పోరాటాలు చేపట్టి సాధించుకోవాలన్నారు. ఉభయ పార్లమెంట్ సభల్లో 184 మంది దళితులు సభ్యులుగా ఉన్నారని, వారు ఏకమైతే సభలను స్తంభింపజేయవచ్చన్నారు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పనిచేస్తే రాబోయే ఎన్నికల్లో టికెట్లు రావనే భయంతో ఉన్నారని, నాకు కాకుంటే మన జాతిలోనే మరొకరికి వస్తుందనే భావన రావాలన్నారు. రాష్ట్రంలో దళితులు ఏకమైతే 55 అసెంబ్లీ సీట్లు సాధించుకోవచ్చునన్నారు. పైసలకు, సారాకు లొంగకుండా సరైన అభ్యర్థికి ఓటు వేస్తే చేతులు చాచి అడుక్కోవాల్సిన అవసరం ఉండదన్నారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ స్పెషల్ ఆఫీసర్ ఆర్.సుబ్బారావు, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్, రాష్ట్ర దళిత సేన అధ్యక్షులు జేబి రాజు, నాయకులు ఆనందరావు, ప్రొఫెసర్ ఎంఎన్ భూషి, మోహన్ రావు, చంద్రయ్య, బోస్, దుర్గం నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. -
‘విభజన’ అంశాలు పరిష్కరించండి
కేంద్ర కేబినెట్ కార్యదర్శితో రామచంద్రు భేటీ సాక్షి, న్యూఢిల్లీ : విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలను పరిష్కరించాలని కేంద్ర కేబినెట్ కార్యదర్శి పీకే సిన్హాకు తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తేజావత్ కోరారు. బుధవారం ఇక్కడ కేబినెట్ కార్యదర్శితో భేటీ అయిన రామచంద్ర తెలంగాణ ప్రభుత్వ ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధి, అమలు చేస్తున్న పారిశ్రామిక విధానం, సంక్షేమ పథకాలను వివరించారు. అభివృద్ధి పథకాల కోసం ప్రపంచ బ్యాంకు సహాయాన్ని తీసుకుంటామని, కేంద్రం కూడా నిధులు ఇవ్వాలని కోరారు. విభజన చట్టంలో ప్రస్తావించిన హైకోర్టు విభజన, సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడం, నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు, గిరిజన విశ్వవిద్యాలయం, రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారుల ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి పురోగతి లేదని కేబినెట్ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లారు. పారిశ్రామిక ప్రోత్సాహకాల కింద రెండు రాయితీలు ఇవ్వడం మినహా కేంద్రం ఏమీ చేయలేదన్నారు. విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలను కేంద్ర హోం శాఖ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్తానని కేబినెట్ కార్యదర్శి హామీ ఇచ్చారని రామచంద్రు తెలిపారు. అనంతరం ఆస్ట్రేలియా హైకమిషనర్ ప్రతినిధులతో కూడా రామచంద్రు భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంపై అవగాహన కల్పించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానం, ప్రాధాన్యమిస్తున్న రంగాలను తెలియచేశారు. పాడిపరిశ్రమ, ఆరోగ్య పరికరాలు, ఫార్మారంగాల్లో పెట్టుబడులకు సహకరిస్తామని ఆస్ట్రేలియా ప్రతినిధులు హామీ ఇచ్చినట్టు రామచంద్రు విలేకరులకు చెప్పారు.