‘విభజన’ అంశాలు పరిష్కరించండి
కేంద్ర కేబినెట్ కార్యదర్శితో రామచంద్రు భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలను పరిష్కరించాలని కేంద్ర కేబినెట్ కార్యదర్శి పీకే సిన్హాకు తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తేజావత్ కోరారు. బుధవారం ఇక్కడ కేబినెట్ కార్యదర్శితో భేటీ అయిన రామచంద్ర తెలంగాణ ప్రభుత్వ ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధి, అమలు చేస్తున్న పారిశ్రామిక విధానం, సంక్షేమ పథకాలను వివరించారు. అభివృద్ధి పథకాల కోసం ప్రపంచ బ్యాంకు సహాయాన్ని తీసుకుంటామని, కేంద్రం కూడా నిధులు ఇవ్వాలని కోరారు. విభజన చట్టంలో ప్రస్తావించిన హైకోర్టు విభజన, సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడం, నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు, గిరిజన విశ్వవిద్యాలయం, రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారుల ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి పురోగతి లేదని కేబినెట్ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లారు.
పారిశ్రామిక ప్రోత్సాహకాల కింద రెండు రాయితీలు ఇవ్వడం మినహా కేంద్రం ఏమీ చేయలేదన్నారు. విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలను కేంద్ర హోం శాఖ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్తానని కేబినెట్ కార్యదర్శి హామీ ఇచ్చారని రామచంద్రు తెలిపారు. అనంతరం ఆస్ట్రేలియా హైకమిషనర్ ప్రతినిధులతో కూడా రామచంద్రు భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంపై అవగాహన కల్పించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానం, ప్రాధాన్యమిస్తున్న రంగాలను తెలియచేశారు. పాడిపరిశ్రమ, ఆరోగ్య పరికరాలు, ఫార్మారంగాల్లో పెట్టుబడులకు సహకరిస్తామని ఆస్ట్రేలియా ప్రతినిధులు హామీ ఇచ్చినట్టు రామచంద్రు విలేకరులకు చెప్పారు.