10 రెట్లు పెరగనున్న ఆన్‌లైన్ రిటైల్ మార్కెట్ కొనుగోళ్లు
న్యూఢిల్లీ: వచ్చే ఐదేళ్లలో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఆన్‌ైలైన్ రిటైల్ మార్కెట్ కొనుగోళ్లు దాదాపు 10 రెట్లు పెరగనున్నాయి. గతేడాది 1.2 బిలియన్ డాలర్లుగా ఉన్న ఆన్‌లైన్ రిటైల్ మార్కెట్ విలువ 2019 నాటికి 14 బిలియన్ డాలర్లకు చేరుతుందని ప్రాపర్టీ కన్సల్టెన్సీ కంపెనీ నైట్ ఫ్రాంక్ తెలిపింది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పుణే నగరాల్లో గతేడాది ఉన్న 59.8 బిలియన్ డాలర్లుగా ఉన్న మొత్తం రిటైల్ మార్కెట్ విలువ 2019 నాటికి రెట్టింపు సంఖ్యతో 127.5 బిలియన్ డాలర్లకు చేరుతుందని నైట్ ఫ్రాంక్ తన ‘థింక్ ఇండియా- థింక్ రిటైల్’ అనే నివేదికలో పేర్కొంది. అలాగే గతేడాది 2 శాతంగా ఉన్న ఆన్‌లైన్ రిటైల్ మార్కెట్ వాటా 2019 నాటికి 5 రెట్లు పెరిగి 11 శాతానికి చేరుతుందని తెలిపింది.
ఇదే సమయంలో సాంప్రదాయక కిరాణ షాపుల మార్కెట్ వాటా మాత్రం 17 శాతం నుంచి 13 శాతానికి తగ్గుతుందని పేర్కొంది. గత దశాబ్ద కాలం నుంచి వినియోగదారుల కొనుగోలు ప్రవర్తనలో మార్పు రావటంతో షాపింగ్ అనే భావనలో దేశవ్యాప్తంగా విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకున్నాయని నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజాల్ చెప్పారు. ఊహించని వృద్ధి కారణంగా రిటైల్ మార్కెట్ స్టాక్ హోల్డర్లను, పెట్టుబడిదారులను విపరీతంగా ఆకర్షిస్తోందని పేర్కొన్నారు.