ట్రాక్టర్స్‌.. మిలియన్‌ మార్చ్‌! | 1989 CaseIH 9180 4WD Tractor Sold for Record Price | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్స్‌.. మిలియన్‌ మార్చ్‌!

Published Wed, Mar 13 2019 12:13 AM | Last Updated on Wed, Mar 13 2019 12:13 AM

1989 CaseIH 9180 4WD Tractor Sold for Record Price - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశంలో ట్రాక్టర్ల పరిశ్రమ మిలియన్‌ మార్కు దిశగా వెళ్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధితో సుమారు 8 లక్షల ట్రాక్టర్లు అమ్ముడవుతాయని పరిశ్రమ ధీమాగా ఉంది. 2020–21లో ఈ సంఖ్య 10 లక్షలు దాటుతుందని అంచనా వేస్తున్నాయి. భారత్‌లో వ్యవసాయంలో యాంత్రీకరణ ప్రాధాన్యత పెరుగుతుండటమే ఈ అంకెలకు కారణమని కంపెనీలు అంటున్నాయి. 2017–18లో దేశంలో 7,11,478 ట్రాక్టర్లు రోడ్డెక్కాయి. అంతక్రితం ఏడాదితో పోలిస్తే 22% అధికం. 2018 ఏప్రిల్‌–2019 ఫిబ్రవరి పీరియడ్‌లో 7,26,164 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2019–20లో సైతం రెండంకెల వృద్ధి  ని పరిశ్రమ ఆశిస్తోంది. వ్యవసాయాధార రాష్ట్రాల్లో కరువుతో పరిశ్రమ 2014–15, 2015–16లో తిరోగమనం చూసింది. ప్రస్తుతం దేశంలో రైతుల వద్ద 45 లక్షల ట్రాక్టర్లున్నట్టు సమాచారం.  

సానుకూల అంశాలు.. 
వ్యవసాయ రంగం దేశవ్యాప్తంగా కార్మికుల కొరతతో సతమతమవుతోంది. కార్మికులు నగరాలకు వలసలు, ఇతర రంగాల వైపు మళ్లడం ఇందుకు కారణం. దీంతో వ్యవసాయానికి యాంత్రికీకరణే పెద్ద అండగా నిలుస్తోంది. మహీంద్రా, టఫే, ఎస్కార్ట్స్, సొనాలికా, జాన్‌ డీర్, క్లాస్‌ అగ్రి మెషినరీ వంటి ప్రధాన కంపెనీలు కొత్త టెక్నాలజీ, సేవలతో రైతులకు చేరువ అవుతున్నాయి. జీడీపీ వృద్ధిరేటు, వాణిజ్య అవసరాలకు ట్రాక్టర్ల వినియోగం, సానుకూల వాతావరణం, నీటి లభ్యత, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహం.. వెరశి ట్రాక్టర్‌ పరిశ్రమ వరుసగా మూడో ఏడాది రెండంకెల వృద్ధి నమోదు చేయనుందని టఫే ఇండియా చైర్మన్‌ మల్లిక శ్రీనివాసన్‌ తెలిపారు. గతంలో కంటే ఇప్పుడు వ్యవసాయ రంగం ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పారు. మూడేళ్లలో వ్యవసాయానికి కేంద్రం చేసిన కేటాయింపులు 9 శాతం పెరిగాయి. సబ్సిడీ స్కీంలు దీనికి అదనం. 21 ప్రధాన రాష్ట్రాలు చేసిన కేటాయింపులు 47 శాతం అధికమయ్యాయి. మరోవైపు ట్రాక్టర్లు కొనుగోలుకు రైతుల కు ఈఎంఐలు ఇవ్వడంలో ఫైనాన్స్‌ కంపెనీలు పోటీపడడం పరిశ్రమకు కలిసి వచ్చే అంశాలు.  

వేగంగా యాంత్రీకరణ.. 
దేశంలో 5.2 శాతం వ్యవసాయ కుటుంబాలు ట్రాక్టర్‌ను కలిగి ఉన్నాయి. పవర్‌ టిల్లర్‌ విషయంలో ఇది 1.8 శాతమేనని నాబార్డ్‌ సర్వే చెబుతోంది. వ్యవసాయం అధికంగా ఉండే ప్రతి రాష్ట్రంలో ఏటా 4,000 రోటావేటర్లు, 3,000 దాకా సీడ్‌ డ్రిల్లర్లు అమ్ముడవుతున్నాయని క్లాస్‌ అగ్రి మెషినరీ చెబు  తోంది. భారత్‌లో 6,70,000 గ్రామాలు ఉన్నాయి. 2016 వరకు ఏటా 6 లక్షల లోపే ట్రాక్టర్ల అమ్మకాలు జరిగాయి. అంటే ఒక్కో ఊరికి ఒక ట్రాక్టర్‌ చొప్పున తీసుకున్నా విక్రయాలు తక్కువే అన్నమాట. గతంలో కంటే ఇప్పుడు యాంత్రీకరణ వేగం గా జరుగుతోందని ఇండో ఫామ్‌ ఎక్విప్‌మెంట్స్‌ డైరెక్టర్‌ డి.ఎల్‌.రానా సాక్షి బిజినెస్‌ బ్యూరోకు తెలిపారు. అమ్మకాలే ఇందుకు నిదర్శనమని, ఈ రంగంలో అపార అవకాశాలు ఉన్నాయని అన్నారు.

పెరగనున్న డిమాండ్‌.. 
ప్రస్తుతం దేశంలో 20 కోట్ల మంది రైతులు యాంత్రికీకరణకు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ట్రాక్టర్లు, యంత్రాల తయారీ కంపెనీలు రెంటల్‌ మోడల్‌తో దూసుకెళ్తున్నాయి. ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలు కొనుగోలు చేసే స్తోమత లేని రైతులు వీటిని అద్దెకు తీసుకోవడానికి పలు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ప్రోత్సహిస్తున్నాయి. కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లను ఔత్సాహిక యువత ద్వారా కంపెనీలు ఏర్పాటు చేయిస్తున్నాయి. వీటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సాయం చేస్తుండడం విశేషం. మూడేళ్లలో 75 మంది యువత ద్వారా దోస్త్‌ సెంటర్లను ఏర్పాటు చేశామని క్లాస్‌ అగ్రి మెషినరీ నేషనల్‌ సేల్స్‌ హెడ్‌ ప్రేమ్‌ కుమార్‌ తెలిపారు. దోస్త్‌ కేంద్రం నిర్వాహకులు యంత్రం కొనుగోలుకు 20 శాతం డౌన్‌ పేమెంట్‌ చేస్తే చాలని చెప్పారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తేనే యాంత్రికీకరణ వేగంగా వృద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement