వచ్చే ఏడాది 2.5 లక్షల ఐటీ కొలువులు
2016లో పరిశ్రమ వృద్ధి 12-14%
- హైసియా వార్షిక సమావేశంలో నాస్కామ్ అధ్యక్షుడు ఆర్. చంద్రశేఖర్
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది(2015-16) భారత సాఫ్ట్‌వేర్ రంగం 12 నుంచి 14 శాతం వృద్ధిని సాధిస్తుందని, దాదాపు 2.5 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందని నాస్కామ్ అధ్యక్షుడు ఆర్.చంద్రశేఖర్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వ డిజిటల్ ఇండియా పథకంతో దేశీయ సాఫ్ట్‌వేర్ వినియోగం పెరగనుందని, అయితే దీన్ని పకడ్బందీగా అమలు చేయడానికి ప్రభుత్వం మరిన్ని పెట్టుబడులు పెట్టాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు.
గురువారమిక్కడ హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్(హైసియా) వార్షిక సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రూ.9 లక్షల కోట్ల సాఫ్ట్‌వేర్ రంగంలో దాదాపు రూ. 6 లక్షల కోట్లు ఎగుమతులదేనని, అయితే దేశీయ మార్కెట్ ఆదాయం రూ.2 లక్షల కోట్లు మించకపోవడం శుభసూచకం కాదని చెప్పారాయన. జీఎస్‌టీ వంటి సంక్లిష్ట పన్నుల విధానం అమలు చేయాలంటే టెక్నాలజీ ద్వారానే సాధ్యమని తెలియజేశారు. ‘‘దాదాపు అన్ని రంగాలూ డిజిటలైజేషన్‌కు వెళుతున్నాయి. కాబట్టి దీనికి కావాల్సిన నైపుణ్యాలను నేర్చుకుని ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలి’’ అని ఆయన సూచించారు.
దేశీయ ఐటీ అభివృద్ధిలో స్టార్టప్ కంపెనీలు కీలకపాత్ర పోషిస్తున్నాయని వాటి ప్రోత్సాహకానికి నాస్కామ్ పలు చర్యలు చేపట్టిందని తెలియజేశారు. దేశంలో 2010 నుంచి దాదాపు రూ.14 వేల కోట్ల పెట్టుబడులతో దాదాపు 3,100 వరకు స్టార్టప్‌లు ఏర్పాటయ్యాయని చెప్పారు. ఇంటర్నెట్ ఆధారిత వస్తువులు (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) విస్తృతమవుతున్న నేపథ్యంలో వాటిని ప్రోత్సహించేందుకు కేంద్రం, నాస్కామ్ సంయుక్తంగా ఐదు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు వెల్లడించారు. సైబర్ సెక్యూరిటీ బలోపేతానికి నాస్కామ్.. ఒకటిరెండు నెలల్లో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయనుందని తెలిపారు.