2,500 కోట్ల రుణ రికవరీ లక్ష్యం | 2,500 crore loan recovery target | Sakshi
Sakshi News home page

2,500 కోట్ల రుణ రికవరీ లక్ష్యం

Published Sat, May 10 2014 1:11 AM | Last Updated on Sat, Sep 2 2017 7:08 AM

2,500 కోట్ల రుణ రికవరీ లక్ష్యం

2,500 కోట్ల రుణ రికవరీ లక్ష్యం

సిండికేట్ బ్యాంక్  ఎగ్జిక్యూటివ్  డెరైక్టర్ ఆంజనేయ ప్రసాద్

* ఎన్‌పీఏలను 2% తగ్గిస్తాం
* ఈ ఏడాది రూ.2,650 కోట్ల మూలధనం అవసరం
* రాష్ట్రంలో కొత్తగా 100 శాఖలు, వైజాగ్‌లో రీజనల్ కార్యాలయం

 
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారీగా పెరుగుతున్న నిరర్థక ఆస్తులను తగ్గించుకోవడంపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు ప్రభుత్వరంగ సిండికేట్ బ్యాంక్ ప్రకటించింది. పేరుకుపోయిన మొండి బకాయిలను వసూలు చేయడానికి ‘స్టార్ట్’ పేరుతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడంతో పాటు, రూ.5 లక్షలోపు బకాయిలపై వన్‌టైమ్ సెటిల్‌మెంట్ (ఓటీఎస్) అధికారాలను బ్యాంకు మేనేజర్లకే అప్పచెపుతున్నట్లు సిండికేట్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఎం.ఆంజనేయ ప్రసాద్ తెలిపారు. రూ. 10 లక్షల లోపు ఉన్న నిరర్థక ఆస్తులను స్టార్ట్ టీమ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందన్నారు. గతేడాది రూ.1,800 కోట్లు మొండి బకాయిలను వసూలు చేయగా, అది ఈ ఏడాది రూ.2,500 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అలాగే ఈ ఏడాది చివరి నాటికి స్థూల ఎన్‌పీఏని రెండు శాతం దిగువకి తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ప్రసాద్ తెలిపారు. మార్చి నాటికి సిండికేట్ బ్యాంక్ స్థూల ఎన్‌పీఏ 2.62 శాతం, నికర ఎన్‌పీఏ 1.56 శాతంగా ఉన్నాయి.

 రూ.2,650 కోట్లు కావాలి : ఈ ఏడాది వ్యాపారంలో 20 నుంచి 22 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్లు ఆంజనేయ ప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం రూ.3.88 లక్షల  కోట్లుగా ఉన్న వ్యాపార పరిమాణం వచ్చే మార్చి నాటికి రూ.4.79 లక్షల కోట్లకు చేర్చాలన్నది లక్ష్యమన్నారు. ఇందుకోసం రూ.2,650 కోట్ల మూలధనం అవసరమవుతుందని  తెలిపారు. డిపాజిట్ల సేకరణ వ్యయాన్ని తగ్గించుకోవడానికి తక్కువ వడ్డీరేట్లకు విదేశీ బాండ్లను సేకరించనున్నామని, ఇందులో భాగంగా ఈ నెలాఖరులోగా రూ.2,100 కోట్లు సేకరించనున్నామన్నారు.

 100 శాఖలు :  ఈ ఏడాది దేశా వ్యాప్తంగా 350 కొత్త శాఖలను ఏర్పాటు చేయనున్నట్లు సిండికేట్ బ్యాంక్ ప్రకటించింది. ఇందులో 100 శాఖలను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రసాద్ తెలిపారు. రాష్ట్ర విభజన జరుగుతుండటంతో విశాఖపట్నంలో ఈ ఏడాదిలోగా ఒక ప్రాంతీయ కార్యాలయాన్ని, వచ్చే ఏడాది తెలంగాణాలో మరో ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ ఏడాది రాష్ర్టంలో శాఖల సంఖ్యను 500 నుంచి 600కి పెంచడంతోపాటు, వ్యాపార పరిమాణాన్ని రూ.40,000 కోట్ల నుంచి రూ.50,000 కోట్లకు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement