సిండికేట్ బ్యాంక్ విస్తరణ జోరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ సిండికేట్ బ్యాంక్ రాష్ట్రంలో భారీ విస్తరణ ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. ఇందుకోసం కొత్తగా రెండు రీజనల్ ఆఫీసులతోపాటు, ఫీల్డ్ జనరల్ మేనేజర్ ఆఫీసును(ఎఫ్‌ఎంజీవో) ఏర్పాటు చేస్తోంది. వచ్చే నెల నవంబర్ 1 నుంచి ఒంగోలు రీజనల్ ఆఫీసు, ఎఫ్‌ఎంజీవో ఆఫీసు అందుబాటులోకి వస్తుందని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో విశాఖపట్నం ఆఫీసును ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు సిండికేట్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఎం.ఆంజనేయ ప్రసాద్ తెలిపారు.
బుధవారం హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ కొత్త కార్యాలయాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సిండికేట్ బ్యాంకును లోకల్ బ్యాంక్ స్థాయికి తీసుకెళ్ళాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 459 శాఖలు ఉండటమే కాకుండా ఐదు జిల్లాల్లో ప్రధాన బ్యాంక్ హోదాను కలిగి ఉన్నామని, వచ్చే మార్చిలోగా మరో 40 శాఖలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. అలాగే గతేడాది రూ.30,000 కోట్లుగా ఉన్న రాష్ట్ర బ్యాంకింగ్ వ్యాపారాన్ని ఈ ఏడాది రూ.40,000 కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
వచ్చే రెండేళ్ళలో 2,500 మంది ఆఫీసర్లు, 2,300 మంది క్లరికల్ సిబ్బందిని నియమించుకోనున్నట్లు ప్రసాద్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రూ.200 కోట్ల మూలధనం కేటాయించిందని, అవసరమైతే క్యూఐపీ, రైట్స్ ఇష్యూ ద్వారా రూ.1,500 కోట్లు సమకూర్చుకోవడానికి అనుమతులున్నాయన్నారు. ప్రస్తుతానికి డిపాజిట్లు, రుణాలపై వడ్డీరేట్లు మారే అవకాశాలు లేవన్నారు.