ఉక్కు ఉత్పత్తుల దిగుమతిపై 20% రక్షణాత్మక సుంకం
తక్షణం అమల్లోకి
- 200 రోజుల పాటు వర్తింపు
- దేశీయ పరిశ్రమ ప్రయోజనాలకే
- ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ
న్యూఢిల్లీ: విదేశాల నుంచి దిగుమతయ్యే కొన్ని కేటగిరీల ఉక్కు ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం 20 శాతం రక్షణాత్మక సుంకం విధించింది. చౌక ధరల్లో ఉక్కు ఉత్పత్తుల దిగుమతులు వెల్లువెత్తుతుండటంతో దేశీయ ఉక్కు పరిశ్రమను రక్షించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. ఈ సుంకం తక్షణం అమల్లోకి వస్తుందని, దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ అయిందని పేర్కొన్నారు. ఈ సుంకం 200 రోజుల పాటు అమల్లో ఉంటుందని వివరించారు. ఈ సుంకం పెంపు కారణంగా దేశీయ ఉక్కు రంగానికి లాభకరమని, ఈ లాభం స్వల్పకాలానికే పరిమితమయ్యే అవకాశాలున్నాయని విశ్లేషకులంటున్నారు.
రక్షణాత్మక సుంకం అన్ని దేశాల దిగుమతులకు వర్తిస్తుంది. దిగుమతి సుంకం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలున్న దేశాలకు వర్తించదు. చౌక ధరల ఉత్పత్తుల నుంచి దేశీయ పరిశ్రమను కాపాడు కోవడానికి నిర్దేశిత గడువు వరకూ రక్షణాత్మక సుంకాలు విధించడం వంటి తాత్కాలిక చర్యలు తీసుకోవచ్చని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) మార్గదర్శకాలు పేర్కొంటున్నాయి. మరోవైపు చైనా తన కరెన్సీ యువాన్ విలువను తగ్గించడంతో ఆ దేశం నుంచి ఉక్కు, ఇనుము ఉత్పత్తుల ధరలు తగ్గి దిగుమతులు పెరిగాయి. దీంతో గత నెలలో ప్రభుత్వం బేస్ మెటల్స్ దిగుమతులపై దిగుమతి సుంకాన్ని 2.5% పెంచింది.