మార్కెట్ పంచాంగం
భారత్ సూచీల్లో భాగమైన రెండు ప్రధాన షేర్లు హిందుస్థాన్ యూనీలీవర్ (హెచ్‌యూఎల్), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు కొత్త రికార్డును సృష్టించడంవల్ల ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరుగుతుందని, తద్వారా సమీప భవిష్యత్తులో మార్కెట్ భారీగా పతనమయ్యే ప్రమాదం తప్పుతుందని గత మార్కెట్ పంచాంగంలో సూచించాం.
ఈ రెండు షేర్లూ గతవారం కూడా ర్యాలీ జరిపి మరో కొత్త రికార్డును సృష్టించడంతో పాటు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలో అధిక వెయిటేజీ కలిగిన బ్యాంక్ నిఫ్టీ నూతన గరిష్టస్థాయికి చేరింది. బ్యాంక్ నిఫ్టీ ర్యాలీ కొనసాగితే ప్రధాన సూచీలు సైతం వచ్చే కొద్దిరోజుల్లో నూతన శిఖరాలను అధిరోహిస్తాయి. అలా కాకుండా బ్యాంక్ నిఫ్టీ వెనుతిరిగితే సాంకేతికంగా మార్కెట్ డేంజర్‌జోన్‌లో ప్రవేశించినట్లే. ఇక సూచీల సాంకేతికాంశాలకొస్తే...
సెన్సెక్స్ సాంకేతికాంశాలు...
జనవరి 16తో ముగిసినవారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ ఒక్క ఉదుటన ర్యాలీ జరిపి 28,194 పాయింట్ల గరిష్టస్థాయికి పెరిగింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 664 పాయింట్ల భారీ లాభంతో 28,122 వద్ద ముగిసింది. గత శుక్రవారం అమెరికా సూచీల పెరిగిన ప్రభావంతో ఈ సోమవారం సెన్సెక్స్ గ్యాప్‌అప్‌తో మొదలైతే 28,380 పాయింట్ల వద్దకు చేరవచ్చు. ఆపైన ముగిస్తే వేగంగా 28,570 స్థాయిని అందుకోవొచ్చు.
ఇక అటుపై కీలక అవరోధం 28,822 పాయింట్ల స్థాయి (నవంబర్ 28నాటి ఆల్‌టైమ్ రికార్డుస్థాయి ఇది). ఇదే స్థాయి నుంచి గతంలో భారీ ట్రేడింగ్ పరిమాణంతో మార్కెట్ క్షీణించినందున.. ఈ నెలలో 29,000 శిఖరాన్ని అందుకోవాలంటే ఈ స్థాయిని ఛేదించి, స్థిరపడాల్సివుంటుంది. అంతకుముందు 28,500-600 అవరోధ శ్రేణిని సెన్సెక్స్ దాటాల్సివుంటుంది. ఈ శ్రేణిని అధిగమించలేకపోతే 27,940 పాయింట్ల వద్ద తొలి మద్దతు లభిస్తున్నది. ఈ లోపున క్రమేపీ 27,700 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈ స్థాయిని సైతం కోల్పోతే 27,500-27,600 పాయింట్ల శ్రేణి వద్ద కీలకమైన మద్దతు వుంది. ఈ మద్దతును కోల్పోతే సూచీ తిరిగి డౌన్‌ట్రెండ్‌లోకి ప్రవేశించే ప్రమాదం వుంటుంది.
నిఫ్టీ 8,545పైన స్థిరపడితే ర్యాలీ
నవంబర్ చివరివారం-డిసెంబర్ తొలివారం మధ్య జరిగిన ర్యాలీతో పోలిస్తే ఈ దఫా అప్‌ట్రెండ్‌లో సెన్సెక్స్‌కంటే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ వేగం ఎక్కువగా వున్నందున ఈ సూచీయే తొలుత కొత్త రికార్డు నెలకొల్పే ఛాన్స్ వుంది. జనవరి 16తో ముగిసినవారంలో అంతక్రితం వారంతో పోలిస్తే 229 పాయింట్లు పెరిగిన నిఫ్టీ 8,514 వద్ద ముగిసింది. ఈ సోమవారం గ్యాప్‌అప్ ట్రేడింగ్ జరిగితే 8,545 పాయింట్ల సమీపంలో నిఫ్టీ ప్రారంభం కావొచ్చు. ఆపైన స్థిరపడితే 8,590 పాయింట్ల స్థాయిని చేరవచ్చు.
అటుపై క్రమేపీ డిసెంబర్ 4నాటి రికార్డుస్థాయి 8,627 పాయింట్లను అందుకోవచ్చు. మరింత ర్యాలీ కొనసాగితే 8,700-8,750 పాయింట్ల శ్రేణిని చేరవచ్చు. ఈ వారం 8,545 స్థాయిపైన స్థిరపడలేకపోతే 8,450 వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ లోపున 8,380 స్థాయి వరకూ తగ్గవచ్చు. ఈ స్థాయిని కూడా కోల్పోతే 8,300-8,330 శ్రేణి వద్ద లభించే మద్దతు కీలకం. ఈ మద్దతు శ్రేణిని కోల్పోతే తిరిగి డౌన్‌ట్రెండ్‌లోకి నిఫ్టీ మళ్లవచ్చు.
అవరోధ శ్రేణి 28,500 -28,600
Published Mon, Jan 19 2015 1:14 AM | Last Updated on Sat, Sep 2 2017 7:52 PM
Advertisement
Advertisement