3 నెలల కనిష్టానికి రూపాయి
50 పైసలు పతనం
ముంబై: బ్యాంకులు, దిగుమతి సంస్థల నుంచి డాలర్లకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో రూపాయి మారకం విలువ మూడు నెలల కనిష్టానికి క్షీణించింది. డాలర్‌తో పోలిస్తే 50 పైసలు పతనమై 63.32 వద్ద ముగిసింది. ఈక్విటీ మార్కెట్లు నుంచి విదేశీ నిధులు తరలిపోతుండటం కూడా దీనికి కారణమైంది. గురువారం ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో క్రితం ముగింపు 62.82తో పోలిస్తే బలహీనంగా 62.95 వద్ద రూపాయి ట్రేడింగ్ ప్రారంభమైంది.
ఆ తర్వాత ఒక దశలో 63.34 స్థాయికి కూడా క్షీణించింది. చివరికి 50 పైసల నష్టంతో 63.32 వద్ద ముగిసింది. చివరిసారిగా జనవరి 6న 63.57 స్థాయి దగ్గర రూపాయి క్లోజయ్యింది. మిగతా కరెన్సీలతో పోలిస్తే డాలర్ సూచీ 0.03 శాతం మేర పెరిగింది.