సొంత వ్యాపారానికే యువతరం సై...
న్యూఢిల్లీ: ఆరంకెల వేతనం అందుకుంటూ హాయిగా బతికేస్తే పోలా... అనుకునే ఆలోచనను యువతరం వదిలించుకుంటున్నది. తమతో పాటు మరికొందరికి ఉపాధి చూపుతూ పైపైకి ఎదగాలని యువత ఉవ్విళ్లూరుతున్నట్టు ఓ సర్వే తేల్చింది. భారత ఉద్యోగుల్లో వాణిజ్యవేత్త కావాలనే తాపత్రయం ఎక్కువగా ఉన్నట్టు రాండ్‌స్టాడ్ వర్క్ మానిటర్ సర్వేలో వెల్లడైంది. ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగుల్లో ఎంటర్‌ప్రెన్యూర్ కావాలనుకోనే అభిలాష సగటున 53 శాతంగా ఉండగా, భారత ఉద్యోగుల్లో 83 శాతం మంది ఈ ఆలోచనతో ఉన్నారు.
సొంత బిజినెస్ ప్రారంభించేందుకే ఉద్యోగాలను విడిచిపెడుతున్నామని 56 శాతం మంది చెప్పారు. వ్యాపారానికి సానుకూల వాతావరణం నెలకొనడం, ఎఫ్‌డీఐ పరిమితులు పెంచడం, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాలతో యువత వ్యాపారాలను ఎంచుకుంటున్నారని రాండ్‌స్టాడ్ ఇండియా ఎండీ, సీఈఓ పౌల్ డుపిస్ తెలిపారు. యువతతో పోలిస్తే 45-54 మధ్య వయసు కలిగిన ఉద్యోగులు సొంత వ్యాపారం చేపట్టేందుకు వెనుకాడుతున్నారు. వీరిలో కేవలం 37 శాతం మంది మాత్రమే వ్యాపారాలకు ఓటేశారు. 35 నుంచి 44 సంవత్సరాల లోపు ఉద్యోగులు 61 శాతం మేర సొంత వ్యాపారాలే మేలని చెప్పారు.
ఇక 25 నుంచి 34 ఏళ్ల యువ ఉద్యోగుల్లో ఏకంగా 72 శాతం మంది సొంత వ్యాపారాలు చేపట్టడానికి ఆసక్తి కనబరిచారని సర్వే తేల్చింది. భారత్‌లో స్టార్టప్‌ను ప్రారంభించేందుకు ప్రస్తుత వాతావరణం ప్రోత్సాహకరంగా ఉందని సర్వేలో పాల్గొన్న వారిలో 86 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు.