9 బ్యాంకులకు రూ.6,990 కోట్ల నిధులు
ఎస్‌బీఐకు అధికంగా రూ.2,970 కోట్లు: కేంద్రం
న్యూఢిల్లీ: ఎట్టకేలకు పభుత్వ రంగ బ్యాంకులకు కేంద్రం సాయం అందించింది. మొత్తం తొమ్మిది ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూల ధన అవసరాల కింద రూ.6,990 కోట్ల నిధులను అందజేస్తున్నట్లు శనివారం స్పష్టంచేసింది. ఎన్ పీఏల కారణంగా నిధుల కొరతను ఎదుర్కొంటున్న బ్యాంకులు... తమ కార్యకలాపాలను సజావుగా నిర్వహించేందుకు, మరిన్ని రుణాలిచ్చేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయి.
అన్ని బ్యాంకుల కంటే ఎస్‌బీఐకు అధికంగా (రూ.2,970 కోట్లు) నిధులు లభిస్తాయి. బ్యాంక్ ఆఫ్ బరోడాకు రూ.1,260 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు రూ.870 కోట్లు, కెనరా బ్యాంక్‌కు రూ.570 కోట్లు, సిండికేట్ బ్యాంక్‌కు రూ.460 కోట్లు, అలహాబాద్ బ్యాంక్‌కు రూ.320 కోట్లు, ఇండియన్ బ్యాంక్‌కు రూ.280 కోట్లు, దేనా బ్యాంక్‌కు రూ.140 కోట్లు, ఆంధ్రాబ్యాంక్‌కు రూ.120 కోట్లు చొప్పున లభిస్తాయి. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో పీఎస్‌యూ బ్యాంకులకు రూ.11,200 కోట్లు మూలధన నిధులు కేటాయించగా, మొదటి విడతగా రూ.6,990 కోట్లను అందిస్తోంది. మిగిలిన రూ.4,210 కోట్ల నిధులపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. బాసెల్-3 నిబంధనలను అందుకోవాలంటే బ్యాంక్‌లకు 2018 కల్లా రూ.2.4 లక్షల కోట్ల పెట్టుబడులు కావాలి.