చౌక వడ్డీరేట్లు ఆఫర్ చేసే బ్యాంకిదే!
చౌక వడ్డీరేట్లు ఆఫర్ చేసే బ్యాంకిదే!
Published Tue, Jan 10 2017 2:03 PM | Last Updated on Tue, Sep 5 2017 12:55 AM
స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా.. గృహరుణ వడ్డీ రేట్లలో అత్యంత చౌక రేట్లను ఆఫర్ చేస్తున్న బ్యాంకుగా ముందు నుంచి తెగ పేరుంది. ఆ పేరును ఇప్పుడు ఎస్బీఐ ప్రత్యర్థి బ్యాంకు ఆఫ్ బరోడా కొట్టేసింది. ఎస్బీఐ కంటే అత్యంత చౌక గృహ రుణ వడ్డీరేట్లను ఆఫర్ చేస్తున్న బ్యాంకుగా బ్యాంకు ఆఫ్ బరోడా నిలుస్తోంది. ప్రస్తుతం ఈ బ్యాంకు తన కస్టమర్లకు ఆఫర్ చేసే గృహ రుణాలపై వడ్డీరేట్లు తక్కువగా 8.35 శాతంగా ఉన్నాయి.. వడ్డీరేట్లపై 70 బేసిస్ పాయింట్లను కట్ చేయడంతో ఈ రేట్లు 8.35 శాతానికి దిగొచ్చాయి. సిబిల్ స్కోర్(రుణం పొందాలనుకునే వారి విశ్వసనీయత) మెరుగ్గా ఉన్న కస్టమర్లకే ఈ వడ్డీరేట్లు త్వరగా అందుబాటులో ఉండనున్నాయని బ్యాంకు తెలిపింది.
పెద్ద నోట్ల రద్దు అనంతరం బ్యాంకులకు భారీ ఎత్తున్న డిపాజిట్లు వెల్లువెత్తడంతో చాలా బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి. ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్బీఐ, ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ వంటివి కూడా వారి వడ్డీరేట్లను తగ్గించాయి. ఈ క్రమంలోనే బ్యాంకు ఆఫ్ బరోడా కూడా వడ్డీరేట్లపై కోత పెట్టింది. ప్రస్తుతం ఎస్బీఐ గృహ రుణాలపై 8.50 శాతం వడ్డీరేట్లను వసూలు చేస్తోంది. తగ్గిన వడ్డీరేట్ల ప్రకారం ఎస్బీఐ ఆఫర్ చేసే వడ్డీరేట్ల కంటే బ్యాంకు ఆఫ్ బరోడా ఆఫర్ చేస్తున్న వడ్డీరేట్లే చాలా చౌకగా ఉన్నాయని తెలిసింది. ఎలాంటి ఛార్జీలు అవసరం లేకుండానే బేస్రేట్లతో లింక్ అయిన రుణాలు , కొత్త ఎంసీఎల్ఆర్లోకి మార్చుకునే వెసులుబాటును కూడా ఈ బ్యాంకు ఆఫర్ చేస్తోంది. కానీ ఎస్బీఐ లాంటి ఇతర బ్యాంకులు కొత్త ఎంసీఎల్ఆర్లోకి మారడానికి ఫీజులు వసూలు చేస్తున్నాయి.
Advertisement