మొండి బకాయిలు ఫర్ సేల్!
ఎన్‌పీఏలను వదిలించుకోవడానికి బ్యాంకుల ‘ఆర్క్స్’ మంత్రం
తొలిసారిగా ఎన్‌పీఏలను అమ్మడానికి ముందుకొచ్చిన ఎస్‌బీఐ
ఇదే బాటలో రాష్ట్ర బ్యాంకులు...
ఈ ఏడాది రూ.20,000 కోట్ల ఎన్‌పీఏలను కొంటున్న ఆర్క్స్...
వచ్చే ఏడాదికి రూ.50 వేల కోట్ల పైమాటే..!
కొండలా పెరిగిపోతున్న మొండి బకాయిలతో చైర్మన్ పదవులకే ఎసరు వస్తుండటంతో బ్యాంకులు ఇప్పుడు వాటిని వదిలించుకునే పనిలో పడ్డాయి. దీంతో బ్యాంకులు ఇకరావు అని ఆశలు వదులుకున్న మొండి బకాయిలను వేరే సంస్థలకు అమ్మేసి, బ్యాలెన్స్ షీట్స్‌ను చక్కదిద్దుకుంటున్నాయి. ఏదో చిన్నా చితకా బ్యాంకులు కాదు ఎస్‌బీఐ వంటి దేశీయ అతిపెద్ద బ్యాంకు కూడా ఇదే పనిలో ఉండటం గమనార్హం. ఈ వ్యాపారం బాగుండటంతో మొండి బకాయిలను కొనుగోలు చేసే సంస్థలు.. అసెట్ రీకనస్ట్రక్షన్ కంపెనీల(ఆర్క్స్)కు డిమాండ్ బాగా పెరిగింది.
ఇప్పుడు బ్యాంకింగ్ రంగాన్ని బాగా కుదిపేస్తున్న అతిపెద్ద సమస్య మొండి బకాయిలు. ఈ నిరర్థక ఆస్తుల (ఎన్‌పీఏల) వల్ల యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీఎండీ రాజీనామా చేయాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎంత దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఉద్యోగాలకే ఎసరు వస్తుండటంతో ప్రభుత్వరంగ బ్యాంకులు ఈ మొండి బకాయిలను తగ్గించుకునే పనిలో పడ్డాయి. యునెటైడ్ బ్యాంక్ ఇప్పటికే రూ.700 కోట్ల మొండి బకాయిలను వదిలించుకోగా, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, సిండికేట్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లు ఇప్పటికే ఈ పనిలో ఉన్నాయి. ఇప్పుడు వీటికి జతగా దేశీయ అతిపెద్ద బ్యాంక్ తొలిసారిగా ఎస్‌బీఐ వచ్చి చేరింది. మొండి బకాయిలను తగ్గించుకోవడానికి ఈ త్రైమాసికంలోనే ఎన్‌పీఏలను విక్రయిస్తున్నట్లు ఎస్‌బీఐ చైర్మన్ అరుంధతీ భట్టాచార్య ప్రకటించింది.
ఎస్‌బీఐ స్థూల నిరర్థక ఆస్తులు డిసెంబర్ త్రైమాసికానికి 5.76 శాతానికి చేరి భయపెడుతున్నాయి. అంతేకాదు ఈ ఒక్క త్రైమాసికంలోనే రూ.6,100 కోట్ల రుణాలను పునర్ వ్యవస్థీకరించగా మరో రూ.9,500 కోట్ల రుణాలు ఇందుకోసం ఎదురు చూస్తున్నాయి. దీంతో ఎస్‌బీఐ కూడా ఆర్క్స్‌కు విక్రయించడం ద్వారా ఎన్‌పీఏలను తగ్గించుకోవాలని చూస్తోంది. రాష్ట్రానికి చెందిన ఆంధ్రాబ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరా బాద్‌లు కూడా ఇదే విధమైన ఆలోచనలో ఉన్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.525 కోట్ల మొండి బకాయిలను విక్రయించాలని నిర్ణయం తీసుకున్నామని, ఇప్పటికే వీటిని గుర్తించినట్లు ఎస్‌బీహెచ్ మేనేజింగ్ డెరైక్టర్ ఎం.భగవంతరావు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎటువంటి మొండి బకాయిలను విక్రయించడం లేదని, వచ్చే సంవత్సరం విక్రయించడానికి ఆస్తులను గుర్తిస్తున్నట్లు ఆంధ్రాబ్యాంక్ సీఎండి సీవీఆర్ రాజేంద్రన్ తెలిపారు.
ఆర్క్స్‌కి నిధుల కొరత
దేశంలో అసెట్ రీకనస్ట్రక్షన్ వ్యాపారం 2000 సంవత్సరంలోనే ప్రారంభమైనప్పటికీ ఈ మధ్యనే ఇది బాగా విస్తరిస్తోంది. దేశంలోని 15 ప్రధాన బ్యాంకులు కలిసి అసెట్ రీకనస్ట్రక్షన్ కంపెనీ (ఇండియా) పేరుతో ప్రారంభించాయి. ఇప్పుడిదే అదిపెద్ద ఆర్క్‌గా ఉంది. దీనికి తోడు ఇప్పుడు ఎడల్‌విస్, జేఎం ఫైనాన్షియల్, ఇన్వెన్ట్ అసెట్ సెక్యూరిటైజేషన్ వంటి సంస్థలు కూడా వచ్చి చేరాయి. ఎన్‌పీఏలు పెరిగి వ్యాపారం పెరగడంతో వీటిని కొనడానికి తగినంత మూలధనం లేక ఈ సంస్థలు ఇబ్బందులు పడుతున్నాయి. ప్రస్తుతం ఆర్క్స్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 100 శాతం అనుమతిస్తున్నా, ఒక విదేశీ సంస్థకు 49 శాతం మించి వాటా ఉండకూడదన్న నిబంధన వ్యాపార విస్తరణకు ప్రధాన అడ్డంకిగా మారిందని, దీన్ని సవరించాలని ఈ సంస్థలు ఆర్‌బీఐని కోరుతున్నాయి.
- బిజినెస్ బ్యూరో, హైదరాబాద్
అమ్మకానికి రూ. 50 వేల కోట్ల ఎన్‌పీఏలు
ఆర్థిక వృద్ధి మందగించడంతో నిరర్థక ఆస్తుల విక్రయ వ్యాపారం ఏటా రెట్టింపు స్థాయిలో వృద్ది చెందుతున్నట్లు గణాంకాలు తెలియచేస్తున్నాయి. 2012-13 ఆర్థిక సంవత్సరంలో రూ.12,000 కోట్లుగా ఉన్న ఆర్క్స్ వ్యాపారం ఈ ఆర్థిక సంవత్సరాంతానికి రూ.20,000 కోట్లు దాటుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం(2014-15)లో ఈ వ్యాపారం పరిమాణం రూ.50,000 కోట్లు దాటొచ్చని ఒక అంచనా.